ఆ విషాదానికి ఐదేళ్లు!
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:47 AM
పాపికొండలు విహార యాత్రలో 49 మంది పర్యాట కులు గోదావరిలో జల సమాధి అయి సరిగ్గా ఐదేళ్లు గడిచాయి. 2019 సెప్టెంబరు 15వ తేదీన 77 మందితో వెళ్తున్న పర్యాటక బోటు కాస్తా గోదావరిలో సుడిగుండం లో చిక్కుకుంది. అప్పట్లో 26 మందిని స్థానిక జాలర్లు కాపాడినా 49 మంది ప్రాణాలు కోల్పోయారు.
49 మందిని బలి తీసుకున్న కచ్చులూరు బోటు ప్రమాదం
ఐదేళ్ల క్రితం గోదావరిలో పెను విషాదం
కనీవినీ ఎరుగని రీతిలో 38 రోజుల ఆపరేషన్..
అతి కష్టంగా గోదావరి గర్భం నుంచి బోటు వెలికితీత
అప్పటికీ ఇప్పటికీ ఇదొక పెను విషాదమే
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
పాపికొండలు విహార యాత్రలో 49 మంది పర్యాట కులు గోదావరిలో జల సమాధి అయి సరిగ్గా ఐదేళ్లు గడిచాయి. 2019 సెప్టెంబరు 15వ తేదీన 77 మందితో వెళ్తున్న పర్యాటక బోటు కాస్తా గోదావరిలో సుడిగుండం లో చిక్కుకుంది. అప్పట్లో 26 మందిని స్థానిక జాలర్లు కాపాడినా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన ఈ ఘోర దుర్ఘటన ఇప్పటికీ గోదావరి ప్రజలకు కళ్లెదుట సాక్షాత్కరిస్తూనే ఉంది. ఆనాటి ఘోర సంఘటనను తలచుకుంటేనే కంట కన్నీరొలుకుతుంది.
పాపికొండలు విహార యాత్రలో ఎన్నడూలేని విధంగా ఐదేళ్ల క్రితం విషాద సంఘటనే చోటుచేసుకుంది. అయినవారిని కోల్పోయినా అనేకమంది నది ఒడ్డునే రోజులతరబడి అన్వేషించారు. అయిన వారు కానరాక, తిండీతిప్పలు లేక రోదనలతో తిరుగాడినవారెందరో. చిన్నారులను కోల్పోయిన కొందరు, భార్యల కడసారి చూపుకైనా నోచుకోవాలని ఇంకొందరు, కనిపించకుండా పోయిన తల్లిదండ్రుల కోసం రెప్పలమాటున కన్నీరువుకుతుండగా విషణ్ణ వదనాలతో వేచి చూసినవారు ఇంకొందరు. పాపికొండలు విహార యాత్ర అంటే ఉమ్మడి ఆంధ్రలో జనం అమితాసక్తి చూపేవారు. రెండు, మూడు రోజులు ముందే గోదావరిలో బోటు ప్రయాణం కోసం తహతహలాడేవారు. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఉత్కంఠతో గడిపేవారు. ప్రకృతి అందాలకు నెలవైన పాపికొండలు విహార యాత్ర తమ జీవితానికి గొప్ప అదృష్టమంటూ మురిసిపోయిన వారు ఎందరో. దూరభారమైనా పిల్లాపాపలతో ఒక రోజు అయినా గోదావరి నదిలో గడిపామన్న తృప్తి మిగుల్చుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చేవారు. ఈ క్రమంలోనే 2019 సెప్టెంబరు 15న గోదావరి ఒడ్డున గండిపోచమ్మ దేవాలయం వద్ద వశిష్ఠ పున్నమి రాయల్ పర్యాటక బోటులోకి అప్పటికే నిర్దేశించిన పర్యాటక ప్రియులంతా తమవారితో కలిసి ఎక్కారు. గండిపోచమ్మ దేవాలయం నుంచి దాదాపు మూడున్నర గంటలపాటు ప్రయాణిస్తూ బోటు ముందుకు సాగుతుండగా అప్పటికే ఆటపాటలతో జనం బోటుపైనే సందడి చేశారు. గోదావరికి అటుఇటు కనిపిస్తున్న పచ్చని వాతావరణం, జోరుగా సాగుతున్న నదీ ప్రవాహాన్ని చూసి కేరింతలు కొట్టారు. మరో నాలుగు గంటల్లో పాపికొండలుకు బోటు చేరుకోవాల్సి ఉండగా అసలు విషాదం ఆ సమయంలోనే జరిగింది. దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం సమీపాన గోదావరి అతి వేగంగా ప్రయాణిస్తూ ఓ సుడిగుండంలా అప్పటికే ఏర్పడి ఉంది. 