Share News

ఆర్టీసీ కార్గోలో అవినీతి రవాణా !

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:09 AM

నరసాపురం ఆర్టీసీ కార్గోలో సొమ్ములు గోల్‌మాల్‌ అయ్యాయి.

ఆర్టీసీ కార్గోలో అవినీతి రవాణా !

నరసాపురం, ఏప్రిల్‌ 2 : నరసాపురం ఆర్టీసీ కార్గోలో సొమ్ములు గోల్‌మాల్‌ అయ్యాయి. పార్శిల్‌ బుకింగ్‌ సొమ్మును ఎప్పటికప్పుడు సంస్థకు జమ చేయకపోవడంతో ఈ బాగోతం బయటపడింది. పది రోజుల నుంచి ఆర్టీసీ ఆడిట్‌ అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారు. ఏటా ఆర్టీసీ డిపోల వారిగా ఆడిట్‌ నిర్వహించడం పరిపాటి. ఈ క్రమంలో కార్గో వాహనాలకు ఆదాయంకంటే ఆయిల్‌ ఖర్చే ఎక్కువ కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన ఆడిట్‌ సిబ్బంది రికార్డులను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఈ భాగోతం కూడా బయటపడింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారి ఆదేశాలతో ఆర్టీసీ ఆడిట్‌ అధికారి కాశీం రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇందులో పార్శిల్‌ బుకింగ్‌ అయిన వెంటనే ఆ సొమ్మును రికార్డులో నమోదు చేయలేదు. రెండు, మూడు రోజులకు ఒకసారి జమ చూపించారు. కొన్ని రశీదులు వారం తర్వాత చూపించారు. ఇప్పటి వరకు జరిపిన ఆడిట్‌లో లక్షల్లో తేడా కనిపించింది. ఇలా ఎన్ని ఏళ్లుగా జరిగిందన్న దానిపై రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇందులో ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారు. దీనిపై డీఎం సుబ్బన్నరెడ్డిని ఆంధ్రజ్యోతి వివరణ కోరగా పార్శిల్స్‌కు సంబంధించిన సొమ్ములు ఏ రోజుకారోజు జమ కాలేదన్న విషయం ఆడిట్‌లో బయటపడిందన్నారు. దీనిపై రికార్డులను పరిశీలిస్తున్నారు. ఎన్ని రోజులకు ఒకసారి జమ చేశారు. నిధులు ఏమైనా పక్కదారి పట్టాయా ? అన్న పూర్తిగా ఆడిట్‌ జరగాల్సి ఉందన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:09 AM