Share News

ఐదేళ్లూ.. అభివృద్ధి శూన్యం

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:49 AM

అధికారం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం.. వారధి, హార్బర్‌ కట్టి చూపుతాం.. పట్టణంలో కంపోస్టు యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్క రిస్తాం, ఇవి ముఖ్యమంత్రి జగన్‌, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు. ఐదేళ్లు గడిచిపోయాయి.

ఐదేళ్లూ.. అభివృద్ధి శూన్యం

నరసాపురంలో నెరవేరని సీఎం హామీలు

రూ.3200 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన

కలగా మిగిలిన వారధి

ఆచూకీ లేని హార్బర్‌

పునాది దాటని ఆక్వా యూనివర్సిటీ

అధికారం ఇవ్వండి.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం.. వారధి, హార్బర్‌ కట్టి చూపుతాం.. పట్టణంలో కంపోస్టు యార్డు సమస్యను శాశ్వతంగా పరిష్క రిస్తాం, ఇవి ముఖ్యమంత్రి జగన్‌, నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలు. ఐదేళ్లు గడిచిపోయాయి.. అభివృద్ధి మాత్రం శూన్యం. పాలకుల హామీలను వివిధ పనుల ప్రారంభోత్సవ శిలాఫలాకాలు వెక్కిరిస్తున్నాయి. 16 నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్‌ రూ.3200 కోట్లతో 13 పనులకు శంకుస్థాపన చేశారు. మూడు నాలుగు పనులు మినహా అన్నీ శిలాఫలకాలకే పరిమితం. కంపోస్టుయార్డు స్థలానికి రూ 1.70 కోట్లు మంజూరు చేయించలేకపోయారు. హామీలు, శంకుస్థాపనలతో ప్రజలను మభ్యపెట్టారని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. – నరసాపురం

వారధి టెండర్లు వాయిదాలే..

ఉభయ గోదావరి జిల్లా వాసుల చిరకాల వాంఛ వశిష్ఠా వారధి. 16 నెలల క్రితం సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. రూ.490 కోట్లతో రాజల్లంక వద్ద నిర్మించే వారధికి ఎన్‌హెచ్‌ అధికారులు ఐదు నెలల క్రితం టెండర్లు పిలి చారు. న్యాయపరమైన ఇబ్బందులతో ఇప్పటికీ వాటిని తెరవలేదు. వాయిదాలు వేస్తూ వస్తు న్నారు. మరోవైపు పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో వారధి నిర్మాణం వల్ల్ల మాధవాయి పాలెం రేవు సమస్యలు తీరదన్న వాధనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ నాయకులు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

హార్బర్‌ శిలాఫలకానికే పరిమితం

బియ్యపుతిప్ప వద్ద రూ 430 కోట్లతో కార్గో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్ధాపన చేసి 16 నెలలు గడిచింది. టెండర్లు పిలిచినా.. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. హార్బర్‌ నిర్మాణ పనులు తక్షణం చేపట్టాలనే డిమాండ్‌తో మాజీ ఎమ్మె ల్యే బండారు మాధవనాయుడు అధ్వర్యంలో ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు పనులు ప్రారంభి స్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. హార్బర్‌ నిమిత్తం సేకరించిన స్థలంలో కనీసం పునాది కూడా పడలేదు.

కలగా నల్లి క్రీక్‌..

గత ప్రభుత్వ హాయంలో రూ.17 కోట్లతో నల్లిక్రీక్‌ పనులు చేపట్టారు. వైసీపీ అధికారం లోకి రాగానే దీన్ని రద్దు చేసింది. ఇప్పటి వరకు ఈ పనుల ఊసే లేదు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నేటికి నేరవేరలేదు.

నియోజకవర్గంలో డ్రెయినేజీల అధునీకరణ హామీగానే మిగిలింది. పూడిక పనులు చేపట్టి 15ఏళ్లు దాటింది. కొద్దిపాటి వర్షానికే డ్రెయినేజీలు పొంగిపొర్లుతున్నాయి. ముంపుతో రైతులు పంటలను తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన ఎమ్మెల్యే హామీ నేటికి నెరవేరలేదు.

కదలని వియర్‌ ఛానల్‌

మొగల్తూరు మండలంలోని శివారు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించాలని రూ 31 కోట్లతో చేపట్టిన వియర్‌ ఛానల్‌ పనుల్లో కదలికలేదు. సీఎం జగన్‌ వేసిన శిలాఫలకం ఆనవాలుగా మిగిలాయి.

పేరుపాలెం సౌత్‌లో రూ.181 కోట్లతో చేపట్టాల్సిన రెగ్యూలేటర్‌ నిర్మాణంలో పునా దులు కూడా పడలేదు. రెగ్యులేటర్‌ నిర్మాణా నికి సీఎం శంకుస్ధాపన చేసి 16 నెలలు గడిచింది. ఈ పనులు పూర్తయితే సముద్రం ఆటు, పోటుల ప్రభావంతో నష్టపోతున్న రైతులకు ఎంతో ప్రయోజనం కలగనుంది.

పునాదుల్లో ఆక్వా వర్సిటీ

ఆక్వా యూనివర్సిటీ నిర్మాణ పనులు రూ.332 కోట్లతో చేపట్టాల్సి ఉంది. పనులు పునాదులు కూడా దాటలేదు. సరిపల్లిలో 40ఏకరాల విస్తీర్ణంలో పనులు చేపట్టారు. అయితే నిధులు లేకపోవడంతో పునాదుల్లో ఆగపోయాయి. ప్రస్తుతం మొదటి ఏడాది తరగతులు మండలంలోని లక్ష్మణేశ్వరం తుఫాన్‌ భవనంలోనే కొనసాగుతున్నాయి. చినలంక, వేములదీవి గ్రామాల్లో ప్రాజెక్టుల్లో భాగంగా ల్యాబ్‌లు, పరిశోధన శాలలు నిర్మించాల్సి ఉంది. ఇంత వరకు ఈ పనులకు పునాదులు పడలేదు.

