ఏ ఒక్క రైతూ నష్టపోకూడదు
ABN , Publish Date - Jul 28 , 2024 | 12:00 AM
వరి పొలాలు ముంపునకు గురైన ఏ ఒక్క రైతు నష్టపోకూడదని రాష్ట్ర వ్యవసాయఽశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.

రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు
శాశ్వత పరిష్కారం కోసం పనులు గుర్తించి ప్రతిపాదనలు ఇవ్వండి
తణుకు, జూలై 27: వరి పొలాలు ముంపునకు గురైన ఏ ఒక్క రైతు నష్టపోకూడదని రాష్ట్ర వ్యవసాయఽశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం రాత్రి జిల్లా అధికారులతో పంట నష్టంపై సమీక్ష సమావే శం నిర్వహించారు. నష్టం వివరాలు రెవెన్యూ, వ్యవసాయ శాఖలు పక్కాగా సర్వే చేసి అందించాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో డ్రెయిన్లు, కాల్వల పూడిక తీత లేకపోవడం వల్లే ఇప్పుడు రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. గోదావరి ఉధృతి పెరిగినందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలకు కావాల్సినవన్నీ సమకూరుస్తామన్నారు. లంక గ్రామాల్లో పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, ఆయా ప్రాంతాల్లో ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చ రించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలకు రూ.మూడు వేల చొప్పున అందజేస్తామన్నారు.
రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ జిల్లాలో ఇరిగేషన్‌కు సంబంధించి అన్ని పనులను గుర్తించి శాశ్వత పరిష్కారానికి ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. గోదావరి కరకట్ట ప్రాంతంలో బలహీన ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి మండలానికి నోడల్ అధికారులను నియమించి క్షేత్రస్థాయిలో ఉండేలా ఆదేశించాలన్నారు.
హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలు కారణంగా ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ వరద ఉధృతిని దృష్టిలో ఉంచుకుని అన్ని ముందస్తు చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టామన్నారు.
ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ప్రతియేటా ముంపు వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, వ్యవసాయ శాఖ డైరెక్టరు ఢిల్లీ రావు, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, డీఆర్వో ఉదయ భాస్కరరావు, ఆర్డీవో అంబరీష్, జేడీ వెంకటేశ్వరరావు, ఇరిగేషన్ ఈఈ దక్షిణామూర్తి మున్సిపల్ కమిషనర్ బీవీ రమణ, టీడీపీ నాయకులు డాక్టర్ దొమ్మేటి వెంకటసుధాకర్, కలగర వెంకటకృష్ణ, బసవ రామకృష్ణ, మంత్రిరావు వెంకటరత్నం, పరిమి వెంకన్నబాబు, వావిలాల సరళాదేవి, పితాని మోహన్ పాల్గొన్నారు.