అమాత్యులెవరు ?
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:33 AM
గోదావరి తీరాన చంద్రబాబు కొలువులో ఎవరు మంత్రులు కాబోతున్నారు. ఏ ఏ వర్గాలకు అవకాశం ఇవ్వబోతున్నారు. సామాజిక వర్గాల వారీగా బేరీజు వేసి, సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాతిపదికన ఎందరికి మంత్రి పదవులు దక్కనున్నాయి.

అమాత్యులెవరు ?
మంత్రి పదవి రేస్‌లో సీనియర్లు
తొలి వరుసలో రఘురామరాజు, పితాని, నిమ్మల
రఘురామకు స్పీకర్ పదవి అంటూ ప్రచారం
మిత్రపక్షాలకు ఛాన్స్ ఉండేనా ? రేపటిలోగా స్పష్టత
ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి : గోదావరి తీరాన చంద్రబాబు కొలువులో ఎవరు మంత్రులు కాబోతున్నారు. ఏ ఏ వర్గాలకు అవకాశం ఇవ్వబోతున్నారు. సామాజిక వర్గాల వారీగా బేరీజు వేసి, సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకుని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాతిపదికన ఎందరికి మంత్రి పదవులు దక్కనున్నాయి. అందరు ఊహించినట్లుగానే ట్రిపుల్ ఆర్‌కు స్పీకర్ ఇస్తారా? లేదా ? మంత్రి పదవితో సరిపెడతారా? అనే చర్చ అందరినోట.
చంద్రబాబు మనస్సులో ఏముంది?
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల మాదిరిగానే గోదావరి ఒడ్డున ఉమ్మడి కూటమికి ఓట్లు పోటెత్తాయి. అధికార వైసీపీకి ఒక్క సీటు దక్కనివ్వకుండా మట్టి కరిపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే పట్టం కట్టారు. తిరుగులేని మెజార్టీ రికార్డులను సృష్టించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేయనుంది. ఈలోపే కొత్తగా మంత్రి వర్గంలో ఎవరెవరికి స్థానం దక్కు తుందనేదే కూటమిలో ఆతృత. సీనియర్లు తమ కార్యకర్తలను ఇప్పటికే సముదాయిస్తున్నారు. నోరుజారి కామెంట్లు చేయ వద్దంటూ వారిస్తున్నారు. 2014కి ఏ మాత్రం తగ్గకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని 15 నియోజక వర్గాల్లోనూ కూటమికి సునామిలా ఫలితాలు వచ్చాయి. గెలిచిన వారిలో సీనియర్లతోపాటు తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసిన వారు ఉన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆశీస్సులు మెండుగా ఉన్న వారు లేకపోలేదు. ఇందులో ఉండి నుంచి గెలుపొందిన రఘురామకృష్ణరాజు పేరు తొలివరుసలో వినిపిస్తోంది. ఆయ న పోటీకి దిగిన వెంటనే కాబోయే స్పీకర్ అంటూ ఆయన అభిమానులంతా నినాదాలు చేశారు. జగన్ ప్రభుత్వంలో అవమానాలు ఎదుర్కొన్న ఆయన తగురీతిలో బదులు తీర్చుకుంటారంటూ సెటైర్లు విసిరారు. రఘురామ ఎక్కడా నోరు జారకుండా సంయమనంతో వ్యవహరిస్తూనే అంతా చంద్రబాబు చూసుకుంటారంటూ తన భవిష్యత్‌ను చెప్పకనే చెప్పారు. రఘురామను స్పీకర్‌గా తీసుకుంటారా ? లేక ? మంత్రి పదవితో సరిపెడతారా అంటూ ఓ చర్చ సాగుతోంది. చంద్రబాబు మనస్సులో ఏముందో కాని ఒకవైపు రఘురామ అభిమానులు, టీడీపీ శ్రేణులు రఘురామకు అత్యున్నత పదవి దక్కడం ఖాయమంటూ ఇప్పటికే ధీమాగా ఉన్నారు. నరసాపురం సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన జగన్‌రెడ్డి అకృత్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలన్నింటిని రచ్చబండ రూపంలో బహిర్గతం