హాస్టల్ విద్యార్థులకు అస్వస్థత
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:23 AM
మండలంలోని చనుబండ ఉషోదయ స్కూల్ హాస్టల్‌లో చదువుతున్న నలుగురు విద్యార్ధులు ఆదివారం రాత్రి అస్వస్ధతకు గురికావటంతో హుటాహటిన అధికారులు వచ్చి విచారణ జరిపారు.

చాట్రాయి, జూలై 7: మండలంలోని చనుబండ ఉషోదయ స్కూల్ హాస్టల్‌లో చదువుతున్న నలుగురు విద్యార్ధులు ఆదివారం రాత్రి అస్వస్ధతకు గురికావటంతో హుటాహటిన అధికారులు వచ్చి విచారణ జరిపారు. ఈ హాస్టల్‌లో 42 మంది విద్యార్ధులు ఉండగా, ఆదివారం బిర్యానీ తిన్న తరువాత 4 గురు విద్యార్ధులకు కడుపునొప్పి రావటంతో స్కూల్ యాజమాన్యం అప్రమత్తమై ఒకరికి చనుబండలో, ముగ్గురికి సత్తుపల్లిలో చికిత్స చేయించటంతో కోలుకున్నారు. విషయం తెలియగానే పీహెచ్‌సీ వైద్యాధికారి విజయలక్ష్మి, ఎంఈవో వీయస్వీ బ్రహ్మాచారి, ఎస్సై కేసీహెచ్ స్వామి హాస్టల్‌కు వచ్చి విద్యార్ధులతో మాట్లాడారు. అస్వస్ధతకు గురైన విద్యార్ధులకు గ్యాస్టిక్ సమస్య ఉండటం వలన ఇలా జరిగి ఉండవచ్చునని, తిన్న ఆహారం కలుషిత కాలేదని అధికారులు చెప్పారు. విషయం తెలియగానే తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకున్నారు. విద్యార్ధులు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై స్కూల్ ప్రిన్సిపాల్ వెంకట్రామయ్యను వివరణ కోరగా 42 మంది విద్యార్థులకు గాను కేవలం నలుగురు మాత్రమే అస్వస్థతకు గురయ్యారని, వారు గ్యాస్ట్రిక్ ట్రబుల్‌తో బాధపడుతున్నారని, డాక్టర్లు కూడా అదే చెప్పారని తెలిపారు.