Share News

అమాత్యా .. ఎక్కడ ?

ABN , Publish Date - Jan 09 , 2024 | 12:18 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ముంత్రుల జాడే లేదు. మంత్రులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా దాదాపు నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు.

అమాత్యా .. ఎక్కడ ?

బయటకు రాని మంత్రులు

నియోజకవర్గాలకే పరిమితం

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లేవు

గతంలో మంత్రులు వస్తే ఘనం

నిధులు ఇస్తారన్న భరోసా

ఇప్పుడు అంతా బటన్‌ నొక్కుడే

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాకు మంత్రి వస్తున్నారంటే ఆడంబరం. శంకుస్థాపన చేస్తే నియోజకవర్గానికే గౌరవం. మంత్రి శాఖ ద్వారా నిధులు రాబొట్టుకోవచ్చన్న భరోసా. శాసన సభ్యులు కూడా మంత్రు లను ఆహ్వానించడంలో పోటీ పడేవారు. జిల్లాకు వస్తే ఆయా శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించేవారు. అవసరమైన ప్రతిపాదనలు చేయాలంటూ దిశానిర్దేశం చేసేవారు. ఇదంతా గతం.. ఇప్పుడంతా రివర్సే. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో ముంత్రుల జాడే లేదు. మంత్రులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయింది. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా దాదాపు నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారు. ఇతర శాఖల మంత్రులు జిల్లాకు రావడం బహు అరుదు. మంత్రులను ఆహ్వానించే పరిస్థితులు కూడా లేవు. గతంలో అభివృద్ది పనులు ముమ్మరంగా ఉండేవి. మంత్రులను పిలిచి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించే ఆనవాయితీ ఉండేది. ఆ క్రమంలోనే ఆయా శాఖల మంత్రుల నుంచి నిధులు ఇవ్వాలంటూ స్థానిక శాసన సభ్యులు కోరేవారు. నిధులు రాబట్టుకునేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో అటువంటి సందడి ఎక్కడా లేదు. గడచిన నాలుగున్నరేళ్లలో జిల్లాకు మంత్రులు వచ్చిన దాఖలాలు చాలా అరుదు. జిల్లా అభివృద్ధి మండలి సమీక్షకు ఇన్‌చార్జ్‌ మంత్రి మాత్రం హాజరవు తున్నారు.

అభివృద్ధి పనులు ఉంటేగా !

గతంలో ఆధునికీకరణ పనులతో నీటి పారుదల శాఖ నిత్యం బిజీగా ఉండేది. ఏదో ఒక పని జరుగుతుండేది. పనుల పరిశీలనకు , కొత్త పనుల ప్రారంభోత్సవానికి నీటి పారుదల శాఖ మంత్రిని రప్పించేవారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఒక్కసారి కూడా నీటి పారుదల శాఖ మంత్రి అధికారిక పర్యటన చేయలేదు. పంచాయతీ రాజ్‌ శాఖదీ అదే పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి అంతా పంచాయతీ రాజ్‌ శాఖపై ఉంటుంది. నిధులు మంజూరులో ఆ శాఖ కీలకంగా వ్యవహ రిస్తుంది. ప్రస్తుత ప్రభుత్వంలో పంచాయతీరాజ్‌ శాఖకు ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించిన సందర్భాలు లేవు. ఉపాధి హామీ నిధులంటూ ఇళ్లకు కేటాయిస్తున్నారు. రహదారుల అభివృద్ధిని విస్మరించారు. దాంతో పంచాయతీ రాజ్‌ మంత్రి అవసరం లేకుండా పోయింది. అందుకే ఆయనను కూడా జిల్లాకు ఆహ్వానించిన దాఖలాలు లేవు. జిల్లా స్థాయిలో సమీక్షలు లేవు. కొత్త ప్రతిపాదనలు అంతకన్నా లేవు. నిధులు మంజూరు చేసినా పనులయ్యే పరిస్థితి లేదు. జిల్లాకు ఇన్‌ఛార్జ్‌ మంత్రిగా దాడిశెట్టి రాజా ఉన్నారు. జిల్లా అభివృద్ధి మండలి సమీక్షకు హాజరవుతున్నారు. ఒక దశలో ఆయనకే జిల్లా నేతలు ప్రశ్నలు కురిపించారు. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వస్తే రహదారులు పరిస్థితి ఏమిటో అర్థమ వుతందంటూ ఆర్‌అండ్‌బీ శాఖ, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రిని ఉద్దేశించి సమీక్షలోనే చురక లంటించారు. ఎన్నికల ఏడాది కావడంతో ఇటీవల ఆర్‌అండ్‌బీలో కొద్దిపాటి నిధులు మంజూరు చేశారు. టెండర్‌లు ఖరారు చేశారు. సుమారు 25 పనులకు టెండర్‌లు ఖరారైతే ప్రస్తుతం 5 పనులు మాత్రమే ప్రారంభానికి నోచుకున్నాయి. బకాయి బిల్లులను మంజూరు చేస్తేనే పనులు ప్రారంభిస్తామంటూ కాంట్రాక్టర్‌లు భీష్మిం చారు. దాంతో పనులు కూడా ప్రారంభానికి నోచుకోవడం లేదు. పేరుకే మంత్రులు ఉంటున్నారు. నిధులు మంజూరు చేయ లేక సతమతమవుతున్నారు. జిల్లాలోనే పౌర సరరఫరాల శాఖ మంత్రి ఉన్నాసరే ధాన్యం కొనుగోలుకు సక్రమంగా సంచులు పంపిణీ చేయలేక పోతున్నారన్న అప వాదు ఉంది. ధాన్యం కొనుగోలులోనూ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇలా అన్ని శాఖల మంత్రులకు నిధులు లేమి వెంటాడుతోంది. అభివృద్ధి పనులకు హామీలు ఇచ్చే పరిస్థితి లేదు.

ముఖ్యమంత్రి శంకుస్థాపనలకే దిక్కులేదు

జిల్లాలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసిన పనులకే దిక్కు లేకుండా పోయింది. మెడికల్‌ కళాశాల, వాటర్‌గ్రిడ్‌ పనులు ముందుకు సాగడం లేదు. నర్సాపురం నియోజకవర్గం లోనూ, గణపవరంలో సబ్‌స్టేషన్‌లకు ముఖ్యమంత్రి శంకు స్థాపన చేశారు. వాటి పనులే ఇప్పటివరకు ప్రారంభించలేదు. ముఖ్య మంత్రి శంకుస్థాపనలకే మన్నన లేకుండా పోయింది. ఇక మంత్రులను ఆహ్వానించే అవసరం ఏముందన్న పరిస్థితులో జిల్లా నేతలు మిన్నకుండి పోతున్నారు.

Updated Date - Jan 09 , 2024 | 12:18 AM