Share News

పునాదులు దాటని వైద్య విద్య

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:46 AM

రాష్ట్ర వైద్య విద్యలో నవశకం అంటూ.. వేల కోట్లతో పెద్ద ఎత్తున మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామంటూ వైసీపీ ఊదరగొడు తోంది. కొత్త కళాశాలల ప్రారంభం, తరగతుల నిర్వహణ, నూతన భవనాల నిర్మాణంపై వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్దంగా కనిపిస్తున్నాయి.

పునాదులు దాటని వైద్య విద్య
దగ్గులూరులో పూడిక చేయని స్థలం

దగ్గులూరు మెడికల్‌ కళాశాల

శంకుస్థాపనకు మూడేళ్లు..

నిర్మాణ పనులు ప్రారంభించి 14 నెలలు..

ఏలూరులో తాత్కాలిక వైద్య కళాశాలతో విద్యార్థుల పాట్లు.. పేరుకే ల్యాబ్‌లు.. రసాయనాలు, అవసరమైన సై ్లడ్స్‌ లేవు

నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కాలేజీ, హాస్టళ్లు.. భర్తీకాని పోస్టులు.. నాణ్యతలేని విద్యాబోధన.. అయోమయంలో విద్యార్థులు

(భీమవరం–ఆంధ్రజ్యోతి/పాలకొల్లు రూరల్‌/ఏలూరు క్రైం)

రాష్ట్ర వైద్య విద్యలో నవశకం అంటూ.. వేల కోట్లతో పెద్ద ఎత్తున మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామంటూ వైసీపీ ఊదరగొడు తోంది. కొత్త కళాశాలల ప్రారంభం, తరగతుల నిర్వహణ, నూతన భవనాల నిర్మాణంపై వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్దంగా కనిపిస్తున్నాయి. ఏలూరు మెడికల్‌ కాలేజీ ప్రారంభమైనా కనీస వసతులు లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారు. పాలకొల్లు కాలేజీ భవన నిర్మాణానికి అసలు పునాదులే పడకపోవడం ఆంధ్రజ్యోతి పరిశీలనలో వెలుగు చూశాయి.

రాష్ట్రంలో పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం గొప్పగా చెప్పు కుంది. కాని ఆచరణలో ఊదాశీనంగా వ్యవహరించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ వైద్య కళాశాలను తొలుత తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూములలో ఏర్పాటు చేయాలని భావించారు. కాని, తర్వాత దానిని నరసాపురంలో పేదల ఇళ్ల కోసం సేకరించిన 54 ఎకరాల్లో నిర్మించాలని నిర్ణయించారు. ఈ స్థలం భవన నిర్మాణాలకు అనుకూలంగా లేదని తేల్చడంతో పాలకొల్లు రూరల్‌ మండలం దగ్గులూరులో 63 ఎకరాలు సేకరించారు. మూడేళ్ల క్రితమే ఈ భూమిని వైద్య విధాన పరిషత్‌కు అప్పగించారు. వాస్తవానికి భవన నిర్మాణానికి అంచనాలు రూపొందించి, పరిపాలనా అను మతులు తీసుకుని, ఆపై టెండర్లు ఖారారు చేసి, ఏజన్సీతో ఒప్పందం చేసుకున్న తర్వాత పనులకు శంకుస్థాపన చేయాలి. కాని సర్కార్‌ టెండర్లు ఖరారు కాకుండానే 2021లో వర్చువల్‌ విధానంలో సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. నిర్మాణానికి రూ.475 కోట్లు కేటాయించారు. అప్పటికీ పూర్తిస్థాయిలో భూసేకరణ ప్రక్రియ పూర్తికాలేదు. రైతులకు సొమ్ములు చెల్లించలేదు. శంకుస్థాపన జరిగి ఏడాది పూర్త యిన తర్వాత రైతులకు సొమ్ములు చెల్లించి ఏజన్సీని ఖరారు చేశారు. సీఎం నరసాపురం పర్యటన 2022 నవంబరులో ఖరారైంది. దీనికి వారం ముందు నుంచి వైద్య కళాశాల పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ ఏజన్సీ కార్యాలయం కోసం అవసరమైన స్థలంలో మట్టి పూడ్చారు. ఇప్పటికీ కార్యాలయం పనులు పూర్తి కాలేదు. ఒకటి, రెండు భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వైద్య కళాశాల కోసం సేకరించిన 63 ఎకరాలను పూర్తిస్థాయిలో ఇంకా పూడిక చేయలేదు. కళాశాల మంజూరుచేసి మూడేళ్లయ్యింది. పనులు ప్రారంభించి 14 నెలలు కావస్తోంది. స్థలమే పూడిక చేయకపోవడంతో కళాశాల ఎప్పటికీ అందుబాటులోకి వ స్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వద్ద సొమ్ములు లేకపోవడం వల్లే నిర్మాణాల్లో జాప్యం జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వైద్య విద్య ఇలాగేనా ?

ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన ఏలూరు ప్రభుత్వ మెడికల్‌లో అరకొర సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. 150 సీట్లతో పాత బస్టాండ్‌ సమీపంలోని జిల్లా వైద్యాధికారి కార్యాలయ తాత్కాలిక భవనంలో తరగతు లు ప్రారంభమయ్యాయి. అక్కడే ల్యాబ్‌లు ఉన్నట్లు, మరికొన్ని ల్యాబ్‌లు ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్నట్లు చూపించారు. బాలికలు, బాలురకు హాస్టల్స్‌ను వేరే అపార్టుమెంట్లు చూపిం చి చివరకు ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఎంసీహెచ్‌ (తల్లిబిడ్డల విభాగం) భవనం పైఅంతస్తులో తాత్కాలికంగా హాస్టల్స్‌ను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి ఆవరణలో మెడికల్‌ కాలేజీ భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. పనులు కొనసాగుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 1న మెడికల్‌ కాలేజీ తరగతులు ప్రారంభమయ్యాయి. ఫస్టియర్‌లో అనాటమి 210 తరగతులు, ఫిజియాలజీ 130 తరగతులు, బయాలజీ 78 తరగతులతోపాటు పెద్ద సంఖ్యలో సెల్ఫ్‌ గ్రూప్‌ లెర్నింగ్‌ తరగతులు నిర్వహించాల్సి వుంది. కాలేజీలో పేరుకు ల్యాబ్‌లున్నా అవసరమైన రసాయనాలు, హిస్టాలజీ స్లైడ్స్‌ లేవు. ల్యాబ్‌లో ప్రాక్టికల్స్‌ చేయాల్సి వున్నా డిజిటల్‌ తరగతు ల్లోనే చూపిస్తున్నారు. బయాలజీ, ఫిజియోలజీ ల్యాబ్‌లు ఇదేవిధంగా ఉన్నాయి. ఇంత వరకూ అవసరమైన పరికరాలు లేవు. ఇదేమి మెడికల్‌ కాలేజీ అంటూ విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. తరగతులు ప్రారంభమై ఐదు నెలలు పూర్తయినా ఇంత వరకూ ల్యాబ్‌లో ప్రాక్టికల్స్‌ తూతూ మంత్రంగానే సాగుతున్నాయి. అవసరమైన వైద్య యంత్ర సామగ్రి లేవు. వీటి ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైంది. తాత్కాలిక భవనాల్లో తరగతి గదులు నిర్వహిస్తుండగా అక్కడ వైద్య తరగతులు తాత్కాలికమే అన్నట్లు కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీ పోస్టులను మిగిలిన టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయకపోవడంతో నేటికీ తూతూమంత్రంగానే మెడికల్‌ కళాశాలను నిర్వహిస్తున్నట్లు విద్యార్థులు వాపోతు న్నారు. భవనాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలంటే మరో మూడేళ్లు పడుతుంది.

Updated Date - Feb 06 , 2024 | 12:46 AM