అవినీతి ఊబిలో ఏటిగట్టు

కోతకు గురైన ఏటిగట్టు పనులు అవినీతి ఊబిలో కూరుకుపోయాయి. రూ.27 కోట్లతో పట్టణంలోని అమరేశ్వర స్వామి ఆలయం నుంచి బుడితల రేవు వరకు పనులు చేపట్టాల్సి ఉంది. చేపట్టిన 100మీటర్ల పనులు తరుచూ కోతకు గురవుతున్నాయి. పనుల్లో నాణ్యతలోపం, అవినీతిపై విపక్షాలు అందోళనలు కూడా చేపట్టాయి.

జాడలేని రూ.1400 కోట్ల వాటర్‌ గ్రిడ్‌

జిల్లాలోని ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరందించాలన్న ఉద్దేశంతో రూ.1400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. విజ్జేశ్వరం నుంచి నరసాపురం వరకు పైప్‌లైన్‌ నిర్మాణ పనులకు ప్రతిపాదించారు. ఈపనులు పునాది కూడా దాటలేదు.

పూడికకు నోచుకోని జగనన్న కాలనీలు

పట్టణం, మండలంలో జగనన్న కాలనీలకు సేకరించిన స్థలాల్లో చాలావరకు పూడికకు నోచుకోలేదు. పట్టణంలోని 4200 మందికి, మండలంలోని మంగళగుంటపాలెంలో స్థలాలు ఇచ్చారు. కొన్ని స్థలాలు పూడిక చేపట్టలేదు. లబ్థిదారులు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. పూడ్చిన స్థలాల్లో మాత్రం అరకొరగా నిర్మాణాలు జరిగాయి. వైఎస్‌పాలెంలో సేకరించిన స్థలానికి దారి కూడా చూపించలేదు.

కంపోస్టు యార్డు హామీలకే పరిమితం

కంపోస్టుయార్డు సమస్యను ఏడాదిలో పరిష్కరిస్తామని బాధ్యతలు చేపట్టగానే ఎమ్మెల్యే ముదునూరి హామీ ఇచ్చారు. ఇప్పటికే రూ 1.70 కోట్లు 13వ ఆర్ధిక సంఘం నిధులు కంపోస్టుయార్టుకు కేటాయించారు. ఇది కాకుండా ప్రభుత్వం నుంచి రూ 1.70కోట్లు కేటాయించాల్సి ఉంది. భూమిని గుర్తించినా ఇంత వరకు నిఽధులు మంజూరుకాకపోవడంతో ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నెరవేరలేదు.

సబ్‌ స్టేషన్‌ కాగితాలకే పరిమితం

నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో విద్యుత్‌ సమస్య పరిష్కారం కోసం నరసాపురంలో 220 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసి 16నెలలు గడిచింది. రూ.133 కోట్లతో చేపట్టే ఈప్రాజెక్టుకు రుస్తుంబాద పంచాయితీలో స్థల సేకరణ చేశారు. నేటికి పునాది పడలేదు. కాగితాలకే సబ్‌స్టేషన్‌ పరిమితమైంది.

అంచనాల్లో అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ

నరసాపురం పట్టణంలో డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.87 కోట్లతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. నేటికి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలింది. ఇంకా టెండర్లు కూడా పిలవలేదు.

నత్తనడకన వాటర్‌ ప్రాజెక్టు

పట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు రూ 61.80 కోట్లతో చేపట్టిన వాటర్‌ ప్రాజెక్టు నత్తనడకన సాగుతుంది. ప్రాజెక్టులో భాగంగా మూడు ఓహెచ్‌ఆర్‌లను నిర్మించాల్సి ఉంది. ఇప్పటివరకు రెండు మాత్రమే నిర్మాణానికి నోచుకున్నాయి. వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌, కొత్తపైప్‌లైన్ల పనులు చేపట్టాల్సి ఉంది.

మధ్యస్థంగా రహదారుల నిర్మాణం

రూ.40 కోట్లతో తీర ప్రాంత రహదార్ల అభివృద్ధికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. లక్ష్మణేశ్వరం నుంచి పీఎం.లంక, నరసపురం– నుంచి వైవీ లంక, పసలదీవి పంచాయతీ రహదారి వంటి ప్రధాన రహదార్లు ఉన్నాయి. ఈపనులన్ని నేటికి మధ్యలో ఉన్నాయి. నవరసపురం రహదారి నిర్మాణానికి శంకుస్దాపన చేసి నాలుగేళ్లు గడిచింది. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. రహదారుల అభివృద్ధిపై ఎమ్మెల్యే ఇచ్చిన హామీ నెరవేరలేదు.

మోడి వంతెన హమీకే పరిమితం

మండల కేంద్రమైన మొగల్తూరుతో తీర గ్రామాలను అనుసంధానం చేస్తూ రూ.10 కోట్లతో నిర్మించతలపెట్టిన మోడి వంతెనకు ఎమ్మెల్యే ప్రసాదరాజు ఇచ్చిన హమీ నెరవేరలేదు. ఇప్పటి ఈ పనులకు రెండు సార్లు శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం ముందుకు సాగలేదు.

Updated Date - Apr 18 , 2024 | 12:49 AM