Share News

కొల్లేరు బీటలు

ABN , Publish Date - May 23 , 2024 | 11:50 PM

కొల్లేరు కళ తప్పి ఎడారిని తలపిస్తోంది. పరవళ్ళు తొక్కే మంచినీటి సరస్సు వెలవెలబోతుంది. పచ్చని భూములు బీటలు వారాయి.

 కొల్లేరు బీటలు
ఎండిన అతిపెద్ద మంచినీటి సరస్సు

మనుగడ కోల్పోయిన మత్స్య సంపద

గుక్కెడు నీళ్ల కోసం తిప్పలు అనేకం

ఆటపాక.. పక్షుల కేంద్రానికే పరిమితం

కైకలూరు, మే 23 : కొల్లేరు కళ తప్పి ఎడారిని తలపిస్తోంది. పరవళ్ళు తొక్కే మంచినీటి సరస్సు వెలవెలబోతుంది. పచ్చని భూములు బీటలు వారాయి. పక్షుల కిలకిలరావాలు ప్రకృతి సోయగాలు కనిపించడంలేదు. సరస్సు అందాలు ఆవిరయ్యాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సరస్సుగా పేరొందిన కొల్లేరులో నేడు మనుషులకే కాదు పక్షులకూ గుక్కెడు నీరు దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడక్కడ ఉన్న నీటి కుంటల్లో పక్షులు సేద తీరుతున్నాయి. కొల్లేరును చూస్తే ఇది మంచినీటి సరస్సేనా అని సందేహం కలుగుతుంది. ఎప్పుడూ నీళ్లతో కళకళలాడే కొల్లేరు సరస్సు నేల బీటలు వారిన దుస్థితి నెలకొంది.

ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురవడంతో సరస్సులో నీరు లేదు. 77,138 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కొల్లేరు సరస్సుకు సుమారు 60 మీడియం, మైనర్‌ డ్రెయిన్లు, కాలువల నుంచి పది టీఎంసీల నీరు కొల్లేరులోకి ప్రతీ ఏడాది చేరుతుందని నిపుణులు అంచనా వేసేవారు. కళకళలాడుతున్న కొల్లేరులోని నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రమార్గం ద్వారా ప్రవహించి సరస్సు అంతర్భాగంలో ఐదు టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని అంచనా. నేడు అందుకు భిన్నంగా సరస్సు ఎడారిని తలపిస్తోంది. వాతావరణ సమతుల్యత దెబ్బతిని సరస్సు కళ కోల్పోయింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో భూగర్భజలాలు సమృద్ధిగా ఉండేవి. రానురాను భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. పది అడుగులు లోతు వెళితే ఉప్పునీరు వస్తుంది.

సుధీర్ఘ ప్రాంతాలకు వలసలు

నీటి కళతో కళకళలాడుతున్న సమయంలో కొల్లేరు ప్రజలు సంప్రదాయ చేపలవేట చేసుకుని జీవనం సాగించేవారు. చేపల వేటపై ఆధారపడే వేలాది కుటుంబాలు జీవించేయి. నేడు నీరు లేక చేసేదిలేక ప్రజలు సుదీర్ఘ ప్రాంతాలకు వలసలు పోతున్నారు. సుమారు 50 ఏళ్ల కాలంగా ఇలాంటి దుస్థితి కానరాలేదు. గత మూడు, నాలుగేళ్ల కాలంలో కొద్దిమేర నీటి నిల్వలు ఉండేవి. ఈ పరిస్థితిని ఎన్నడూ చూడలేదని కొల్లేటిలోని ప్రజలు వాపోతున్నారు. ఉప్పుటేరు నుంచి సముద్రపు పోటు కలిగి కైకలూరు, ఆకివీడు మండలాల్లోని కొల్లేరు సరస్సులోకి ఉప్పుటేరు ప్రవహిస్తుంది. ఈ నీటి వల్ల మత్స్యసంపదకు నష్టం వాటిల్లితుంది. ఈ నీరు పశువులు తాగేందుకు కూడా పనికిరావడం లేదు.

తిరుగు ముఖం పడుతున్న పక్షులు

కొల్లేరులో సామర్థ్యానికి తగిన నీటి నిల్వలు లేకపోవడంతో సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చే వలసపక్షులు కూడా తిరిగిముఖం పట్టాయి. కొల్లేరులో లభించే 80 రకాల మత్స్యసంపద మనుగడ ప్రశ్నార్థకమైంది. కైకలూరు నుంచి ఏలూరు వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారికి ఇరువైపులా ఉన్న కొల్లేరు సరస్సులో చిన్నచిన్న నీటికుంటలు కన్పించిన దాఖాలులు లేవు. ఎంత వర్షాభావం తక్కువగా ఉన్న చిన్న, పెద్ద ఎడ్లగాడిలో ఎప్పుడూ నీరు ప్రవహిస్తూనే ఉండేది. అలాంటిది ఈ ఏడాది గాడిల్లో నీరు లేక నేలబీటలు వారింది. కొల్లేరు అభయారణ్యప్రాంతంలో అక్కడక్కడ పచ్చిక బైల్లు కూడా ఎండిపోవడంతో పశువులకు మేత దొరకడం లేదు. పలు దేశాల నుంచి వచ్చే వలస పక్షులకు ఆటపాకలోని 310 ఎకరాల్లో ఏర్పాటుచేసిన పక్షుల కేంద్రంలో తప్ప ఎక్కడా నీరు దొరికే పరస్దితి కనిపించడం లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పక్షులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోతున్నాయి.

ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ నిర్మించాలి..

గతంలో కొల్లేరులో సరస్సు ఎగువ భాగాన పంటలు పుష్కలంగా పండేవి. ఏ గ్రామంలో చూసినా వ్యవసాయం ఉండడంతో రెండు పంటలకు నీరు అందడంతో ఆ నీటిని కాలువలు, డ్రెయిన్ల ద్వారా కొల్లేరులోనికి వదిలే వారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా చేపలచెరువులే కనిపించడంతో ఉన్న నీటిని కొందరు సైక్లింగ్‌ చేసుకోవడమే తప్ప దిగువ కొల్లేరులోకి నీరు వదిలే పరిస్థితులు లేవు. ఇప్పటికైనా ఉప్పుటేరుపై రెగ్యులేటర్‌ నిర్మించేలా ప్రకృతి ప్రేమికులు, నిపుణులు కోరుకుంటున్నారు.

నీటి నిల్వలు పెంచేందుకు చర్యలు తీసుకుంటాం

కేవీ నాగలింగాచార్యులు, అటవీశాఖ రేంజర్‌, కైకలూరు

కొల్లేరు సరస్సులోకి నీరు వచ్చే సుమారు 60 మేజర్‌, మైనర్‌ డ్రెయిన్లు పూడుకుపోవడంతో నీరు ఎగువ నుంచి సరస్సులోకి చేరడం లేదు. వీటి ఆధునికీకరణ కోసం అటవీశాఖ ద్వారా ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆధునికీకరణ పనులు చేపట్టినీరు నిల్వలు పెంచేందుకు కృషి చేస్తాం.

రెగ్యులేటర్‌ నిర్మించాలి : వెంకటేశ్వరరావు, కొవ్వాడలంక

పేరుకే కొల్లేరు మంచినీటి సరస్సు. పుస్తకాల్లోనూ, రికార్డుల్లో మాత్రమే ఇది వర్తిస్తుంది. తాగేందుకు చుక్క నీరు లేదు. ఎగువ ప్రాంతాల్లోని రైతులు వారి అవసరాలకు అడ్డుకట్లు వేసి దిగువకు నీరు పారుదల జరగకుండా ఆపడంతో డిసెంబరు నెలకే సరస్సు ఎడారిలా మారిపోతుంది. నీరు నిల్వ చేసుకునేందుకు రెగ్యులేటర్‌ నిర్మాణం చేసేలా ప్రభుత్వాలు కృషి చేయాలి. – ఘంటసాల

కొల్లేరులో నీళ్లు తాగేవాళ్లం : పోతురాజు మహేష్‌, కోమటిలంక

వర్షాకాలంలో కొల్లేరులో కొద్దిమేర నీరు ఉన్నప్పటికి అనతి కాలంలోనే ఎండిపోవడంతో తాగేందుకు, పశు వులకు సైతం నీరు, మేత దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతీ ఏడాది ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మా చిన్న తనంలో కొల్లేరులోని నీటినే తాగి జీవించేవాళ్ళం. ప్రస్తుతం కైకలూరు, ఆటపాక ప్రాంతాల నుంచి నీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - May 23 , 2024 | 11:50 PM