ఎంపీడీవో ఎక్కడున్నారు ?
ABN , Publish Date - Jul 17 , 2024 | 11:37 PM
నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ లభించ లేదు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విజయవాడ, ఏలూరు జిల్లాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏలూరు కాల్వ వద్ద ఎంపీడీవో చెప్పులు కనిపించడంతో గజ ఈతగాళ్లతో కాల్వ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు.
ఇంకా లభించని ఆచూకీ
విజయవాడ, ఏలూరు జిల్లాల్లో గాలింపు
నరసాపురం రూరల్, జూలై 17: నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ లభించ లేదు.కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు విజయవాడ, ఏలూరు జిల్లాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఏలూరు కాల్వ వద్ద ఎంపీడీవో చెప్పులు కనిపించడంతో గజ ఈతగాళ్లతో కాల్వ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం సాయంత్రం వరకు ఆయన ఆచూకీ దొరక లేదు. నరసాపురం రేవు నిర్వహణదారుడు రెడ్డప్ప ధేవేజీ మండల పరిషత్‌కు రూ.55 లక్షల వరకు చెల్లించాలి. ఈ బాకీ వసూలు విషయమై ఆయన రెండు నెలల నుంచి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ నెల 3 నుంచి మెడికల్ లీవ్ పెట్టి కృష్ణా జిల్లా పెనమలూరులో ఆయన ఇంటి వద్దనే ఉంటున్నారు. 17 వ తేదీ సోమవారం మచిలీపట్నం వెళ్లిన ఎంపీడీవో ఇంటికి తిరిగి రాలేదు. ఎంపీడీవో సెల్ నుంచి భార్యకు మెసేజ్ రావడంతో కుటుంబ సభ్యులు పెనుమలూరు పోలీస్‌లను ఆశ్రయించారు. రెండు రోజుల నుంచి అన్ని కోణాల్లో గాలించినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదు. ఇప్పటి వరకు పోలీసులు మచిలీపట్నం రైల్వేస్టేషన్‌లో ఎంపీడీవో బైక్‌ను, విజయవాడలోని ఏలూరు కెనాల్ వద్ద ఆయన చెప్పులను మాత్రమే గుర్తించారు. దీంతో ఆయన ఆదృశ్యం పెద్ద మిస్టరీగా మారింది. ఎంపీడీవో ఇంటికి క్షేమంగా రావాలని మండల పరిషత్ ఉద్యోగులతో పాటు సిబ్బంది, పట్టణ ప్రజలు కోరుకుంటు న్నారు. బకాయిపడ్డ ధవేజీ నుంచి ఎటువంటి స్పందన లేదు. కనీసం మండల పరిషత్ ఆధికారులతో ఆయన చర్చించ లేదు. దీంతో బాకీ కడతారా ? లేదా అన్న దానిపై పెద్ద చర్చ సాగుతోంది.
ఆయనకు ఏమైనా జరిగితే బాధ్యులపై కేసులు : ఎమ్మెల్యే నాయకర్
తన సర్వీస్‌లో అవినీతి మచ్చ లేకుండా నిజాయితీగా పని చేస్తున్న ఎంపీడీవో వెంకటరమణకు ఏమైనా జరిగితే మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, నిర్వహణదారుడు రెడ్డప్పధవేజీ, జేఏసీ కమిటీ సభ్యులపై కేసు పెడతామని ఎమ్మెల్యే నాయకర్ హెచ్చరించారు. బుధవారం పార్టీ కార్యా లయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ బాకీ విషయంపై రేవు నిర్వహణ దారుడు ధవేజీకి అనేకమార్లు ఫోన్‌లు చేసినా, నోటీసులు ఇచ్చినా స్పందించ లేదన్నారు. ఇదే విషయం ఎంపీడీవో రెండు మూడు సార్లు తన దృష్టికి తీసుకు వచ్చారన్నారు. బాకీ విషయంలో ఎంపీడీవో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై మెడికల్ లీవ్ పెట్టారన్నారు. ముదునూరి నిర్లక్ష్యం వల్లే నిజా యితీపరుడైన ఎంపీడీవో బలి కావాల్సి వచ్చిందన్నారు. ఆయనకు ఏమైనా జరిగితే ఆ కుటుంబానికి ఏం సమాధానం చెపుతారంటూ నిలదీశారు. అవసరమైతే సీఎం చంద్రబాబు, జిల్లా కలెక్టర్ వద్దకు సమస్యను తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఆయన ఎక్కడ ఉన్న క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ఎంపీడీవోకు అండగా ఉంటాం : పొత్తూరి
ఎంపీడీవో, ఆయన కుటుంబ సభ్యులకు టీడీపీ అండగా ఉంటుందని టీడీపీ ఇన్‌ఛార్జి పొత్తూరి రామరాజు భరోసా ఇచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైసీపీ అవినీతి ఆక్రమాలకు ప్రజలతో పాటు అధికారులు కూడా బలయ్యారన్నారు. బకాయిదారుడు పెండింగ్ సోమ్ము చెల్లించకపోవడం వల్లే ఎంపీడీవో మానసిక ఒత్తిడికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయరాన్నారు.