ఆస్పత్రి, డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలు పూర్తిచేయాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:32 PM
మండలంలో ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం డిమాండ్ చేశారు.

ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకుల డిమాండ్
బుట్టాయగూడెం, జులై 5: మండలంలో ఆస్పత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. శుక్రవారం బృందం అల్లికాలువ వద్ద నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఆసుపత్రిని, డిగ్రీ కాలేజి నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం సీతారాం విలేకరులతో మాట్లాడారు. డిగ్రీ కాలేజి నిర్మాణం చేపట్టి ఐదేళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదన్నారు. గత ప్రభుత్వం, ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగా డిగ్రీ కాలేజి భవన నిర్మాణం నిలిచిపోయిందన్నారు. అసంపూర్తి భవనంలో మద్యం సేవిస్తూ ఓపెన్ బార్‌గా వాడుకుంటున్నారన్నారు. అల్లికాలువ వద్ద రూ.50తో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనం అసం పూర్తిగా నిలిచిపోయిందన్నారు. గిరిజనులకు ఉపయోగపడే డిగ్రీ కాలేజి, ఆసుపత్రి భవన నిర్మాణాలకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి పూర్తిచేయాలని కోరారు. హాస్టల్ భవనాలను కూడా నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తెల్లం రామకృష్ణ, పోలోజు నాగేశ్వరావు, తెల్లం దుర్గారావు, చూండ్ర బుల్లెమ్మ, అన్నిక వెంకటస్వామి, తాతి రాంబాబు, పూసం దుర్గారావు, రాజన్న, సోయం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనులకు మెరుగైన వైద్య సేవలందించాలి
ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు కల్పించి, నాణ్యమైన మందులు అందించాలని పీవైఎల్ డివిజన్ నాయకులు కెచ్చెల పోతురెడ్డి, గురుగుంట్ల ప్రసాద్‌రెడ్డి, తగరం బాబురావు డిమాండ్ చేశారు. మంగయ్యపాలెంలో పోతురెడ్డి అధ్యక్షతన డివిజన్ కమిటీ సమావేశం శుక్ర వారం జరిగింది. గిరిజన గ్రామాలకు సరైన రోడ్డుమార్గం, విద్యుత్ సదుపా యం లేదని, ఆదివాసీలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అసంతృప్తిగా నిలిచిపోయిన వంద పడకల ఆసుపత్రి నిర్మాణం వెంటనే పూర్తిచేయాలన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, జీవో నెంబరు 3 యధావిధిగా పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన పట్టెన్నపాలెం బ్రిడ్జి పనులను పూర్తిచేయాలని కోరా రు. ఈ నెల 10న ఐటీడీఏ వద్ద నీవైఎల్ ధర్నా, ర్యాలీ కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కె.నాగేశ్వరావు, కె.నాగార్జున, కె.నడిపిరాజు, జి.లక్ష్మీనారాయణ, ఎన్.ముక్కారెడ్డి, జి.బాబురావు, మురళి, రామరాజు, రాము, తదితరులు పాల్గొన్నారు.