77 మంది పర్యాటకులతో గోదావరిలో ప్రయాణిస్తున్న వశిష్ఠ బోటు కాస్తా ప్రవాహానికి ఎడమవైపున వెళ్ళాల్సి ఉండగా కుడి వైపున ప్రయాణించి సుడిగుండంలో చిక్కుకుంది. ఒక్కసారిగా హాహాకారాలతో పర్యాటకులంతా కేకలు వేసినా ఫలితం లేకుండాపోయింది. అప్పటికే గోదావరిలో ఐదు లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు ప్రవహిస్తోంది. ఒకవైపు వరద ఉధృతి, ఇంకోవైపు కచ్చులూరు సమీపాన ఉన్న ఎస్ టైపు ప్రవాహంలోనే బోటు ప్రయాణించాల్సి రావడంతో క్షణాల్లోనే సుడిగుండంలో ఒరిగిపోయింది. అప్పటికే సమీపాన మత్స్యకారులు జరిగిన ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమయ్యారు. క్షణాల్లోనే వేగంగా అక్కడికి చేరుకుని 26 మందిని రక్షించి ఒడ్డుకు తీసుకువెళ్ళగలిగారు. అప్పటికే పర్యాటక బోటులో ఉన్న 49 మందితో బోటు కాస్తా గోదా వరిలో మునిగిపోయింది. స్థానిక మత్స్యకారులే జరిగిన ఘోరాన్ని అధికారులకు చేరవేయడం, రాష్ట్రమంతటా ఈ ఘటన పెను విషాదాన్ని సృష్టించింది. మునిగిపోయిన పర్యాటక బోటు, మిగతా పర్యాటకుల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, నేవీ, అగ్నిమాపక దళాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. నేవీ హెలికాప్టర్ల ద్వారా నడి ఒడ్డున రోజుల తరబడి గాలింపు చేశారు. అక్కడక్కడ ముళ్ళచెట్లకు చిక్కుకుని ఉన్న మృతదేహాలను దేవీపట్నంకు చేర్చగలిగారు. ఇదే సందర్భంలో అప్పట్లోనే కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. వరద ఉధృతిలో నీట మునిగిన బోటును వెలికితీయడంలో ధర్మాడి బృందం మేలైన నైపుణ్యం చూపేది. అయినా గోదావరిలో వరద ప్రవాహం ఉధృతంగా ఉండడం, ప్రమాదం జరిగిన స్థలి అత్యంత కటువుగా ఉండడం, 38 రోజులపాటు శ్రమించి అప్పట్లో అక్టోబరు 21వ తేదీన బోటును వెలికితీయగలిగారు. బోటులో మరికొన్ని మృతదేహాలు పూర్తిగా శల్యమై కనిపించాయి. మరోవైపు ఇప్పటికీ ప్రమాదంలో మృతుల సంఖ్యపై భిన్న వాదనలు విన్పిస్తున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో ఉన్నవారి సంఖ్యపై సరైన సమాచారం లేదు. ఈ ఘోర దుర్ఘటన అప్పటికీ ఇప్పటికీ పాపికొండలు పర్యాటక ప్రియులను కలచివేస్తూనే ఉంది. కచ్చులూరు దుర్ఘటన అనంతరం కొన్నాళ్లపాటు పాపికొండలు యాత్రను ప్రభుత్వం అప్పట్లో నిలిపివేసింది. బోటులో ప్రయాణించే వారి రక్షణ చర్యలు పూర్తిగా గమనించిన తర్వాత ప్రయాణించే బోటు సామర్థ్యాన్ని ముందుగా నిర్ధారణ చేసిన తర్వాతే పాపికొండలు యాత్రకు అనుమతిస్తూ వస్తున్నారు.