చేశారు. ఎవరు జగన్‌కు వ్యతిరేకంగా నోరెత్తని సమయంలోను రఘురామే ముందు వరుసలో నిలబడి కాస్తో అంటూ జగన్‌కు బహిరంగ సవాల్ విసిరారు. ఇప్పుడు ఇవన్ని పరిగణనలోకి తీసుకున్నారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలోనూ, 2014లో చంద్రబాబు హయాంలోనూ ఆయా మంత్రి వర్గాల్లో చోటు దక్కించుకున్న సీనియర్‌గా ఆచంట ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ ఉన్నారు. ఆయన అనుభవం, మరోవైపు బీసీ వర్గాల ప్రతినిధిగా ఆయన కొత్త మంత్రి వర్గంలోనూ మరోసారి బంఫర్ ఆఫర్ ఇచ్చి తీరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఉమ్మడి జిల్లాలో గెలిచిన అభ్యర్థుల్లో ఆయనే సీనియర్ కావడం పితానికి ఫ్లస్ పాయింట్. వివాదరహితుడిగా వున్న ఆయనకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే కొందరు డిమాండ్ చేయడం ఆరంభించారు. పితాని సైతం చంద్రబాబు తనకు ఛాన్స్ ఇస్తారన్న ఆశాభావంతో ఉన్నారు.
టీడీపీ రాజకీయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి సైతం చోటు ఖాయమంటూ ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. దీనికి తగ్గట్లుగానే పోలింగ్‌కు ముందే కాబోయే మంత్రి అంటూ నిమ్మలను ఆయన అభిమానులంతా కీర్తిస్తూ వచ్చారు. ఆయన సంయమనంతో అధిష్ఠానం నిర్ణయిస్తుందంటూ సున్నితంగా తమ వారికి చెబుతూ వస్తున్నారు. మూడోసారి వరుసగా పాలకొల్లు నుంచి హ్యాట్రిక్ సాధించారు. జగన్ ప్రభుత్వంలో ప్రజా వ్యతిరేక చర్యలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. వినూత్న నిరసనలు చేశారు. పార్టీ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారారు. ఇవన్ని నిమ్మలకు కలిసి వచ్చే అంశాలే. బలమైన సామాజికవర్గానికి చెందిన రామానాయుడు తిరుగులేని మెజార్టీతో ఈసారి పాలకొల్లు నుంచి గెలుపొందారు.
జూ ఎన్నికల ముందే వైసీపీని వీడి టీడీపీలో చేరి నూజివీడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందిన కొలుసు పార్థసారథి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయన జగన్ ప్రభుత్వంలోను మంత్రిగా వ్యవహరించారు. తనకున్న అనుభవాన్ని బీసీ వర్గాలను దృష్టిలో పెట్టుకుని మరొక ఛాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం. జిల్లాలో సీనియర్‌గా ఉన్న బీసీ నేత పితానికి అవకాశం ఇస్తారా? లేక? పార్థసారథికి ఇస్తారా? అనేదే పార్టీలో చర్చ సాగుతోంది.
కరోనా సమయంలో పార్టీ వ్యవహారాలను దగ్గరుంచి పర్యవేక్షించటం పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలను క్షేత్రస్థాయిలోకి చేర్చడం, పలు అంశాలపై ప్రజాభిప్రాయ సేకరణ చేయడం, ఆ నివేదికలను అధిష్ఠానానికి చేర వేయడం వంటి కీలక బాధ్యతలు నిర్వహించి తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి హోదాలో గోపాలపురం నియోజక వర్గంలో హోం మంత్రి తానేటి వనితపై గెలుపొందిన మద్దిపాటి వెంకటరాజు సైతం ఇప్పటికే మంత్రివర్గ రేసులో ఉన్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా ఆది నుంచి ఆయన తెలుగుదేశం అధికారంలోకి రావడం ఎంత ఖాయమో, తాను మంత్రిని కావడం అంతే ఖాయమన్నట్లు కార్య కర్తలు వద్ద నేతలు వద్ద వ్యాఖ్యలు చేసేవారు.
