Share News

సమాజాన్ని మేల్కొల్పడంలో నాటికలు కీలకం

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:51 PM

మరికొంత వినోదం, సందేశం ఒకవైపు, జీవిత సారాంశం మరోవైపు కలగలిపి ఏలూరు వైఎం హెచ్‌ఏ ప్రాంగణంలో జరుగుతున్న అల్లూరి సీతారామ రాజు స్మారక రాష్ట్రస్థాయి నాటిక పోటీలు రసవత్తరంగా సాగుతు న్నాయి.

సమాజాన్ని మేల్కొల్పడంలో నాటికలు కీలకం
రాత నాటికలో సన్నివేశం

ఏలూరు రూరల్‌, జూలై 5: మరికొంత వినోదం, సందేశం ఒకవైపు, జీవిత సారాంశం మరోవైపు కలగలిపి ఏలూరు వైఎం హెచ్‌ఏ ప్రాంగణంలో జరుగుతున్న అల్లూరి సీతారామ రాజు స్మారక రాష్ట్రస్థాయి నాటిక పోటీలు రసవత్తరంగా సాగుతు న్నాయి. వైఎంహెచ్‌ఏ హేలాపురి కళాపరిషత్‌ సం యుక్త ఆధ్వర్యంలో నాటిక పోటీలు రెండోరోజు శుక్రవారం హేలాపురి కళాపరిషత్‌ అధ్యక్షుడు పెదపాటి రామకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొల్పడంలో నాటికలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.

‘రాత’ నాటిక

తొలుత పోలిదాసు శ్రీనివాసరావు రచించి దర్శకత్వం వహించిన ’రాత’ నాటికను వెలగలేరు థియేటర్‌ ఆర్ట్స్‌ కళాకారులు ప్రదర్శించారు. మనిషికి కష్టం కలిగితే నా రాత ఇంతే నా రాత బాగోలేదు అంటూ ఉంటాడు. సుఖం విషయంలో మాత్రం రాతను గాలికి వదిలేస్తాడు. పొందాల్సినవి మంచిగా పొందుతాడు. తిరిగి ఇవ్వాల్సిన వాటి విషయంలో మాత్రం బాధ్యతలేకుండా ఉంటాడు. అది ఎదుట మనిషి విషయంలోనైనా, ప్రకృతి విషయంలోనైనా ఇలాంటి మనిషి నైజం వల్ల ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతోంది? సమాజం ఎటు పోతోంది ? మనిషి జీవనం ఎలా సాగుతోంది? ఈ అనర్థాలకు కారణం ఎవరు? ఇది ఎవరు రాసిన రాత అనే ఇతివృత్తంతో నాటికను ప్రదర్శించారు.

‘అజరామరం’ నాటిక

అనంతరం కళావర్షిణి ద్రోణాదుల వారిచే ‘అజరామరం’ నాటిక కంటతడి పెట్టించింది. కీర్తిశేఖర వర్మ జమిందారి వంశానికి వారసుడు. ఉన్నత చదువులు చదివి ఊరి ప్రజల బాగోగులను చూసే ఉద్యోగం చేస్తుంటాడు. ఒకరోజు ఆలయంలో జరిగిన కార్యక్రమానికి కీర్తిశేఖర్‌వర్మ అక్కడ దేవదాసి తన కూతురికి కన్నెరికం జరిపించాలని ప్రయత్నిస్తుంటే ఎదురించి ఆ కన్యను తన సంరక్షణలో ఉంచుతాడు. కొద్దిరోజులకు సౌదామినీ మహిళతో కీర్తిశేఖర వర్మకు వివాహం జరుగుతుంది. అప్పటి నుంచి దేవదాసి కూతురైన ప్రియమణికి కీర్తిశేఖరవర్మ ఇల్లాలు సౌదామినికి ప్రేమను సమానంగా పంచుతుంటాడు. ప్రియమణితో ఉన్న సంబంధం గురించి తెలిసిన సౌదామిని ఎప్పుడూ భర్తను ప్రశ్నించలేదు కాని కాలం ప్రశ్నించేలా చేసింది. ఆ ప్రశ్నకు సమాధానం ఏమిటి అన్నదే అజరామరం నాటిక స్పష్టం చేసింది. కళాకారులు ప్రదర్శన ఆహుతులను అలరించింది. కార్యక్రమంలో సోమలింగేశ్వరరావు, ఎం.డి. ఖాజావలీ, రామాంజనేయులు సిద్ధాంతి, వరప్రసాదరావు, రాజగోపాల్‌ తదితరులు పర్యవేక్షించారు.

Updated Date - Jul 05 , 2024 | 11:51 PM