ఆ 2 కిలోమీటర్లు తప్ప
ABN , Publish Date - Jun 07 , 2024 | 12:20 AM
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసే గ్రీన్‌ఫీల్డ్ హైవే రహదారి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ రహదారి ప్రారంభ దశలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికి తర్వాత పనుల్లో వేగం పెరిగింది.

కొనసాగుతున్న గీన్‌ఫీల్డ్ హైవే పనులు
తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కలిసే గ్రీన్‌ఫీల్డ్ హైవే రహదారి పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ రహదారి ప్రారంభ దశలో కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికి తర్వాత పనుల్లో వేగం పెరిగింది. రైతులు తమకు నష్టపరిహారం సరిపోవడం లేదంటూ మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలంటూ చింతలపూడి, కొయ్యలగూడెం మండలాల్లో అనేక ఉద్యమాలు చేపట్టారు. పనులను అడ్డుకున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం రూ.20 లక్షలు మాత్రమే నష్టపరిహారం ఇచ్చి పనులు మొదలు పెట్టేసింది. కొంత మంది తమ పొలాలను కన్వర్షన్ చేయించామని దానికి అనుగుణంగా నష్టపరిహారం ఇవ్వాలంటూ హై కోర్టుకు వెళ్లారు. ఆ భూముల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల పనులు శర వేగంగానే సాగుతున్నాయి. ఈ రహదారి వల్ల విశాఖపట్నం–హైదరాబాద్‌కు సుమారు 60 కిలోమీటర్ల దూరం తగ్గనుంది.
కొయ్యలగూడెం/చింతలపూడి జూన్ 1: గ్రీన్‌ఫీల్డ్ హైవే రహదారి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల నిర్మాణ శాఖ ద్వారా రూ.4,609 కోట్లతో అంచనాలు రూపొందించగా, ఐదు ప్యాకేజీలుగా విభజించి మూడు కంపెనీలు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణం కోసం 1,411 ఎకరాల భూమి అవసరం కాగా ప్రభుత్వ భూమి 114 ఎకరాలు, రైతుల నుంచి 1,297 ఎకరాలు సేకరించారు. 2024 చివరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు గురుపట్లగూడెం నుంచి ఏలూరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది. తెలంగాణ రాష్ట్రం చిత్తగూడెం నుంచి ఏలూరు జిల్లాలోని చింతలపూడి మండలం రేచర్ల వరకు కేఎంయూ కంపెనీ 44 కిలోమీటర్ల పనులను చేపట్టగా, రేచర్ల నుంచి తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి వరకు 56.89 కిలోమీటర్ల పనులను బెక్కం కంపెనీ దక్కించుకుంది. రూ.1,555 కోట్లతో ప్రారంభించిన ఈ పనులు ఇప్పటి వరకు 60 శాతం పూర్తయినట్టు అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీ చెబుతోంది. రేచర్ల, దేవరపల్లి మధ్య రేచర్ల, గుర్వాయిగూడెం, పొంగుటూరు, దేవరపల్లిలో జంక్షన్లు ఉన్నాయి.
కోర్టు పెండింగ్‌లో ..
ఈ రహదారి నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నప్పటికీ రెండు కిలోమీటర్ల మేర కోర్టు పెండింగ్‌లో ఉండడంతో ఆ ప్రాంతంలో పనులు జరగడం లేదు. కొయ్యలగూడెం మండలం యర్రంపేట, రాజవరం, కన్నాయిగూడెం గ్రామాల్లోని రైతులు తమ పొలాలకు కన్వర్షన్ చేయించామని, ఎకరాకు రూ.30 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టుకు వెళ్లారు. ఈ మేరకు ఆ రెండు కిలోమీటర్లు మినహా మిగిలిన మొత్తం పనులు జరుగుతున్నాయి. దీని వలన 2024 సెప్టెంబరు నాటికి పూర్తికావాల్సిన పనులు ఇంకా కొన్ని నెలలు సమయం పట్టే అవకాశం ఉంది.
పరిహారం తక్కువ ఇచ్చారని రైతుల ఆందోళనలు
రోడ్డు నిర్మాణం కోసం జరిగిన భూసేకరణలో చింతల పూడి మండలంలోని రైతులు పలుమార్లు తమ విలువైన భూములు ఇచ్చినప్పటికీ పరిహారం తక్కువ ఇచ్చారని, తెలంగాణ ప్రాంతానికి ఎక్కువ ఇచ్చారని తమకు న్యాయం చేయాలంటూ నిరసనలు, పనులు అడ్డుకునే ప్రయత్నాలు జరిగాయి. ఈ మేరకు రోడ్డు పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఎట్టకేలకు కలెక్టర్ చొరవతో పరిహారం పెంచి ఇవ్వడంతో చాలావరకు రైతుల శాంతించారు. పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్లు వేయాలని, నిర్మాణం కోసం తిరుగుతున్న భారీ వాహనాల వల్ల ప్రస్తుతం ఉన్న రోడ్లు పాడై అధ్వానంగా మారుతున్నాయంటూ ప్రజల్లో ఆందోళన ఉంది. ఎండపల్లి వద్ద చెరువులో తీసిన గోతులు ఇంకా పూడ్చలేదని, గ్రామానికి చెందిన రైతు మోరంపూడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ చెరువులో సింగిల్ కానా వంతెన నిర్మాణం వల్ల వరద నీరు పోటెత్తుతుందని ఆందోళన చేయడంతో రెండు కానాల వంతెన నిర్మాణం చేపట్టారు.
చింతలపూడిలో భూసేకరణ
గ్రీన్‌ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణం కోసం చింతలపూడి మండలంలో అనేక గ్రామాల్లో భూసేకరణ జరిగింది. గురుపట్లగూడెం, లింగగూడెం, యండపల్లి, రాఘవా పురం, చింతకాయల కొత్తగూడెం, గణిజర్ల, వెంకటాద్రి గూడెం, వెంకటాపురం, నామవరం నుంచి శెట్టివారి గూడెం, రేచర్ల వరకు రోడ్డు నిర్మాణాలు పనులు జరుగుతున్నాయి. ఈ మార్గంలో పలు కల్వర్టులు, వంతెనలు, అండర్ పాస్ రోడ్లు 49 వరకు ఉన్నాయి. దీనిలో బాక్స్ కల్వర్టులు 29, చిన్నవాహనాలు అండర్ పాస్‌లు ఆరు, పెద్ద వాహనాల అండర్‌పాస్‌లు రెండు, ప్రజా రహదారులు ఐదు, మేజర్ బ్రిడ్జిలు నాలుగు, లైట్‌వెయిట్ అండర్ పాస్‌లు రెండు ఉన్నాయి. చింతకాయల కొత్తగూడెం వద్ద వాహనాల రెస్ట్ ప్లేస్ నిర్మాణం జరగాల్సి ఉంది. రేచర్ల వద్ద ఎంటర్ ఛేంజ్‌పాయింట్ ఏర్పాటు చేస్తారు. దీంతో ఏలూరు–హైదరాబాద్‌కి కూడా దూరం తగ్గుతుంది.
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కార్లు గంటకు 120 మీటర్లు, భారీ వాహనాలు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు వీలుగా
రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి.