Share News

రంగులు మారుతున్న నూజివీడు రాజకీయం

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:23 AM

నూజివీడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మార్పుతో ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో అనూహ్య మార్పులు జరగనున్నాయా ? నూజివీడు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముద్దరబోయినకు బదులు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధికి కేటాయించనున్నట్లు పార్టీ నిర్ణయించింది.

రంగులు మారుతున్న  నూజివీడు రాజకీయం

వైసీపీ వైపు ముద్దరబోయిన అడుగులు !

నూజివీడు, ఫిబ్రవరి 19 : నూజివీడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మార్పుతో ఏలూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో అనూహ్య మార్పులు జరగనున్నాయా ? నూజివీడు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ ముద్దరబోయినకు బదులు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్ధసారధికి కేటాయించనున్నట్లు పార్టీ నిర్ణయించింది. ఈ నెల 26న టీడీపీలో చేరనున్న పార్ధసారధి నాలుగు రోజులుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ టీడీపీ కార్యకర్తలు, నాయకులను కలుస్తూ సహకారం కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం ముద్దరబోయిన సీఎం జగన్‌ పేషీలో వైసీపీ నాయకులతో సమాలోచనలు జరిపినట్లు వార్తలు రావడంతో సంచలనం కలిగింది. ముద్దరబోయిన వెనుక వున్న బీసీ కార్డును ఉపయోగించుకోవడానికి వైసీపీ, ఎత్తుగడలకు తెరతీసింది. ముద్దరబోయినను కృష్ణాలోని గన్నవరం, మైలవరం, ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గాల్లో ఏదో ఒకచోట నుంచి పోటీకి దింపే యోచనలో వైసీపీ ఉన్నట్టు సమాచారం. సోమవారం జరిగిన సమాలోచనలో వైసీపీకి ముద్దరబోయినకు మధ్య ఇంకా సంధి కుదిరినట్లు లేదు ! ముద్దరబోయినకు నూజివీడు వైసీపీ అసెంబ్లీ టిక్కెట్‌ ఇచ్చి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌అప్పారావుకు కాని, ఆయన కుమారుడు వేణుగోపాల అప్పారావుకు కాని ఏలూరు వైసీపీ ఎంపీ టిక్కెట్‌ కేటాయిస్తే ఎలా ఉంటుందనే సమాలోచనలు వైసీపీలో సాగుతున్నట్లు జరుగుతోంది. సోమవారం సాయంత్రం సీఎం జగన్‌ పేషీ నుంచి నూజివీడు సిట్టింగ్‌ ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌, ఆయన కుమారుడు వేణుగోపాల్‌కు పిలుపు రావడంతో, వీరిద్దరూ పార్టీ పెద్దలను కలిసినట్లు సమాచారం.

తుది నిర్ణయం తీసుకోలేదు : ముద్దరబోయిన

‘నూజివీడులో పదేళ్ళుగా టీడీపీ జెండా మోసా. పార్టీ కార్యక్రమాలు అన్ని తూ.చా. తప్పకుండా పాటించా. నియోజకవర్గంలో పరిస్థితి నాకు అనుకూలంగా ఉన్నా మరో వ్యక్తికి టిక్కెట్‌ కేటాయిస్తున్నట్లు ప్రచారం జరగటంతో మనస్థాపం కలిగించింది. గత శనివారం నూజివీడులో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమై నా రాజకీయ భవిష్యత్తును మీరే నిర్ణయించి రెండు, మూడు రోజుల్లో తెలపాలని కార్యకర్తలను కోరా. వారి అభిప్రాయాలు చెప్పిన తరువాత నేను తుది నిర్ణయం తీసుకుంటా’నని ముద్దరబోయిన ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Updated Date - Feb 20 , 2024 | 12:23 AM