Share News

24 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ABN , Publish Date - May 20 , 2024 | 11:59 PM

ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య అధికారులను ఆదేశించారు.

24 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు
అధికారులతో సమీక్షిస్తున్న జేసీ

జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలు..10,946 మంది విద్యార్థులు

పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి : జేసీ ప్రవీణ్‌ ఆదిత్య

భీమవరం ఎడ్యుకేషన్‌, మే 20 : ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ ఆదిత్య అధికారులను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కమిటీ సభ్యులు, విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్‌, వైద్యఆరోగ్యశాఖ, మున్సిపల్‌, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ మే 24 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో 25 పరీక్షా కేంద్రాల ఏర్పాటు చేశామని, మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన మొత్తం 10,946 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. మొదటి సంవత్సరం జనరల్‌ కింద 8,793 మంది, ఒకేషనల్‌ 384 మంది, మొత్తం 9,177 మంది రాయనున్నారన్నారు. రెండో సంవత్సరం జనరల్‌ 1,547 మంది, ఒకేషనల్‌ 222 మంది మొత్తం 1,769 మంది హాజరుకానున్నట్లు తెలిపారు. జూన్‌ 6న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌, 7న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జరుగుతాయని ఈ రెండూ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందని తెలిపారు.పరీక్షకు గంట ముందు హాజరు కావాలన్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. నిరంతరాయంగా విద్యుత్‌ సప్లై ఉండేలా చూసుకోవాలన్నారు. దివ్యాంగులు ఉంటే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చెయ్యాలన్నారు. మొబైల్‌ఫోన్లు, కాలిక్యూలేటర్లు, ఐపాడ్‌, బ్లూటూత్‌, పేజర్‌, లేదా ఇంట్రాక్ట్‌ ప్రోగ్రామింగ్‌ చేయగల ఇతర ఎలకా్ట్రనిక్‌ పరికరాలను పరీక్ష కేంద్రానికి అనుమతి లేదని సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి దుష్ట్యా పరీక్షా కేంద్రాల్లో రక్షిత మంచినీటి సరఫరా, పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉంచాలని ఆదేశించారు. పరీక్షలు జరిగే తేదీలలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేసి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష సమయాలకు అనువుగా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. పరీక్షలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కేజీఆర్‌ఎల్‌ కాలేజీలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నంబరు: 90595 83683 (జయరామ్‌) ఏర్పాటు చేశామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, ఇంటర్మీడియట్‌ ఆర్‌ఐవో, జిల్లా పరీక్షల కమిటీ కన్వీనరు కె.చంద్రశేఖర్‌బాబు, జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీశాఖ అధికారి విక్టర్‌ వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

పది సప్లిమెంటరీకి ఏర్పాట్లు : డీఆర్వో

పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఉదయ భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 24వ తేదీ నుంచి జూన్‌ 3వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని జిల్లాలో భీమవరం, ఆకవీడు, తాడేపల్లిగూడెం, తణుకు, పెనుగొండ, పాలకొల్లు, నర్సాపురం, అత్తిలిలలో మొత్తం 41 కేంద్రాలలో 8,953 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. పదో తరగతి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు సంబంధించి 1,590 మందికి భీమవరం, నరసాపురంలలో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.పరీక్షా కేంద్రాల వద్ద అన్ని సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు నిర్వహణ ఇన్‌చార్జి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎన్‌.సత్యనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి అహ్మద్‌ఖాన్‌, ఆర్టీసీ అధికారి గీతావాణి, పోస్టల్‌ అధికారి పరుశురాం, వైద్యశాఖ అధికారి సందాని పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 11:59 PM