జల దిగ్బంధం
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:18 AM
కొల్లేరును వరద ఉధృతి చుట్టుముట్టేస్తోంది. బుడమేరు, తమ్మిలేరుతో పాటు వివిధ డ్రెయిన్ల ద్వారా ఎగువ నుంచి వరద కొల్లేరుకు చేరడంతో కొల్లేరు నీటిమట్టం పెరుగుతోంది.
కొల్లేరు గ్రామాలను చుట్టేస్తున్న వరద
ముంపులో కొల్లేటి లంక గ్రామాలు
నీట మునిగిన రహదారులు.. రాకపోకలు బంద్
మంచినీళ్ల కోసం లంకవాసుల అవస్థలు
ఉప్పుటేరును పరిశీలించిన ఎమ్మెల్యేలు, పశ్చిమ కలెక్టర్
ప్రజలకు అండగా ఉంటానని ఎమ్మెల్యే కామినేని భరోసా
మండవల్లి/ కైకలూరు/ ఏలూరు రూరల్, సెప్టెంబరు 9 : కొల్లేరును వరద ఉధృతి చుట్టుముట్టేస్తోంది. బుడమేరు, తమ్మిలేరుతో పాటు వివిధ డ్రెయిన్ల ద్వారా ఎగువ నుంచి వరద కొల్లేరుకు చేరడంతో కొల్లేరు నీటిమట్టం పెరుగుతోంది. పెద్దఎడ్లగాడి వద్ద ఆదివారం 3.36 మీటర్ల ఉన్న కొల్లేరు సోమవారం 3.40 మీటర్లకు చేరుకుంది. ఇప్పటికీ కొల్లేటి లంక గ్రామాలు వెళ్లే రహదారులు పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. కొల్లేటిలంక గ్రామా లైన మండవల్లి మండలం పెనుమాకలంక, నందిగామలంక, శ్రీరామ్‌నగర్, ఇంగిలిపాకలంక, నుచ్చుమిల్లి, తక్కెళ్లపాడు వంటి గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పడవల ద్వారా రాకపోకలు సాగించడం తప్ప మరో మార్గం లేదు. మంచినీళ్ల కోసం కొల్లేటివాసులు అవస్థలు పడుతున్నారు. ఇంగిలిపాకలంక, శ్రీరామ్‌నగర్ వరకు ఎన్డీయే నాయకుడు చాపరాల దుర్గాప్రసాద్ ఆర్థిక సాయంతో మంచినీటి ట్యాంకులు ద్వారా మినరల్ వాటర్ సరఫరా చేస్తు న్నారు. పెనుమాకలంకకు మాత్రం మంచినీళ్లు అందడం లేదని, ఉన్న మంచినీటి వసతి ముంపు నీటిలో చిక్కుకుపోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొల్లేరు నీటిమట్టం పెరగడంతో కొల్లేటి ఎగువ గ్రామాలైన ఉనికిలి, మూలపేట, నాగభూషణపురం వరకు ముంపు పరిస్థితి ఏర్పడింది. మండవల్లి సమీపంలో పల్లపు ప్రాంతాల్లోని గృహాలు నీట మునిగాయి. వైఎస్సార్‌కాలనీ పూర్తిగా ముంపు నీటిలో చిక్కుకుంది. చేపల చెరువులకు వెళ్లే రహదారులు పూర్తిగా నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లోని చెరువులు గట్లు ముంపునకు గురై రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. చెరువు గట్లపై చేపలు బయటకు వెళ్లకుండా వలలతో కట్టడి చేస్తున్నారు.
ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన
విపత్తుల సమయంలో ప్రజలు దైర్యంగా ఉండాలని, ముంపు నివారణకు శాయశక్తుల కృషి చేస్తానని, ప్రజలకు అండగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూస్తానని ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. సోమవారం కైకలూరు మండలం పెంచికలమర్రు, పందిరిపల్లిగూడెం, కొల్లేటికోట, శృంగవరప్పాడు, లక్ష్మీపురం, గుమ్మళ్లపాడు, చటాకాయ్ గ్రామాల్లో ముంపును అటవీశాఖ డివిజనల్ ఫారెస్ట్ అధికారి రవిశంకర్‌తో కలిసి పరిశీలించారు. ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు వహించాలని కామి నేని సూచించారు. ఇళ్లు ముంపునకు గురైన బాధితులకు ప్రభుత్వం నుంచి పరిహారాలను అందజేస్తామని, పందిరిపల్లిగూడెంలో మంచినీటి చెరువు ముంపులో కలిసిపోయినందున ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. పశువులకు పశుగ్రాసాన్ని అందించేందుకు కలెక్టర్‌తో మాట్లాడానన్నారు. కొల్లేటికోట పీహెచ్‌సీలో డాక్టర్లు 24 గంటలపాటు అందుబాటులో ఉండాలన్నారు. ప్రతీరోజు గ్రామాల్లోకి అధికారులు వచ్చేందుకు ప్రత్యేక బోట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కూటమి నాయకలు బొమ్మనబోయిన విజయలక్ష్మీ, బలే ఏసురాజు, పూల రామచంద్రరావు, కొల్లి వరప్రసాద్, తోట లక్ష్మీ, పలువురు అధికారులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కామినేనికి తప్పిన ప్రమాదం
సర్కారు కాల్వ వద్ద నుంచి కొల్లేరు లంక గ్రామాలను పరిశీలించేందుకు సోమవారం ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ బొల్లెరో వ్యానులో వెళ్తుండగా రోడ్డుపై గొయ్యిలో పడి పెద్దశబ్ధంతో పక్కకు ఒరిగిపోయింది. అప్రమత్తమైన మిగిలిన నాయకులు, అధికారులు వ్యాను నుంచి ఎమ్మెల్యేతో పాటు ఒక్కొక్కరిని కిందికి దించారు. వ్యాను నడుపుతున్న రాష్ట్ర వడ్డీసాధికారిక సమితీ కన్వీనర్ బలే ఏసురాజు వ్యాను ను కొద్దిసేపటికి రహదారి పైకి తీసుకురాగా అనంతరం ఎమ్మెల్యే పర్యటనను యఽథా విధిగా కొనసాగించారు.
ముంపు బారిన చేపల చెరువులు
కొల్లేరు సరస్సుకు రోజురోజుకు వరద ఉధృతి పెరగడంతో రహదారులు పూర్తిగా జలమయంగా మారాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చేపల చెరువులు ముంపు బారినపడి వరద నీటిలో కలిసిపోతుండడంతో రైతులు లక్షల్లో నష్టాలను చవి చూస్తున్నారు. కొంతమంది వచ్చిందే చాలు అన్నట్లుగా హడావుడిగా చేపలు, రొయ్యలను పట్టుబడులను చేస్తున్నారు. కైకలూరు మండలం ఆలపాడు శివారు సోమేశ్వరం వద్ద ఉప్పుటేరులో ఉన్న రైల్వే బ్రిడ్జి, రోడ్డుబ్రిడ్జి వద్ద గుర్రపుడెక్క, కిక్కిసను కైకలూరు ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు నిరంతరంగా పర్యవేక్షిస్తూ చెత్త తొలగింపు పనులను చేపట్టారు. సోమవారం ఉప్పుటేరు వద్ద ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, రఘురామకృష్ణంరాజులతో పాటు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఉప్పుటేరును పరిశీలించి ముంపు నివారణ చర్యలకు పలు సూచనలు చేశారు.
