Share News

నరసాపురానికి ఉమాబాల !

ABN , Publish Date - Feb 03 , 2024 | 12:27 AM

నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి అధికార వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను ఎట్టకేలకు ప్రకటించారు. ఈ స్థానం నుంచి పోటీకి దింపేందుకు అభ్యర్థుల కోసం వైసీపీ ముప్పుతిప్పలు పడింది.

నరసాపురానికి ఉమాబాల !

ఎట్టకేలకు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మహిళ ఎంపిక

బీసీ నినాదంలో అనూహ్య పరిణామం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి అధికార వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను ఎట్టకేలకు ప్రకటించారు. ఈ స్థానం నుంచి పోటీకి దింపేందుకు అభ్యర్థుల కోసం వైసీపీ ముప్పుతిప్పలు పడింది. ఉభయ గోదావరి జిల్లాల్లో తగినంత అర్హత, ఆర్థిక స్థోమత కలిగిన వారి కోసం అన్వేషించింది. ఈ అన్వేషణలో శెట్టి బలిజ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గుబ్బల తమ్మయ్యను ఎంపీ అభ్యర్ధిగా రంగంలోకి దించేందుకు ప్రయత్నించారు. అయితే తమ్మయ్య ప్రతిపాదనపై సిటింగ్‌ ఎమ్మెల్యేలు ఒకింత అసంతృప్తి, నిరాసక్తత ప్రదర్శించారు. దీంతో వైసీపీ అధినాయకత్వం దిగిరాక తప్పలేదు. తమ్మయ్య స్థానంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ను రంగంలోకి దించేందుకు పావులు కదిపారు. అయితే ఇక్కడా చుక్కెదురైంది. తన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నందున ఆయన తరఫున అన్నీ తానే చూసుకోవాలని సుభాష్‌ నాయకత్వ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దీంతో చాన్నాళ్ళ నుంచి పార్టీలో కొనసాగుతున్న, బలహీన వర్గాలకు చెందిన విద్యావంతురాలు గూడూరి ఉమాబాలను ఒప్పించి ఆ మేరకు ఎంపీ స్థానానికి అభ్యర్థిగా శుక్రవారం రాత్రి ప్రకటించారు.

భీమవరం కేంద్రంగా గడచిన రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో కీలకంగా ఉమాబాల వ్యవహరిస్తున్నారు. ఆది నుంచి రాజకీయ కుటుంబంలో వున్న ఆమె కాంగ్రెస్‌ రాజకీయాలలో చురుగ్గా వ్యవహరించారు. ఒక దశలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఆమె ఆసక్తి ప్రదర్శించారు. కాంగ్రెస్‌ నుంచి ప్రజారాజ్యంలోకి, ఆ తర్వాత వైసీపీలోనూ పార్టీ బాధ్యతలను కొన్నాళ్లపాటు నిర్వహించారు. మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగానూ, ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యురాలి గా కొనసాగారు. బీసీ వర్గానికి చెందిన తనకు తగిన ప్రాధాన్యతివ్వాలని ఆది నుంచి ఉమాబాల డిమాండ్‌ చేస్తూ వచ్చారు. ఇపుడు అభ్యర్థుల కొరతను ఎదు ర్కొంటున్న వైసీపీ అనూహ్యంగా బీసీ వర్గానికి చెందిన మహిళ ఉమాబాలను నరసాపురం లోక్‌సభ స్థానానికి ఎంపిక చేసింది. బీసీ మహిళగా ఆమెకు తగిన గౌరవం ఇచ్చామని సంకేతాలు పంపేందుకు వైసీపీ వ్యూహం పన్నింది.

Updated Date - Feb 03 , 2024 | 12:27 AM