మిత్రపక్షాల సంగతేంటి...
మంత్రి మండలిలో ఎవరికి చోటు ఇస్తారనే అంశంలో ఇప్పటికే ఐదుగురి పేర్లు వినిపిస్తుండగా, ఇంకోవైపు మిత్రపక్షాల తరపున ఎవరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారనేదే ఓ పెద్ద సస్పెన్స్. జనసేన పక్షాన భీమవరం నుంచి ఎన్నికైన అంజిబాబు, తాడేపల్లిగూడెం నుంచి ఎన్నికైన బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు ఇప్పటికే ప్రముఖంగానే వినిపిస్తున్నాయి. అయితే జనసేన ప్రధాన ప్రతిపక్షంగా ఉండబోతుందని ప్రచారం సాగుతున్న తరుణంలో మరోవైపు మంత్రి వర్గంలో ఎవరెవ్వరికి చోటు అనే దానిపై చర్చ సాగడం విశేషం. అయితే జనసేన అధిపతి పవన్ కల్యాణ్ నిర్ణయం మేరకే ఉభయ గోదావరి జిల్లాల్లో రెండుకు పైగా మంత్రి పదవులు దక్కడం ఖాయమని, ఇప్పటికే భారీగా ప్రచారం సాగుతోంది. నరసాపురం, ఏలూరు లోక్‌సభ స్థానాల పరిధిలో కైకలూరు నుంచి బీజేపీ పక్షాన గెలిచిన ఏకైక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆయన ఇంతకుముందే 2014లో చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేశారు. ఈసారి కూడా కామినేని తనకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో..
గత ప్రభుత్వ హయాంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా అప్పటి ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలను మంత్రులుగా తీసుకున్నారు. అంతకుముందు వరకు జిల్లాలో డెల్టా, మెట్టప్రాంతాలుగా విభజించి మంత్రులను ఎంపిక చేసేవారు. జగన్ మాత్రం దానికి స్వస్తి చెప్పి నేరుగా ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలంటే వారికే ఇచ్చేశారు. తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణను ఉప ముఖ్యమంత్రిగా ఆ పొరుగునే ఉన్న తణుకు నుంచి కారుమూరి వెంకట నాగేశ్వ రరావును మంత్రులుగా తీసుకున్నారు. కొవ్వూరులో ప్రాతి నిధ్యం వహిస్తున్న తానేటి వనితను హోం మంత్రిగా ఎంపిక చేశారు. ఉమ్మడి పశ్చిమలో రెండో విడత ఈ ముగ్గురికి అవ కాశం ఇచ్చారు. తొలి విడతలో ఈ ఏలూరు నుంచి ఆళ్ళ నానిని ఉప ముఖ్యమంత్రిగా, ఆచంట నుంచి శ్రీరంగనాథ రాజును మంత్రిగా తీసుకున్నారు. అంటే సరా సరిన 13 మం ది వైసీపీ ఎమ్మెల్యేల్లో గడిచిన ఐదేళ్లలో ఐదు గురికి మంత్రి పదవులు దక్కింది. ఆ ప్రాతిపదికన చంద్రబాబు సీనియర్ల కు ఈసారి అవకాశం ఇచ్చి జూనియర్లకు ఆ తదుపరి ఛాన్స్ ఇస్తారని ప్రచారం ఇప్పటికే కూటమిలో ఊపందుకుంది. ఒకవేళ సామాజిక వర్గాల వారీగా కొందరిని సంతృప్తి పరి చేందుకు విప్ లేదా చీఫ్ విప్ పదవుల్లో ఒక పదవిని ఎవరో ఒకరికి కట్టబెట్టే అవకాశం లేకపోలేదనే ప్రచారం సాగు తోంది. ఇంతకుముందు విప్‌గా టీడీపీ హయాంలో చింతమ నేని ప్రభాకర్, వైసీపీ హయాంలో ముదునూరి ప్రసాదరాజు వ్యవహరించారు. ఈసారి చింతమనేనికి మంత్రి పదవి దక్కకపోతే మరోసారి విప్ పదవి ఇస్తారని భావిస్తున్నారు.