Share News

ఆదుకుంటాం..

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:07 AM

శనివారం మంత్రుల బృందం ఉమ్మడి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.. బాధితులను పరామర్శించి వారికి సాయం అందిస్తామని చెప్పారు.

ఆదుకుంటాం..
ఇల్లిందలపర్రులో కుళ్లిన వరి దుబ్బులను మంత్రులకు చూపిస్తున్న రైతులు

ఇది ప్రజా ప్రభుత్వం..సేవ చేసేందుకే ఉన్నాం

జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ కష్టాలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన

మంత్రులు అచ్నెన్నాయుడు, రామానాయుడు, పార్థసారఽథి, అనిత

ఆదుకుంటామంటూ బాధితులకు భరోసా

కుక్కునూరు, జూలై 27: ‘‘ వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితుల దగ్గరకు వెళ్లండి.. ఇప్పటి వరకు అందిన సాయం..? ఇంకా ఏం కావాలో తెలుసుకోండి.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అందుకే మేమంతా కలిసి వచ్చాం..’’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. శనివారం మంత్రుల బృందం ఉమ్మడి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.. బాధితులను పరామర్శించి వారికి సాయం అందిస్తామని చెప్పారు.

తమది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు ఏ ఇబ్బందులు తలెత్తినా తక్షణమే స్పందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించటంతో ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. దాచారం పునరావాస కాలనీలో బాధితులతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వరద ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో సహాయం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. వరద ప్రమాదం తగ్గిన తరువాత బాధితులను ఇంటి వద్దకు క్షేమంగా చేరేలా అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. మంత్రి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పెదవాగు ప్రాజెక్టు ద్వారా 14 వేల ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌లో సాగవు తుందని పెదవాగు ప్రాజెక్టు మరమ్మతులకు, గోదావరి బోర్డు 85 శాతం ఆంధ్రప్రదేశ్‌, 15 శాతం తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించాల్సి ఉందన్నారు. అయితే 80 కోట్ల రూపాయలు మరమ్మతులకు అంచనాలు రూపొందించగా గత ప్రభుత్వం తన వాటా చెల్లించకుండా పెడచెవిన పెట్టిందన్నారు. ఆ నిర్లక్ష్యం కారణంగా ప్రస్తుతం ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పెదవాగు ప్రాజెక్టు మరమ్మత్తులకు ప్రణాళికలు రూపొందించి బడ్జెట్‌ కేటాయిస్తామన్నారు. మంత్రి పార్థసారధి మాట్లాడుతూ గోదావరి వరదల కారణంగా నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలుచేసే పోలవరం ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు నష్టపరిహారం త్వరితగతిన అందించేందుకు ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. కలెక్టర్‌ వెట్రిసెల్వి, ఎస్పీ కే.ప్రతాప్‌ శివకిషోర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ధాత్రిరెడ్డి, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, జడ్పీ సీఈవో సుబ్బారావు, డీపీవో శ్రీనివాస విశ్వనాఽథ్‌, డ్వామా పీడీ రాము తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు ఏ ఇబ్బందులు రానివ్వం..

వేలేరుపాడు : వేలేరుపాడు మండలంలోని కన్నాయిగుట్ట గ్రామంలో వరద పరిస్థితిని మంత్రులు పరిశీలించారు. వరదల కారణంగా ప్రభుత్వపరంగా అందిస్తున్న సాయంపై ఆరా తీశారు. ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్‌తో సహా అధికారులంతా తమను బాగానే చూసుకుంటున్నారని బియ్యం, నిత్యావసర సరుకులు అందించారని ప్రజలు చెప్పడంతో మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. వరద చుట్టుముట్టిన గ్రామాల ప్రజ లకు కుటుంబానికి రూ.3 వేలు చొప్పున సాయం అందిస్తామని మంత్రులు చెప్పడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గతంలో కొంతమందికే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇచ్చారని ఇంకా 65 కుటుంబాలకు తమ గ్రామంలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని గిరిజనులు మంత్రులకు విన్న వించారు. తమ ప్రభుత్వం కొత్తగా వచ్చిందని కొంచెం కుదుటపడ్డాక అంద రికీ ప్యాకేజీ చెల్లిస్తామని కొంచెం ఓపిక పట్టాలని సూచించారు. అనంతరం శివకాశీపురం ఆశ్రం పాఠశాలలో అధికా రులతో సమీక్ష నిర్వహించి వరదలు తీవ్రమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.

దువ్వలో...

తణుకు : తణుకు మండలం దువ్వ గ్రామంలో ఎమ్మెల్యే ఆరి మిల్లి రాధాకృష్ణ ఆథ్వర్యంలో మంత్రులు శనివారం సాయంత్రం పరి శీలించారు. దువ్వ వయ్యేరు కాలువపై ఉన్న పాత వంతెన పరిశీలించారు. నీట మునిగిన వరిపొలాలను పరిశీలించారు. అనంతరం అత్తిలి మండలం వరిఘేడు, తిరుపతిపురం గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు.

ఎస్‌. ఇల్లిందలపర్రులో..

పెనుమంట్ర : ఇది ప్రకృతి వైపరీత్యం కాదు..గత వైసీపీ ప్రభుత్వ వైఫ ల్యమే.. కాలువలను, డ్రెయినేజీలను ఐదేళ్లలో కనీసం పట్టించుకోక పోవ డంతో తూడు, గుర్రపుడెక్కతో పూడుకుపోయి డ్రెయిన్లు లాగక పొలాలు ముంపు బారిన పడ్డాయని మంత్రి ఆరోపించారు. పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపర్రులో గోస్తనీ నది, జిఅండ్‌వీ కెనాల్‌ పోటెత్తడంతో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులతో ఇష్టా గోష్టి నిర్వహించారు. రైతులు కౌలు రైతులను ఆదుకోవాలని విత్తనాలు సరఫరా చేయాలని, భవిష్యత్తులో పొలాలు ముంపు బారిన వాటిల్లకుండా శాశ్వత పరిష్కారం చేయాలని పలువురు రైతులు మొరపెట్టుకున్నారు. మంత్రి అచ్నెన్నాయుడు మాట్లాడుతూ వచ్చే వేసవిలో జిఅండ్‌వీ కెనాల్‌, గోస్తనీ నది ఆధునీకరణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. గత వైసీపీ పాలకులు రైతుల ఖాతాలో ధాన్యం సొమ్ము జమ చేయలేదని 1600 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే నాబార్డు నుంచి వెయ్యి కోట్లు అప్పు తెచ్చి రైతుల ఖాతాలో జమ చేశామన్నారు .మరో రూ.600 కోట్లు ఐదు ఆరు రోజుల్లో జమ చేస్తామని చెప్పారు.ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, ఆరుమిల్లి రాధాకృష్ణ ఉన్నారు.

బాధితులకు రూ.3 వేలు నగదు,నిత్యావసర సరుకులు

దాచారం పునరావాస కాలనీలో ఉంటున్న 250 మంది గొమ్ముగూడెం నిర్వాసితులకు 25 కేజీల బియ్యం, 3 వేలు నగదు, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పామాయిల్‌ అందజేశారు. మూడు పునరావాస కేంద్రాల్లోని దాదాపు 1200 కుటుంబాలకు సహాయం అందించారు. దువ్వలో 1,198 వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు.

Updated Date - Jul 28 , 2024 | 12:07 AM