Share News

ఇంటి బోరుకు రూ.15 వేలు కట్టండి!

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:15 AM

ఏడాది క్రితం పట్టణ ఆదాయం పెంచడం కోసం పన్నులు రెట్టింపు చేశారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా కొత్తగా ఇంటి వద్ద బోరు వేసుకోవాలంటే రూ.15 వేలు మునిసిపాలిటీకి చెల్లించాలంటూ తీర్మానం చేసేశారు.

ఇంటి బోరుకు  రూ.15 వేలు కట్టండి!
జంగారెడ్డిగూడెం మునిసిపల్‌ కార్యాలయం

ఏడాది కిందట జంగారెడ్డిగూడెం మునిసిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం

ఆదాయం పెంచేందుకే అంటూ అప్పట్లో సమర్థింపు

ఎన్నికల వేళ తప్పు దిద్దుబాటుకు హడావిడి సమావేశాలు

భారం తగ్గించాలంటూ కౌన్సిలర్ల కొత్తరాగం

జంగారెడ్డిగూడెం టౌన్‌, జనవరి 27 : ప్రభుత్వం జీవోలు విడుదల చేసేది ప్రజలపై పన్నుల భారం పెంచడానికే అంటూ జీవోలకు కొత్త భాష్యం చెప్పింది రాష్ట్రప్రభుత్వం. కొత్త జీవో వస్తోందంటే ఈసారి ఏ చెత్త పన్ను వేస్తారు.. బాబోయ్‌ అంటూ బెంబేలెత్తుతున్నారు జనం. ఈ కోవలోనే మేమేం తక్కువ కాదంటున్నారు జంగారెడ్డిగూడెం మునిసిపల్‌ కౌన్సిలర్లు. ఏడాది క్రితం పట్టణ ఆదాయం పెంచడం కోసం పన్నులు రెట్టింపు చేశారు. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా కొత్తగా ఇంటి వద్ద బోరు వేసుకోవాలంటే రూ.15 వేలు మునిసిపాలిటీకి చెల్లించాలంటూ తీర్మానం చేసేశారు. వసూళ్లు కూడా బాగానే చేశారు. తీరా ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలపై అదనపు బోరు చార్జీ తగ్గించా లంటూ కౌన్సిలర్లు కొత్తరాగం మొదలు పెట్టారు.

ఫ్రీగా ఎందుకివ్వాలి..

రోడ్లు, భవన నిర్మాణాలు పట్టణ అభివృద్ధికి చిహ్నాలు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రోడ్లను గాలికి వదిలేసి, నిర్మాణలు చేపట్టే వారి నుంచి అభి వృద్ధి పేరిట అడ్డగోలు వసూళ్లు చేస్తోందని భవన నిర్మాణ కాంట్రాక్టర్లు, బిల్డర్లు వాపోతున్నారు. సాధారణంగా లేఅవుట్‌ స్థలంలో నిర్మాణం చేపడితే యజమానికి మునిసిపల్‌ కుళాయి, కరెంటు, కామన్‌ ప్లేస్‌, డ్రెయినేజీ, పార్క్‌, 40 అడుగుల రోడ్డు వంటి సదుపాయాలను కల్పిం చాలి. నాన్‌ లేఅవుట్‌ స్థలంలో నిర్మాణం చేపట్టాలంటే 14.5 శాతం టాక్స్‌ విధించి సదుపాయాలను అందిస్తారు. యజమానులు ఇంటి నిర్మాణంలో భాగంగానే ఇంటి బోరును ఏర్పాటు చేసుకునేవారు. అయితే ఫ్రీగా ఎందుకివ్వాలి అనుకున్నారో, ఆదాయం పెంచాలనుకున్నారో గాని జిల్లాలో ఎక్కడా లేనివిధంగా జంగారెడ్డిగూడెం మునిసిపాలిటీలో ఇంటి బోరుకు రూ.15 వేలు వసూలు చేయడం మొదలుపెట్టారు. ఎదెక్కడి చోద్యం అంటూ బిల్డింగ్‌ కాంట్రాక్టర్లు, పలువురు ఇంటి యజమానులు మునిసి పల్‌ ఉన్నతాధి కారులతో చర్చలు జరిపినా ఫలితం లేదు. చేసేదేమిలేక ఇంటి బోరుకు అదనపు చార్జి చెల్లిస్తూనే నిర్మాణాలు సాగిస్తున్నారు.

జేబులు నింపేందుకే..

ఏడాది క్రితం మునిసిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పట్టణ ఆదాయం అభివృద్ధి పేరిట ఇంటి పన్ను, కుళాయి పన్ను పెంచారు. ఏరియా, ఇంటి స్థలాన్ని బట్టి ఇంటి పన్ను గతం కంటే రూ.500 నుంచి రూ.700 వరకు పెరిగింది. కుళాయి పన్నును రెట్టింపు పెంచారు. ఇందులో భాగంగానే అదనపు చార్జీగా బోరు వేసుకోవాంటే రూ.15 వేలు చెల్లించాలని ఆమో దించారు. పెరిగిన ఇంటి, కుళాయి పన్నులను తక్షణమే అమలు చేసి బోరు చార్జీలను వసూలు చేయలేదు. కాకపోతే ఇంటి నిర్మాణం చేపట్టి బోరు వేస్తుంటే మాత్రం మునిసిపల్‌ అధికారులు వచ్చి హడావిడి చేసి బోరు నిలుపుదల చేసేవారని పలువురు ఇంటి యజమానులు చెబుతు న్నారు. స్థానిక కౌన్సిలర్‌కు చేయి తడిపితే గాని ఇంటికి బోరు వచ్చేది కాదని పలువురు బిల్డర్లు బాహటంగానే చెబుతున్నారు. గత రెండు నెలలుగా బోరుకు మునిసిపల్‌ అధికారులు అధికారికంగా రూ.15 వేలు వసూలు చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల జేబులు నింపడానికే ఇటువంటి తీర్మానం చేశారని పట్టణ వాసులు విమర్శిస్తున్నారు.

కౌన్సిలర్ల కొత్తరాగం

ప్రజలపై అదనపు భారం ప్రభుత్వానికి మంచిది కాదంటూ కౌన్సిలర్లు కొత్తరాగం మొదలు పెట్టారు. తాజాగా సమావేశం నిర్వహించి పెంచిన భారాన్ని తగ్గించాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. ఈ ప్రతి పాదనను కలెక్టర్‌, సీఎండీఏ అధికారులు ఆమోదించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత మార్చి31 తర్వాతనే బోరు చార్జీ తగ్గింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Updated Date - Jan 28 , 2024 | 12:15 AM