ఊరంతా కిడ్నీ బాధితులే!
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:05 AM
బుట్టాయగూడెం– పోలవరం మండలాల సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఉన్న రామనర్సాపురం కొండరెడ్డి గ్రామం కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఒకరు, ఇద్దరు కాదు గ్రామంలో అధిక సంఖ్యలో కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు.

రామనర్సాపురాన్ని వేధిస్తున్న కిడ్నీ సమస్య
గ్రామ జనాభా 250.. బాధితులు 30 మందికి పైగా..
మెరుగైన వైద్యం అందని కొండరెడ్లు
ఇటీవల కలెక్టర్ పర్యటనతో బహిర్గతం
చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు
బుట్టాయగూడెం, జూలై 7 : బుట్టాయగూడెం– పోలవరం మండలాల సరిహద్దు ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఉన్న రామనర్సాపురం కొండరెడ్డి గ్రామం కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. ఒకరు, ఇద్దరు కాదు గ్రామంలో అధిక సంఖ్యలో కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారు. దశాబ్దాల కాలంగా ఈ సమస్య ఉన్నా స్థానిక వైద్యులు ఇప్పటివరకు ఫలానా సమస్య అని గుర్తించలేదు.. సరికదా తరుచూ ఆనా రోగ్యాలు బారిన ఎందుకు పడుతున్నారో చెప్పలేదు. తరుచూ అనారోగ్యం బారిన పడుతూ ఎక్కువ కాలం మంచానికి పరిమితమవుతున్నారు. ఈ బాధపడలేక కొందరు రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్ళి వైద్యపరీక్షలు చేయించుకోగా అసలు వ్యాధి ఏమిటో బయటపడింది. మెరుగైన వైద్యం పొందాలంటే ఆర్థిక స్థోమతలేని కొండరెడ్లు ప్రాణాలను బిగపట్టుకుని రోజులు లెక్కిస్తూ కాలం వెళ్ళదీస్తున్నారు. కూలీ చేస్తేకాని పూట గడవని వారు మెరుగైన వైద్యం పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో ఐదు రోజులు క్రితం కలెక్టర్ కె.వెట్రి సెల్వి గ్రామంలో పర్యటించ డంతో కిడ్నీ సమస్య బహిర్గతమైంది.
బురద నీరే తాగునీరు
గ్రామంలో 75 గృహాలు ఉండగా సుమారు 250 మంది జనాభా ఉన్నారు. కిడ్నిలో రాళ్లు ఏర్పడడంతో బాధ భరించలేక గ్రామానికి చెందిన వేట్ల ఆశోక్‌రెడ్డి 23–10–2013లో వేట్ల శాంతకుమారి 25–8–2018లో, వేట్ల చిన లచ్చిరెడ్డి 7–8–2023లో రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేయించుకున్నారు. వీరంతా సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు అప్పు చేసి ఆపరేషన్లు చేయించుకున్నారు. వీరే కాక కిడ్నీలో రాళ్ళ సమస్యతో 30 మందికి పైగానే గ్రామంలో ఉన్నారని బాధితులు తెలిపారు. ఆపరేషన్‌కు రూ.40 వేల వరకు ఖర్చు అవుతుందని ప్రైవేటు వైద్యులు చెప్ప డంతో ఆర్థిక స్థోమత లేక వైద్యులు సూచనలను పాటిస్తూ రోజులు గడుపుతున్నారు. రాళ్లు కరిగిపోడానికి స్థానికంగా అందుబాటులో ఉండే వైదాన్ని ఆశ్రయిస్తున్నారు. మెరుగైన వైద్యం పొందేందుకు అధికారులు, దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సరైన వైద్యం అందక మరణిం చిన వారు కూడా ఉన్నారని గ్రామస్థులు తెలిపారు. గ్రామం లోని మోటారు బోరు నుంచి వచ్చే నీరు బురదగా ఉంటుం దని, ఆ నీటిని తాగడం వల్లే కిడ్నిలో రాళ్ళు వస్తున్నట్లు వైద్యులు చెప్పినట్టు కిడ్నీ బాఽధితులు తెలిపారు. రామనర్సాపురం గతంలో దట్టమైన అటవీ ప్రాంతంలోని గుమ్ములూరులో ఉండేది. అక్కడ వైద్యసేవలు పూర్తిగా అందేవి కావు. రోగాల బారిన పడితే మరణమే శరణ్యంగా ఉండేది. ఆ సమయంలో అన్నింటికి అందుబాటులో ఉండే రామనర్సాపురంలో న్యూడెమోక్రసీ దళ కమాండర్ ధర్మన్న కొండరెడ్లతో పోడు కొట్టించి 1985లో గుడిసె లు వేయించి కొత్త ఊరును ఏర్పాటు చేశారు. ప్రభు త్వం కాలనీ మంజూరు చేసి ఇళ్లు నిర్మించింది. ప్రభు త్వ బడి, అంగనవాడీ కేంద్రం, కమ్యూనిటీ హాలు, మోటార్ బోరు, మంచినీటి ట్యాంకు, విద్యుత్ సదు పాయం ఏర్పాటు చేసింది. ఈ సంవత్సరమే గ్రామం లో కొత్తగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
కలెక్టర్ ఎదుట గోడు ..
ఇటీవల కలెక్టర్ కె.వెట్రి సెల్వి ఏజెన్సీ పర్యటనలో భాగంగా రామనర్సాపురం వెళ్ళారు. గ్రామం మొత్తం ముక్తకంఠంతో కిడ్నీ సమస్యను ఆమెకు వివరించారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే గ్రామంలోని మంచినీటిని నిర్ధారణ పరీక్షలు చేయాలని, సుద్ద శాతాన్ని గుర్తించాలని అవసరం అనుకుంటే మరోచోట మంచినీటి బోరును ఏర్పా టు చేయాలని ఐటీడీఏ పీవో ఎం.సూ ర్యతేజను ఆదేశించారు. వైద్యశిబిరం శిబిరాన్ని ఏర్పా టు చేసి వైద్యసేవలు అందించాల న్నారు. అవసరమనుకుంటే ఐటీడీఏ ద్వారా మెరుగైన వైద్యం అందించ డానికి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఆమె ఆదేశాల మేరకు బోరు నుంచి నీటి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.
మెరుగైన వైద్యసేవలు అందించండి..
రామనర్సాపురంలో కిడ్నీ సమస్య ఇప్పటిది కాదు. కిడ్నీలో రాళ్ళతో బాధపడేవారి సంఖ్య గ్రామంలో 30 మందికి పైగా ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళుతున్నా రోగం ఏమిటో నిర్ధా రణ చేయడం లేదు. దీంతో కొండరెడ్లు అనారోగ్యాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్ళి వైద్యపరీక్షలు చేయిస్తే తప్పా రోగం ఏమిటో తెలియడం లేదు. ఊరు ఊరంతా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ఐటీడీఏ అధికారులు స్పందించి కొండరెడ్లకు మెరు గైన వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడాలి.
– పోరండ్ల శ్రీనివాస్, న్యూడెమోక్రసీ నాయకుడు
కిడ్నీ సమస్యతో గిరిజనుడి మృతి
జీలుగుమిల్లి, జూలై 7 : అంకన్నగూడెం శివారు జగన్నా థపురం గ్రామానికి చెందిన గిరిజనుడు సోడెం కన్నపరాజు (22) అనారోగ్యం తో ఆదివారం మృతి చెందాడు. అతను కొద్ది రోజులుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లా చింతూరు బంధువుల ఇంటికి వెళ్లగా పరిస్థితి విషమించింది. తిరిగి గ్రామానికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు.