పాత పాటే .. అదే క్షోభ
ABN , Publish Date - May 12 , 2024 | 12:51 AM
ఎప్పటి మాదిరిగానే ఈ ఐదేళ్లలో తాను చేసిన పథకాలను ఏకరువు పెట్టారు. లేకలేనన్ని సార్లు బటన్ నొక్కానంటూ గొప్పలు చెప్పుకున్నారు. తాను అమలు చేసిన పథకాలు ఎవరైనా చేస్తారా అంటూ ప్రజల నుంచి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు.

మండుటెండలో మాడిన జనం
కైకలూరులో సీఎం సభ.. మళ్లీ తానొస్తేనే పథకాలంటూ ఓటర్లకు ఎర
చంద్రబాబుపైన, కూటమి మేనిఫెస్టోపైనా నిందలు
ఏలూరు/కైకలూరు, మే 11(ఆంధ్రజ్యోతి) : ఎప్పటి మాదిరిగానే ఈ ఐదేళ్లలో తాను చేసిన పథకాలను ఏకరువు పెట్టారు. లేకలేనన్ని సార్లు బటన్ నొక్కానంటూ గొప్పలు చెప్పుకున్నారు. తాను అమలు చేసిన పథకాలు ఎవరైనా చేస్తారా అంటూ ప్రజల నుంచి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగవద్దంటూ మరీమరీ అభ్యర్థించారు.. ఒక వైపు మండుటెండలో ఎండ మలమల మాడు తుండగా సీఎం జగన్ కైకలూరులో శనివారం జరిపిన ఎన్నికల ప్రచారసభలో అత్యధిక సమ యం పరనిందలకే కేటాయించారు. తన మేని ఫెస్టో అత్యద్భుతమని చెబుతూనే చంద్రబాబు సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ అంటూ వస్తున్నా డని, ఈ ప్రలోభాలకు లొంగవద్దని అభ్యర్థించారు. చంద్రబాబుకు ఓటేస్తే పథ కాలన్నీ ముగింపే నన్నట్టు శాప నార్థాలు పెట్టారు. సాధ్యం కాని హామీలతో ప్రతి పక్షాలు మేనిఫెస్టో తెచ్చిందని, చంద్రబాబును నమ్మవద్దంటూ పదేపదే చెప్పినా జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. అక్క చెల్లెమ్మల ఖాతాల్లో ఈ 59 నెలల కాలంలోనే అనేకసార్లు బటన్ నొక్కి డిపాజిట్ చేశానని.. బటన్ ఇన్నిసార్లు నొక్కడం ఎక్కడైనా జరిగిందా.. అంటూ అదో గొప్పపనిగా అభివర్ణించే ప్రయత్నం చేశారు. గతంలో ఇస్తామన్న రుణమాఫీ, మహాలక్ష్మీ పథకం ఏమయ్యాయని ఇప్పుడేమో ప్రతి ఇంటికి బెంజికారు, కేజీ బంగారం ఇస్తానని చెబితే ఎవరైనా నమ్ముతారా అంటూ ప్రజల నుంచి ఆయన స్పందన ఆశించినా జనం స్పందించలేదు.
ఆకట్టుకోని ప్రసంగం
కైకలూరు ప్రచార సభకు సీఎం జగన్ రాక ఆసల్యం అయింది. అప్పటికే సభకు తరలివచ్చిన కార్యకర్తలు మండుటెండను తట్టుకోలేక పక్క చూపులు చూశారు. కొందరైతే పక్కనే వున్న భవ నాల్లోకి చేరారు. కొందరు చెట్ల నీడను ఆశ్రయిం చారు. గ్రామాల నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలకు కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై కొందరు ఆగ్ర హించారు. ఎండ మండిపోతోంది పట్టించుకోరా.. అంటూ మహిళలు విసుక్కోవడం విన్పించింది. సీఎం వచ్చి ప్రసంగం ప్రారంభించిన వెంటనే జనం సభా ప్రాంగణం నుంచి వెనక్కి వెళ్లడం కన్పించింది. కొల్లేరు సమస్య ప్రస్తావిస్తూ... సర్వేకు ఎప్పుడో కమిటీని నియమించాం, సర్వే పూర్తికా వచ్చింది, నివేదిక అందింది. మిగలు భూమలు గుర్తించి పేదలకు పంచాల్సి ఉంది. ఇదంతా నేను తిరిగి అధికారంలోకి వస్తేనే అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం అందరిని బిత్తరపోయేలా చేసింది. ఇన్నాళ్లు అధికారంలో ఉండి, చేసిందీ ఏమీ లేక ఆఖరి క్షణంలో కొల్లేరు సమస్యకు తానొస్తేనే పరిష్కార మన్నట్టు బేలతనం ప్రదర్శించడం పైనా కొందరు విస్తుపోయారు. అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం జగన్‌కు అండగా ఉండాలని ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్ధి కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్ అన్నారు. కైకలూరు ఎమ్మెల్యే, అభ్యర్ధి దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీలో కూటమి నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
పది మందికి వడదెబ్బ
సీఎం జగన్ సమావేశానికి వచ్చిన ప్రజలతో పది మంది వడదెబ్బకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు. ఎండ వేడికి తట్టుకోలేక గాలి తామర కొల్లు గ్రామానికి చెందిన భట్రాజు పార్వతి, కైకలూరుకు చెందిన రఫీయాబేగం, వైవాకకు చెందిన బందెల కోటేశ్వరమ్మ, ఒక మహిళా కానిస్టేబుల్, మరో ఆరుగురు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు. వీరిలో ఒకరిని 108లో చికిత్స అందించారు. వీరంతా సాయంత్రం వరకు చికిత్స పొందారు.