Share News

పెన్షన్‌ రోజుల్లో ఫుల్‌ జోష్‌ !

ABN , Publish Date - Apr 07 , 2024 | 11:56 PM

గడిచిన రెండు రోజుల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.. సరాసరిన 20 శాతం అదనంగా అమ్మకాలు సాగాయి. దీంతో ఎన్నికల సంఘం ఆరా తీయడం ప్రారం భించింది.. ఎన్నికల వేళ ఏమైనా పక్కదారి పట్టిస్తున్నారా అనే దానిపై దృష్టి పెట్టింది.

పెన్షన్‌ రోజుల్లో ఫుల్‌ జోష్‌ !

రెండు రోజులుగా పెరిగిన మద్యం అమ్మకాలు

ఎందుకు పెరిగాయంటూ ఎన్నికల సంఘం ఆరా

పెన్షన్‌ పంపిణీ వల్లే అంటున్న ఎక్సైజ్‌ అధికారులు

ప్రతినెలా ఇలాగే పెరుగుతుందంటూ వివరణ

విస్తుబోయిన ఎన్నికల సంఘం..

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

గడిచిన రెండు రోజుల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి.. సరాసరిన 20 శాతం అదనంగా అమ్మకాలు సాగాయి. దీంతో ఎన్నికల సంఘం ఆరా తీయడం ప్రారం భించింది.. ఎన్నికల వేళ ఏమైనా పక్కదారి పట్టిస్తున్నారా అనే దానిపై దృష్టి పెట్టింది. అయితే ఎక్సైజ్‌ అధికారులు చెప్పిన సమాధానంతో ఎన్నికల అధికారులు విస్తుపోతున్నారు .. ఎందుకో ఏమిటో తెలియాలంటే ఇది చదవండి..

వృద్ధులకు ప్రభుత్వం పెన్షన్‌ ఇవ్వడం తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టి రామారావు హయాంలో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచీ టీడీపీ పెన్షన్‌ పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వంలో రూ. 3 వేలు చేశారు. దానిని రూ. 4 వేలు చేసి ఇంటికే పంపిణీ చేస్తామంటూ తెలుగు దేశం ప్రకటించింది. ఏప్రిల్‌ నెల నుంచే పెంచిన పెన్షన్‌ అంద జేస్తామని స్పష్టం చేసింది. అంటే జూలై నెలలో ఒకేసారి వృద్ధులకు రూ. 7000 పెన్షన్‌ లభిస్తుంది. ఇది వృద్ధులతో పాటు ఎక్సైజ్‌ శాఖకు ఎంతగానో ప్రయోజనకరం.. ఎందు కంటే వృద్ధులు పెన్షన్‌ అందుకున్న రోజు మద్యం అమ్మకాలు 20 శాతం పెరుగుతాయట. మద్యం అమ్మకాలు ఎందుకు పెరిగాయంటూ ఎన్నికల సంఘం ప్రశ్నిస్తే ఎక్సైజ్‌ అధికారులు ఇచ్చిన సమాఽధానం. ఇందులో నిజమెంతో తెలియదు గానీ పెన్షన్‌ ఇచ్చిన తర్వాత రెండు రోజులు మద్యం విక్రయాల్లో మాత్రం పెరుగుల కనిపించిందని లెక్కలు చెబుతున్నాయి. మద్యం విక్రయాలు అధికమైతే అభ్యర్థులు పక్కదారి పట్టిస్తున్నారనేది ఎన్నికల సంఘం ఉద్దేశం. అందుకే అమ్మ కాలు పెరిగిన షాపుల నుంచి వివరణ కోరుతోంది.

ఎందుకు పెరిగింది..?