ముంపులోనే మొండికోడు, గుడివాకలంక
ఏలూరు రూరల్ మండలంలోని మొండికోడు, గుడివాకలంక, కొక్కిరాయిలంక గ్రామాల్లో వరదనీరు రోడ్లపై ప్రవహిస్తూ ఉండడంతో అధికారులు రాకపోకలను నిషేధించారు. సోమవారం వరద ఉధృతి పెరగడంతో ఉదయం లంక గ్రామమైన మాధవరం రోడ్డుపైకి పెద్దఎత్తున వరదనీరు ప్రవహిస్తూ ఉండడంతో ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పటికే మండలంలోని గ్రామాల్లో వరద ప్రవాహానికి వందలాది చేపల చెరువులు నీటమునిగాయి. కోట్ల విలువైన చేపలు కొల్లేరు పాలైయ్యాయి. చెరువుల్లో చేపలను కాపాడుకునేందుకు యజమానులు అవస్థలు పడుతున్నారు.
నిత్యావసర వస్తువులు అందించాలి : కలెక్టర్
ఏలూరు సిటీ : జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులందరికీ నిత్యావసర వస్తువులు అందించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లాలో వరద పరిస్థితి , నిత్యావసర వస్తువులు పంపిణీపై అధికారులతో సోమవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో వరద ప్రభావానికి గురై నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నిర్దేశించిన మేరకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని, కొల్లేరు ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో వరద నీటిలో ఇళ్లు ముంపునకు గురైన కుటుంబాలకు నిత్యావసర సరుకులు , తాగునీరు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అధికార సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలన్నారు. అన్ని గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని డీపీవోను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫీవర్ సర్వే నిర్వహించి , విష జ్వరాలతో బాధపడే వారిని గుర్తించి వారికి మెరుగైన చికిత్స అందించే దిశగా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖాఽధి కారులను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులపై చర్యలు తీసుకోవా లని ఆదేశించారు.
నేడు ఆ మండలాల్లోని కొన్ని పాఠశాలలకు సెలవు
ఏలూరు అర్బన్ : వర్షాలు, వరద ముంపు నేపథ్యంలో జిల్లాలోని కొన్ని మండలాల పరిధిలో పాఠశాలల నిర్వహణకు అనువైన పరిస్థితులు లేనట్టుగా సంబంధిత ఎంఈవోలు నివేదికలు పంపిన దృష్ట్యా సంబంధిత స్కూళ్లకు మంగళవారం స్థానిక సెలవు (లోకల్ హాలీడే)ను ప్రకటిస్తున్నట్టు డీఈవో అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు. మండవల్లి మండలంలో 18 పాఠశాలలు, కైకలూరు 9, పెదపాడు 7, కలిదిండి 5, ముదినేపల్లి 3, భీమడోలు, ఏలూరు మండలాల్లో ఒక్కొక్క పాఠశాల చొప్పున లోకల్ హాలిడే ఇచ్చినట్టు వివరించా రు. ఈ ఏడు మండలాల్లోని మిగతా పాఠశాలలతో పాటు, మిగిలిన మండ లాల్లో అన్ని పాఠశాలలు యథాతథంగా పనిచేస్తాయన్నారు.
మళ్లీ పెరుగుతున్న గోదావరి
కుక్కునూరు : గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. సోమవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద 29.6 అడుగుల నీటిమట్టం నమోదైంది. తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండాయి. శబరి ఉధృతంగా ఉంది. సమ్మక్క బ్యారేజ్, తాళిపేరు ప్రాజెక్టు నుంచి భారీ స్థాయిలో జలాలను కిందకు వదులుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం 43 అడుగులకు గోదావరినీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని తెలంగాణ అధికారులు అంచనా వేస్తున్నారు.
తమ్మిలేరు ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
చింతలపూడి : చింతలపూడి సమీపంలోని తమ్మిలేరు రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వరద నీరు కొనసాగుతోంది. రెండురోజులుగా పడిన వర్షాల వల్ల పరీవాహక ప్రాంతా ల్లోని నీరుకూడా చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 347.49 అడుగుల కు చేరింది. ఎగువ నుంచి ఇన్‌ప్లో 3,350 క్యూసె క్కుల నీరు వస్తోంది. దిగువకు 4,773 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్టు ప్రాజెక్టు ఏఈ పరమానందం తెలిపారు.