Share News

చెక్‌ పోస్టుల్లో విస్తృత తనిఖీలు

ABN , Publish Date - Mar 25 , 2024 | 01:03 AM

ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఉమ్మడి పశ్చిమ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

చెక్‌ పోస్టుల్లో విస్తృత తనిఖీలు

ఉమ్మడి పశ్చిమలో 13 చోట్ల ఏర్పాటు

రూ.50 వేలు మించి రవాణా చేస్తే

లెక్కలు చూపాల్సిందే.. లేకుంటే సీజ్‌

పన్నులు చెల్లించకపోయినా తప్పని తిప్పలు

భీమవరం క్రైం, మార్చి 24 : ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో ఉమ్మడి పశ్చిమ వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సరిహద్దు లైన యలమంచిలి మండలం చించినాడ, పెనుగొండ మండలం సిద్ధాంతం, తాడేపల్లిగూ డెం మండలం వెంకట్రామన్నగూడెం, భీమ వరం మండలం లోసరి, ఆకివీడు మండలం దుంపగడప వద్ద, ఏలూరు జిల్లాలో తెలంగాణ రాష్ర్టానికి సరిహద్దు గ్రామాలైన చింతలపూడి మండలం అల్లిపల్లి, గురుభట్లగూడెం, టి.నర సాపురం మండలం లంకాలపల్లి, జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం, వేలేరుపాడు మం డలం మేడేపల్లి, కుక్కునూరు మండలం శ్రీధర వేలేరు, చాట్రాయి మండలం పర్వతపురం, కృష్ణారావు పాలెం వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ఏర్పాటు చేసిన సిబ్బంది ఇక్కడ 24 గంటలు గస్తీ నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాత నగ దు, బంగారం రవాణాపై ఆంక్షలు విధించారు. రూ.50 వేలు మించి రవాణా చేయకూడదు. ఒకవేళ దీనికి మించిన సొమ్ము తీసుకు వెళుతూ తనిఖీల్లో బయటపడితే వాటిని స్వాధీనం చేసుకుం టారు. ఆ డబ్బు ఎవరి దగ్గర అయినా అప్పు తీసుకున్నారా, బ్యాంక్‌లో డ్రా చేశారా, వ్యాపారంలో వచ్చిన నగదా అనే విషయాలను బిల్లులు రూపంలో చూపించాలి. లేని పక్షంలో రెవెన్యూ అధికారులు ఆధ్వర్యంలో ట్రెజరీ కార్యాలయంలో జమ చేస్తారు. ఒకవేళ ఆ సొమ్ములకు సరైన పన్ను చెల్లించకపోయినా సంబంధిత అధికారులకు పట్టుకున్న అధికారులు లెటర్‌ ద్వారా తెలియపరుస్తారు. వారం క్రితం భీమవరం మండలం లోసరి చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి కారులో రూ.10 లక్షలు తరలిస్తుండగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును ట్రెజరీ కార్యాలయానికి అప్పగించారు. సరైన ఆధారాలు చూపించి నగదు తీసుకుని వెళ్లాలని ఆ వ్యక్తికి స్పష్టం చేశారు. లోసరి చెక్‌ పోస్టు వద్ద ఎన్నికల కోడ్‌ రాక ముందే ఇద్దరు వ్యక్తులు విదేశీ మద్యం తరలిస్తూ పట్టుకున్నారు. ఈ నెల 19న ఒక వ్యక్తి ఐదు పుల్‌ మద్యం బాటిళ్లు తరలిస్తూ పట్టుబడ్డాడు. ఇలా పోలీసు తనిఖీల్లో నిత్యం ఎవరో ఒకరు పట్టుబడుతూనే ఉన్నారు. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పౌరులకు సంబంధించిన ప్రతి వాహనాన్ని, ద్విచక్ర వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఎవరికీ మినహా యింపు లేదు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.19.25 లక్షల నగదు సీజ్‌ చేశారు. మరోవైపు వాహనాలు తనిఖీతో పాటు అనుమానిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నారు. రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌ షీట్‌ ఉన్న వారిపై నిఘా పెట్టారు. చెక్‌ పోస్టులలో వెబ్‌ కెమెరాలను ఏర్పాటు చేసి జిల్లా కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచి మానిటర్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 25 , 2024 | 01:03 AM