కొల్లేరులో రాజకీయ చిచ్చు
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:31 AM
మండవల్లి మండలం చింతపాడు శివారు దెయ్యంపాడులో సోమవారం రాత్రి టీడీపీ నాయ కుడు ముంగర ఏడుకొండలు కారును గుర్తు తెలియని వ్యక్తు లు ధ్వంసం చేశారు. కారు వెనుక అద్దాలను, డోర్లను పగల గొట్టారు.

గ్రామాల్లో వైసీపీ నాయకుల ప్రయత్నాలు
దెయ్యంపాడులో టీడీపీ నాయకుడి కారు ధ్వంసం
గ్రామ కూడలిలో టీడీపీ ఫ్లెక్సీ చించివేత
టీడీపీ వైపు మొగ్గు చూపడమే కారణం : బాధిత నాయకుడు ఏడుకొండలు
కైకలూరు/మండవల్లి మార్చి 5 : ప్రశాంతమైన కొల్లేరు గ్రామాలు రాజకీయ కక్ష సాధింపులకు వేదిక లుగా మారుతున్నాయి. సాధారణంగా కొల్లేరు గ్రామ ప్రజలు కట్టుబాట్లకు ఎక్కువ విలువ ఇస్తారు. ఈ గ్రామాల్లో పెద్దల సమక్షంలో ఎలాంటి వివాదాలైన పరిష్కరిస్తుంటారు. పోలీసులను ఆశ్రయించడం అరుదు. ఇలాంటి గ్రామాల్లో వైసీపీ రాజకీయ చిచ్చు రేపుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక బలవంతంగా కొల్లేరు గ్రామాలను సంపూర్ణ వైఎస్ ఆర్ గ్రామాలుగా ప్రకటించారు. గ్రామస్థులకు ఇష్టం లేక పోయినా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గారు. కొంత మంది తెలుగుదేశంపై ప్రేమతో ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనిని మనస్సులో ఉంచుకుని రాజకీయ కక్షతో దాడులకు తెగబడుతున్నారని అయా గ్రామస్థులు ఆరోపిస్తు న్నారు. ఈ నేపథ్యంలో మండవల్లి మండలం చింతపాడు శివారు దెయ్యంపాడులో సోమవారం రాత్రి టీడీపీ నాయ కుడు ముంగర ఏడుకొండలు కారును గుర్తు తెలియని వ్యక్తు లు ధ్వంసం చేశారు. కారు వెనుక అద్దాలను, డోర్లను పగల గొట్టారు. అలికిడి విని ఏడుకొండలు ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా కారు ధ్వంసమై కన్పించింది. గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీని సైతం చింపివేశారు. దీనిపై ఏడుకొండలు మాట్లాడుతూ.. ‘ ఇది రాజకీయంగా కక్ష సాధించేందుకే చేశారు. మంగళగిరిలో మంగళవారం జరిగే జయహో బీసీ సభకు వెళ్లకుండా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇటీవల కొల్లేరు గ్రామాల్లో జరిగిన టీడీపీ, మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆత్మీయ సమావేశాల సభలకు ఏర్పాట్లు చేయడం ఆయా పార్టీల నేతలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాను. ఈ కారణంగానే నాపై కక్ష సాధించేందుకు నా కారును ధ్వంసం చేశారు. గతంలో కొల్లేరు ఇలాంటి ఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదు. టీడీపీ వైపు నేను మొగ్గు చూపడం వల్లనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు..’ అని పేర్కొన్నారు. ఈ ఘటనను గ్రామపెద్దల దృష్టికి తీసుకువెళ్లి, మండవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర టీడీపీ వడ్డీ సాఽధికారిక కన్వీనర్ బలే ఏసురాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఏడు కొండలుకు ధైర్యం చెప్పారు. గ్రామపెద్దలతో ఆయన మాట్లాడుతూ కొల్లేరు గ్రామ కట్టుబాట్ల మధ్య ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని, కుట్రలు, కుతంత్రాలు చేసి గ్రామాలను రెండు వర్గాలుగా వేరు చేసేందుకు ప్రయత్నాలు చేయడం తగదన్నారు. ఈ ఘటనను టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నా యుడు దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు.