Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

మా స్థలాలు మాకు ఇప్పించండి!

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:00 AM

ఇంటి స్థలాలు ఇవ్వడంతో ఎంతో సంతోషిం చామని, తమలో కొందరు ఇళ్లు కట్టుకున్నారని, అయితే అధికారులు తిరిగి ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని నేటికీ తమకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోగా ఆ స్థలాన్ని ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మరొకరికి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వాపోతున్నారు.

మా స్థలాలు మాకు ఇప్పించండి!
స్థలం చుట్టూ పరదాలు కట్టిన దృశ్యం

ఆ మెరక స్థలంపై అధికార పార్టీ నాయకుడి కన్ను

ఇతరులకు అమ్మే యత్నం..చుట్టూ పరదాలు

కొత్తూరు ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారుల ఆవేదన

ఏలూరు రూరల్‌, మార్చి 3 : ఇంటి స్థలాలు ఇవ్వడంతో ఎంతో సంతోషిం చామని, తమలో కొందరు ఇళ్లు కట్టుకున్నారని, అయితే అధికారులు తిరిగి ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని నేటికీ తమకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోగా ఆ స్థలాన్ని ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మరొకరికి అమ్మే ప్రయత్నం చేస్తున్నాడని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వాపోతున్నారు. వారు తెలిపిన వివరాలివి..

స్థానిక 16వ డివిజన్‌లో కొత్తూరు ఇందిరమ్మ కాలనీలో 2007,2009, 2012లో ఆర్‌.ఎస్‌.నెంబర్‌ 201, 204 లేఅవుట్‌ల్లో సుమారు 200 మందికి పైగా ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. వీరిలో కొత్తూరు–2లో ప్లాట్‌ నెంబర్‌ 464 నుంచి 473 వరకు కొందరు లబ్ధిదారులకు స్థలాలు కేటాయించారు. వీరిలో సొంతంగా ముగ్గురు ఇళ్లు కట్టుకున్నారు. ఇంటిపన్నులు సైతం కడుతున్నారు. అయితే 2009లో సరైన కారణం చూపకుండా ఈ పది మంది లబ్ధిదారులకు వేరేచోట ఇంటి స్థలం ఇస్తామని చెప్పి అధికారులు ఖాళీ చేయించారు. అప్పటి నుంచి వీరికి ఎక్కడా స్థలం కేటాయించలేదు. అధికారులు చుట్టూ లబ్ధిదారు లు తిరిగినా ఫలితం లేదు. అయితే ఆ స్థలం మెరక ప్రాంతం కావడంతో వైసీపీకి చెందిన స్థానిక ఓ నాయకుడి కన్నుపడిందని, తాము ఖాళీ చేసిన స్థలంలో 600 గజాలను అతను ఇతరులకు అమ్మే ప్రయత్నం చేస్తున్నట్టు లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఆ స్థలం కనిపించకుండా చుట్టూ పరదాలు కట్టించాడని మండిపడుతున్నారు. దీనిపై అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నా సమస్య పరిష్కారం కాలేదని, జగనన్న చెప్పుకుందాం స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి న్యాయం చేయాలని లబ్ధిదారులు టి.విజయలక్ష్మి, డి.పుష్ప, పిట్ల సూర్యకుమారి, నజీమా, మాజేటి భవాని, పంతం మరియమ్మ, వై.రణధీర్‌గౌడ్‌ తదితరులు కోరుతున్నారు.

ఓట్లు ఎలా అడుగుతాం..?

నేను కార్పొరేటర్‌గా ఉండగా కొత్తూరులోని ఇందిరమ్మకాలనీలో ఇళ్ల స్థలాలు ఇప్పించాను. మెరక స్థలమని కొంతమందికి స్థలం ఇచ్చినట్లే ఇచ్చి ఆ స్థలాన్ని తిరిగి తీసేసుకున్నారు. అప్పటికే కొందరు ఇళ్లు కట్టుకున్నారు. పన్నులు చెల్లించారు. వారికి కూడా నేటికీ ఇంటిస్థలం ఇవ్వలేదు. మా పార్టీకే చెందిన ఓ వ్యక్తి ఆ స్థలాన్ని మరొకరికి అమ్మేం దుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. లబ్ధిదారులతో ఇటీవల కలెక్టర్‌తో పాటు ఎమ్మెల్యే ఆళ్ళ నానిని కలిసి ఫిర్యాదు చేశాం. దీనిపై విచారణకు ఆదేశించినా అధికారులు స్పందించడం లేదు. వైసీపీలోనే ఉంటూ కొందరు చేసే పనుల వల్ల తలెత్తుకోలేకపోతున్నాం. తిరిగి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు ఎలా అడుగుతాం. ఇప్పటికైనా అధికారులు లబ్ధిదారులకు న్యాయం చేయాలి.

–ఎరకల సాంబశివరావు, మునిసిపల్‌ మాజీ కార్పొరేటర్‌

వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి

Updated Date - Mar 04 , 2024 | 12:00 AM