పేదలకు గృహయోగం
ABN , Publish Date - Jul 31 , 2024 | 12:24 AM
ఇళ్ళ నిర్మాణం పూర్తి కాకకపోవడంలో అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలే ఇబ్బందిగా మారాయి.
కూటమి సర్కారు తీపి కబురు
గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు
పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం మంజూరు
నిర్మాణ సాయం రూ.4 లక్షలు..
పేదవర్గాలు హర్షాతిరేకం
భీమవరం టౌన్/తాడేపల్లిగూడెం రూరల్, జూలై 30 : ఇళ్ళ నిర్మాణం పూర్తి కాకకపోవడంలో అప్పటి వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలే ఇబ్బందిగా మారాయి. ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలు మినహా అదనంగా ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఇసుకను మాత్రం ఉచితంగా ఇచ్చారు. మూడేళ్లుగా పెరిగిన గృహ నిర్మాణ వ్యయంతో సెంటున్నర భూమిలో నాలుగు నుంచి ఐదు లక్షల వరకు అంచనాలు పెరగడంతో లబ్ధిదారులు చేతులు ఎత్తేశారు. పట్టణాల్లో కేవలం సెంటు స్థలమే మంజూరుచేశారు. ఇక్కడ గృహాన్ని నిర్మించే పరిస్థితి క్లిష్టతరం కావడంతో లబ్ధిదారులు అంతంతమాత్రంగానే ముందుకు వచ్చారు. పైగా పట్టణానికి నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో వీటిని కేటాయించడంతో పట్టణ పేదలు పెద్దగా ముందుకు రాలేదు. గృహ నిర్మాణం అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. కొన్నిచోట్ల కాలనీకి సరైన మార్గం లేకపోవడం లబ్ధిదారుల్లో తీవ్ర నిరాశ వ్యక్తమైంది.
లే ఔట్‌ల పూడిక ఎలా ?
పట్టణాల్లో పేదల స్థలాలకు అత్యధికంగా భూములు కొనుగోలు చేశారు. చాలాచోట్ల వీటి పూడిక అసంపూర్తిగానే ఉండిపోగా, కొన్నిచోట్ల తట్ట మట్టి కూడా వేయలేదు. జిల్లాలో అత్యధికంగా భీమవరం, నరసాపురం, తణుకు, పాలకొల్లు ప్రాంతాల్లో ఉన్నాయి. మట్టిపూడిక పేరుతో గ్రామీణ ప్రాంతాల నుంచి మట్టిని తరలించే నెపంతో అప్పటి వైసీపీ నాయకులు వాటిని అమ్ముకున్నారనే ఆరోపణలు వచ్చాయి. జిల్లాలో మొత్తం 603 లే–అవుట్‌లు ఉన్నాయి. భీమవరం పట్టణ శివారు దిరుసుమర్రు రోడ్‌లో 73.5 ఎకరాలు భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమిని పేదలకు ఇవ్వడానికి ప్రాథమికంగా పట్టాలు సిద్ధం చేసి అందజేశారు. మట్టి పూడిక లేకపోవడంతో ఎవరి స్థలం ఎక్కడో ఎవరికీ తెలియని పరిస్థితి ఉంది కేవలం రాళ్లు పాతి వదిలేశారు. ఇక్కడ నాలుగు వేల మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాల్సి ఉంది.
మూడు కేటగిరీలు
అప్పట్లో ఇళ్ళ నిర్మాణానికి ఎంత హడావుడి చేసినా చాలాచోట్ల లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతో వైసీపీ ప్రభుత్వం పేదల గృహ నిర్మాణానికి మూడు కేటగిరీలుగా విభజించింది. ఇందులో ఏ కేటగిరీలో లబ్ధిదారుడే పూర్తిగా నిర్మించుకోవడం. ఈ ప్రభుత్వం 1.80 లక్షలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. దీనికి ఇటుక, సిమెంటు ప్రభుత్వం ఇచ్చింది. బి–కేటగిరి విభాగంలో గృహాన్ని ప్రభుత్వమే నిర్మించి ఇచ్చేలా ప్రతిపాదన చేశారు. సి కేటగిరి విభాగంలో ఇందులో కొంత సొమ్ము లబ్ధిదారుడి వాటాతో ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలతో కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో గృహ నిర్మాణం చేపట్టేలా నిర్ణయించి నిర్మాణాలు ప్రారంభించారు. ఇలా మూడు కేటగిరీల విధానంలో సైతం ప్రభుత్వం చేపట్టి నిర్మాణం ముందుకు సాగలేదు. పైగా ప్రారంభ సమయంలో ఉన్న నిర్మాణంతో బాగా జాప్యం సాగింది. అప్పట్లో కొంత మంది కాంట్రాక్టర్లు ఉత్సాహంగా ముందుకు వచ్చి నిర్మాణాలు చేశారు. పైగా కాంట్రాక్టర్లు తగిన రీతిలో ముందుకు రాకపోవడంతో 11 వేల గృహాలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాలో ప్రభుత్వం 68 వేల 945 ఇళ్లకు మంజూరుపత్రాలు ఇవ్వగా వాటిలో 28 వేల 261 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. ఇంకా 40,684 పూర్తి కావాల్సి ఉంది. అధికారిక లెక్కల ప్రకారం 4,907 ఇళ్లు కట్టేందుకు ప్రజలు ముందుకు రాలేదు.
పేదల్లో ఆనందం
ఇటువంటి పరిస్థితుల్లో ఈ గృహ నిర్మాణాన్ని నిర్మాణ వ్యయం పెంచి స్థలాన్ని కూడా పెంచి విశాలమైన నిర గృహాన్ని ప్రభుత్వమే నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో లబ్ధిదారులలో ఆశలు పెరిగాయి.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామి ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందానే దానిపై ఆశగా ఉన్నారు. ప్రస్తుతం ఇళ్ళస్థలం వచ్చిన లబ్ధిదారుల పరిస్ధితి ఎలా అనేదానిపై ఆలోచన చేస్తున్నారు. ప్రకటించిన స్ధలానికిగతంలో ఇచ్చిన స్థలానికి తేడా ఉండటంతో పాత స్ధలంలో మాత్రమే నిర్మాణంచేసుకోవాలా, కొత్తగా ఏమైనా స్ధలం పెంచుతారాలేదా, పెంచిన 4లక్షలు ఈ ఇళ్ళకు ఇస్తారా అనేదానిపై స్ఫష్టత కోసం చూస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.