వాస్తవానికి జిల్లాలో అమ్మకాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం గగ్గోలు పెడుతూ వచ్చింది. ఆక్వా రంగం దెబ్బతినడం. నిర్మాణ రంగం కుదేలు కావడం, వరి సాగు సక్రమంగా లేకపో వడంతో ఆ ప్రభావం మద్యం విక్రయాలపై పడుతున్నాయని అధికారులు వివరణ ఇస్తూ వచ్చారు. ప్రతిఏటా మద్యం అమ్మకాలు పది నుంచి 15 శాతం పెరగాలి. పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. పెరుగుదల లేకుండా పోయింది. ప్రతి రోజు సగటున జిల్లాలో రూ. 2.10 కోట్లు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ మద్యం దుకాణాలు, ప్రైవేటు బార్‌లలో అమ్మకాలు ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. దాంతో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోలేక పోతున్నారు. ఇప్పటివరకు అమ్మకాలు పెరగడం లేదని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతూ వచ్చింది. ఎక్సైజ్‌ అధికారులు తలలు పట్టుకున్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత సీన్‌ రివర్స్‌ అయ్యింది. అమ్మకాల్లో కాస్త పెరుగుదల కనిపించినా సరే ఎన్నికల సంఘానికి వివరణ ఇవాల్సి వస్తోంది. తాజాగా పెన్షన్‌ పంపిణీ చేసిన రోజున ప్రతిషాపులోనూ అమ్మకాలు పెరిగాయి. ఆ రోజు 20 శాతం అధిక ఆదాయం లభించింది. దీనిపై ఇప్పుడు ఎన్నికల సంఘం దృష్టి పెట్టింది. పెన్షన్‌ పేరుతో మద్యం పక్కదారి పట్టించారా...లేదా నిజంగా అమ్మకాలు జరిగాయా....పెన్షన్‌ లబ్ధిదారులు కొనుగోలు చేశారా ? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. సిబ్బంది మాత్రం పెన్షన్‌ పొందిన వృద్ధులు కొనుగోలు చేయడం వల్లే అమ్మకాలు పెరిగాయని చెపుతున్నారు.ప్రభుత్వం వృద్ధుల కోసం ఇస్తున్న పెన్షన్‌లోనూ కొంత మొత్తం మద్యానికి వెళుతుందా అంటూ ఎన్నికల సంఘం ఇప్పుడు విస్తుపోతోంది.

బార్‌లపై నిఘా ఏదీ ?

బార్‌లలో అమ్మకాలు పెరిగాయి. బ్రాండెడ్‌ రకాలు లభిస్తుండడంతో విక్రయాలు అధికంగానే ఉంటాయి. ఎన్నికల సమయంలో అవి మరికాస్త పెరిగాయి. అధికారుల దృష్టి బార్‌లపై ఉండడం లేదు. మరోవైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కొందరు అభ్యర్థులు సొమ్ములు ఇస్తున్నారు. ప్రతి కార్యకర్తకు కనీసం రూ. 1000 లభిస్తోంది. దాంతో మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయి.వాస్తవానికి క్వార్టర్‌ బాటిళ్లు బార్‌లలో అమ్మడానికి వీలులేదు. కానీ అవికూడా వైసీపీ ప్రభుత్వంలో విక్రయాలు సాగిస్తున్నారు. ఆర్థికంగా సంపన్నమైన పట్టణంలో ఒకే రోజు పెద్దమొత్తంలో బార్‌ల నుంచి మద్యం పక్కదారి పట్టింది. దాదాపు 1500 కేసులు ఐదు బార్‌ల నుంచి అధికార పార్టీ నేత తీసుకు పోయారు. ఎన్నికల కోసమని భద్ర పరుచుకున్నారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాతే వీటి అమ్మకాలు సాగాయి. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. గతంలో అధికార పార్టీ ఆశీస్సులతోనే బార్‌ యజమానులు సిండికేట్‌ అయి షాప్‌లు దక్కించుకున్నారు. అధిక ధరలకు విక్రయి స్తున్నారు. దానికోసం తమ వంతు సహకారం ఉందంటూ పోటీలో ఉన్న అధికార పార్టీ నేతలు బార్‌లపై పడుతున్నారు. తమకు అవసరమైన మద్యాన్ని తీసుకుంటున్నారు. ఇలా బార్‌లలో అధిక విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ మద్యం షాపుల్లో మాత్రం విక్రయాలు పెరిగితే అధికారులు ఆరా తీస్తున్నారు. అదే బార్‌లలో పెరిగినా సరే ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

Updated Date - Apr 07 , 2024 | 11:56 PM