తెరపైకి కొత్త కలెక్టరేట్
ABN , Publish Date - Aug 31 , 2024 | 12:12 AM
జిల్లా కేంద్రమైన భీమవరంలో శాశ్వత కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. ఆ దిశగా భూసేకరణ చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు జిల్లా అధికారులకు సూచించారు.
అద్దె భవనంలో కొనసాగుతున్న కలెక్టర్ కార్యాలయం
ప్రతిపాదనలు సిద్ధం చేసే దిశగా అడుగులు
గతంలో ఏఎంసీ స్థలం కేటాయింపు
ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాలు ఉండేలా తాజా ప్రణాళిక
భూసేకరణకు సన్నాహాలు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లా కేంద్రమైన భీమవరంలో శాశ్వత కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా ప్రణాళిక చేస్తున్నారు. ఆ దిశగా భూసేకరణ చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు జిల్లా అధికారులకు సూచించారు. వైసీపీ హయాంలో భీమవరం ఏఎంసీ స్థలాన్ని కలెక్టరేట్ కోసం కేటాయించారు. ఉత్తర్వులు జారీచేశారు. రెవెన్యూ శాఖ మరో అడుగు ముందుకేసింది. ఆర్‌అండ్‌బీ శాఖకు బదలాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కానీ అప్పట్లో నిధులు మాత్రం విడుదల చేయలేదు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ప్రభుత్వం పక్కనపెట్టేసింది. మార్కెట్ కమిటీ స్థలాన్ని ఇచ్చేది లేదంటూ అప్పట్లో పాలకవర్గం కూడా వ్యతిరేకించింది. మార్కెటింగ్ శాఖ కూడా అదే ఉద్దేశంతో ఉంది. అప్పటి జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వక సమాచారం కూడా ఇచ్చారు. కానీ వైసీపీ ప్రభుత్వం మార్కెట్ కమిటీ స్థలాన్ని జిల్లా కలెక్టరేట్‌కు కేటాయించింది. దాంతో ఏఎంసీ ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంపై మార్కెటింగ్ శాఖ తర్జనభర్జనలు పడింది. రెవెన్యూశాఖకే స్థలం చూపించాలంటూ లేఖ రాసింది. కానీ ఇంత వరకు భీమవరం ఏఎంసీ విషయంపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఈ క్రమంలో కలెక్టరేట్‌తోపాటు, జిల్లాకు చెందిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట నిర్మించాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. అదే జరిగితే దాదాపు 40 ఎకరాల భూమి అవసరం కానుంది. ప్రస్తుతం కేటాయించిన ఏఎంసీలో 20 ఎకరాల భూమి మాత్రమే ఉంది. కార్యాలయాలన్నీ నిర్మించడానికి ఆ స్థలం సరిపోదు. ఫలితంగా అవసరమైన భూమి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలంటూ జిల్లా కలెక్టర్‌కు ప్రజాప్రతినిధులు సూచించారు. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు సైతం కొత్త స్థలాన్ని సేకరించేందుకే మొగ్గుచూపుతున్నారు. దాంతో కలెక్టరేట్ విషయం మళ్లీ చర్చనీయాంశంగా మారింది.
ఒకేచోట కార్యాలయాలు ఉంటే..
జిల్లా ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటుంది. రవాణా సౌకర్యం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జిల్లా కార్యాలయాలు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నాయి. అద్దెభవనంలో కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. అందులోనే అత్యధిక జిల్లా కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. డీఆర్‌డీఏ, ఆర్‌అండ్‌బి, ఆర్‌డబ్ల్యుఎస్, పంచాయతీరాజ్, విద్యుత్‌శాఖ వంటి కార్యాలయాలను మాత్రమే ఇతర చోట్ల ఉన్నాయి. అద్దె భవనంలో కార్యాలయాలకు సరైన వసతులు లేవు. వైసీపీ హయాంలో పెద్దగా నిధులు కేటాయించలేదు. ఏలూరు నుంచే ఫర్నీచర్‌ను తెచ్చుకున్నారు. దాతల సహకారంతో వసతులు ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు కార్యాలయం ఊరుకి దూరంగా ఉంది. జనాలు కలెక్టరేట్‌కు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉంటే రవాణా సౌకర్యం కల్పించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. కొత్త కలెక్టరేట్‌ను ఆ విధంగా ఏర్పాటు చేయాలని కూటమి నేతలు తలపోస్తున్నారు. గతంలో కేటాయించిన ఏఎంసీకి రవాణా సౌకర్యం ఉంది. కానీ ఏఎంసీని కోల్పోతే కొత్తగా ఏర్పాటు చేయడం మళ్లీ కష్టతరమవుతుంది. నియోజకవర్గ పరిధిలోనే ఏఎంసీ ఉండాలి. ప్రధాన రహదారులకు ఆనుకుని ఏర్పాటు చేయాలి. గోదాములు నిర్మించాలంటే అదనంగా నిధులు కేటాయించాలి. ఇవన్నీ సాధ్యమయ్యే పనికాదు. దాంతో కలెక్టరేట్‌నే కొత్తగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.