Share News

చిన్న సమస్యలు పట్టించుకోకపోతే ఎలా

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:44 AM

‘మూడేళ్లుగా అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఒక్కపని ముందుకు వెళ్లడం లేదు. దీనిపై ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు.

చిన్న సమస్యలు పట్టించుకోకపోతే ఎలా
సమావేశంలో మాట్లాడుతున్న కౌన్సిలర్లు

జంగారెడ్డిగూడెం కౌన్సిల్‌ సమావేశంలో పలువురు కౌన్సిలర్ల ఆవేదన

జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 6 : ‘మూడేళ్లుగా అదిగో ఇదిగో అంటున్నారే తప్ప ఒక్కపని ముందుకు వెళ్లడం లేదు. దీనిపై ప్రజలు మమ్మల్ని నిలదీస్తున్నారు. వారడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మూడేళ్లుగా నా వార్డులో ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. కొన్ని వార్డుల్లో మాత్రం పనులు పరుగులు పెడుతున్నాయి. ఈ తేడా ఏమిటో అర్థం కావడం లేదు. ప్రజలు రద్దీగా తిరిగే రహదారిని తవ్వి నెలలు కావస్తున్నా నేటికీ పనులు జరగడం లేదు. వీటిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు’

అంటూ 21వ వార్డు కౌన్సిలర్‌ కంచర్ల గీతాకుమారి ఆవే దన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్‌ కార్యాల యంలో చైర్‌పర్సన్‌ బత్తిన లక్ష్మి అధ్యక్షతన మంగళవారం కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గీతాకుమారి తన వార్డులో సమస్యను ప్రస్తావించారు. ‘జేపీ సెంటర్‌ నుంచి త్రివేణి కాలేజ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా వున్న రోడ్డును తవ్వి నెలలు గడుస్తున్నా.. దీనిని నిర్మించేందుకు కాంట్రాక్టర్‌ ముందుకు రాకపోవడంతో దీనిని అలానే వదిలే శారు. రమాదేవి హాస్పటల్‌ రోడ్డులోనూ ఇదే పరిస్థితి. అక్కడి ప్రజలు ఇబ్బందులు పట్టించుకోరా ? ఒక ఐరన్‌ కరెంట్‌ స్తంభానికి విద్యుత్‌ సరఫరా అయ్యి ప్రాణాపాయ పరిస్థితులు నెలకొన్నాయని అధికారులకు చెప్పినా ఇప్పటి వరకు పట్టించుకోలేదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఎవరైనా చనిపోవాలేమో ?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశా రు. ‘ఆర్యవైశ్య కల్యాణ మండపం సమీపంలోని స్కూల్‌ డ్రైన్‌ను నిర్మించాలని ఏడాదిగా కోరుతున్నా పట్టించుకోలేదు’ అంటూ సమస్యలను ఏకరవు పెట్టారు. వీటిపై అధికారులు, చైర్‌పర్సన్‌ చూద్దాంలే అని ఒక్క మాటలో తేల్చేసినట్టు వ్యవహరించారు. తన పట్ల వివక్షను మాని తల్లి స్థానంలో ఉన్న చైర్‌పర్సన్‌ అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేయాలని జనసేన కౌన్సిలర్‌ వలవల తాతాజీ కోరారు. తన వార్డులో సమస్యలపై ఎన్నోసార్లు అధికారులకు తెలిపినా పరిష్కారం కాలేదన్నారు. వార్డుల్లో ఏ కార్యక్రమం చేసినా సదరు కౌన్సిల ర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమస్యలపై స్పందనలో పిర్యాదు చేయగలం కానీ అలా చేయకుండా మీ పట్ల గౌరవంతో ఉన్నామన్నారు. దీనికి చైర్‌పర్సన్‌ బత్తిన లక్ష్మి మాట్లాడుతూ సమస్యలపై స్పందనలో ఫిర్యాదు చేసుకుంటే చేసుకోవచ్చునన్నారు.

ఈ సమస్యల మాటేంటి ?

జంగారెడ్డిగూడెంలో మూడు రోజులకు ఒకసారి చెత్తను సేకరించడం వల్ల.. వార్డులన్నీ మురికి కూపాలుగా మారాయి. ఈ సమస్యను పరిష్కరించాలని కౌన్సిలర్‌ తాతాజీ కోరారు.

కాలేజీ రోడ్డులో కల్వర్టు కుంగిపోయింది. దీనివల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నూతన కల్వర్టు నిర్మించాలని కౌన్సిలర్‌ నేట్రు సుబ్బలక్ష్మి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.

సాలిపేట రోడ్డు పనులు జరగకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పనులను వెంటనే చేపట్టేలా చూడాలని కౌన్సిలర్‌లు లోకారపు వెంకటేశ్వరరావు, దొంతు మాధవ్‌ కౌన్సిల్‌లో అధికారులను కోరారు.

ఎంతో కాలంగా తన వార్డులో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అలాగే ఏ అభివృద్ధి పని జరగడం లేదు. లక్షలు మంజూరయ్యాయని చెప్పడమే తప్ప కాంట్రాక్టర్లు రారు, పనులు చేయరని ఒకటో వార్డు కౌన్సిలర్‌ వెంకటరమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

పట్టణంలోని పలు వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు పెట్టిన అజెండా ప్రతిపాదనలను కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. వైస్‌ చైర్‌ పర్సన్‌ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్‌లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 12:44 AM