Share News

పెచ్చులూడి.. బీటలు వారి!

ABN , Publish Date - May 26 , 2024 | 11:41 PM

పేరుకే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు. పేద విద్యార్థుల విద్యా భివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన వాటిలో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక అవస్థలకు గురవుతు న్నారు. మరో పదిహేను రోజుల్లో పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో వసతి గృహాలను మెరుగు పరచాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

పెచ్చులూడి.. బీటలు వారి!
కైకలూరు సాంఘిక సంక్షేమ ప్రత్యేక బాలికల వసతి గృహం దుస్థితి

ఎవరికీ పట్టని సంక్షేమ హాస్టళ్లు

శిథిలావస్థలో హాస్టళ్ల భవనాలు

పెచ్చులూడిన శ్లాబ్‌లు.. బీటలు వారిన గోడలు

వర్షం పడితే నీరంతా గదుల్లోకే..

అధ్వానంగా మరుగుదొడ్లు.. పారిశుధ్యం

ఇరుకు గదుల్లో విద్యార్థుల పాట్లు

మరమ్మతుల ఊసే పట్టని అధికారులు

పేరుకే ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు. పేద విద్యార్థుల విద్యా భివృద్ధి లక్ష్యంగా ఏర్పాటు చేసిన వాటిలో మౌలిక వసతులు లేక విద్యార్థులు అనేక అవస్థలకు గురవుతు న్నారు. మరో పదిహేను రోజుల్లో పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో వసతి గృహాలను మెరుగు పరచాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధ్వానంగా ఉన్న ఆ హాస్టళ్లల్లో ఉండి చదివేది తమ పిల్లలు కాదనే నిర్లక్ష్యం సంబంధిత అధికారుల్లో కన్పిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్‌ భవనాల్లో తమ పిల్లలను ఉంచి చదివించేందుకు వారు భయపడుతున్నారు. కనీసం మౌలిక వసతులు కూడా మెరుగు పరచకుంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

వసతులు కరువయ్యే...

ఉంగుటూరు : ఉంగుటూరు మండలంలో సంక్షేమ వసతి గృహలలో వస తులు కరవయ్యాయి. కైకరం, బొమ్మిడి వసతి గృహంలో శ్లాబులు పెచ్చు లూడి పోయి లీకయ్యే పరిస్థితి ఉంది. రానున్న వర్షాకాలంలో ఏకధాటిగా వర్షాలు కురిస్తే ఇక్కడ వర్షపు నీరు తరగతి గదుల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరుగుదొడ్ల నిర్వహణ సక్రమంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. చేబ్రోలు వసతి గృహంలో విద్యార్థినుల సంఖ్యను బట్టి మరుగుదొడ్లు ఉండా లని తల్లిదండ్రులు కోరుతున్నారు.

వానొస్తే.. తప్పని తిప్పలు...

చింతలపూడి : చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి బీసీ బాలుర హాస్టల్‌ పరిస్థితి అధ్వానంగా ఉంది. పై కప్పు లేచిపోయింది. కిచెన్‌రూమ్‌, పడుకునే హాల్‌, వర్షం పడితే అంతా నీటితో నిండిపోతుంది. మూడేళ్ల క్రితం చింతలపూడి, లింగపాలెంలోని బీసీ హాస్టళ్ల వసతి భవనాలు బాగాలేక మూసివేశారు. ప్రస్తుతం ఈ రెండు మండలాలకు సంబంధించి ఎర్రగుంట పల్లిలోనే బీసీ బాలుర హాస్టల్‌ ఒకటే ఉంది. ఇది కూడా శిథిలావస్థలో ఉంది. 40 ఏళ్ళ క్రితం ఈ హాస్టల్‌ను ప్రారంభించారు. అప్పట్లో సుమారు 130 మంది విద్యార్థులకు వసతి సౌకర్యం ఉండేది. 2000 సంవత్సరంలో ఈ హాస్టల్‌ను మరో భవనంలోకి మార్చారు. ఈ భవనం బంగళా పెంకులతో ఉంది. గత రెండేళ్లుగా పైకప్పు లేచిపోయి కొద్దిపాటి వర్షం పడినా కిచెన్‌ రూమ్‌లోకి, విద్యార్థులు పడుకునే రూముల్లోకి నీరు చేరుతోంది. హాస్టల్‌ భవనం శిథిలమైందని, మరో భవనంలోకి మార్చాలని మండల పరిషత్‌ అధికారులు పరిశీలించి నోటీసులు ఇచ్చారు. అయినా ఈ ఏడాది కూడా ఇక్కడ కొనసాగించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. హాస్టల్‌ వార్డెన్‌ శశికుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఈ హాస్టల్లో ఉండాలంటే భయపడుతున్నారని, దీనిపై ఉన్నతాధికారులకు గతంలో తెలిపామన్నారు. గతేడాది 35 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా చింతలపూడిలో బీసీ బాలికల హాస్టల్‌ ఉంది. విద్యార్థినుల సంఖ్య ఎక్కువ ఉన్నా చాలీ చాలని సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఎర్రగుంట పల్లి బీసీ హాస్టల్‌ భవనం మార్చాలని, చింతలపూడి బాలికల హాస్టల్‌కు అదనపు సౌకర్యాలు పెంచాలని కోరుతున్నారు.

ప్రమాదం నీడలో..

నూజివీడు టౌన్‌ : బడుగు, బలహీన వర్గాలకు వసతితో కూడిన మెరుగైన విద్యను అందిస్తు న్నామని సర్కార్‌ ఢంకా బజాయిస్తుం డగా, క్షేత్రస్థాయిలో మాత్రం హాస్టళ్ల పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఎస్సీ సాంఘిక సంక్షేమశాఖ వసతి గృహాల పరిధిలో మొత్తం 1,200 మంది వరకు విద్యార్థులు వసతి పొందుతుండగా, వారికి మెరుగైన సౌకర్యాలను అందించటంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పవచ్చు. నూజివీడులో ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలు అక్కడ వసతి పొందుతున్న విద్యార్థులకు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా యి. ఎస్సీ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహ సముదాయంలో హాస్టల్‌–1, హాస్టల్‌–3 భవనాల శ్లాబులు పెచ్చులూడి కింద పడుతుండడంతో విద్యార్థినులు ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. హాస్టల్‌ –1లో మొదటి అంతస్థును పూర్తిగా తొలగించి పునర్‌నిర్మాణం చేయాల్సి ఉంది. ఇక హాస్టల్‌ మూడులో సైతం శ్లాబులు పెచ్చులూడుతుం డటంతో ఒక్కో హాస్టల్‌కు కనీసం రూ.10లక్షలు ఖర్చుచేసి మరమ్మతు చేయా ల్సిన పరిస్థితి. ఇక ఇంటిగ్రేటెడ్‌ బాయిస్‌ హాస్టల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. ఇక్కడ ఐదేళ్లుగా మరుగుదొడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. వసతి గృహాలు ఉన్న ప్రతిచోట మురుగునీటి పారుదల సమస్యగా మారింది. ఎస్సీ కాలేజ్‌ గరల్స్‌ హాస్టల్లో భవన నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోగా, ఇరుకు గదుల్లోనే సామర్థ్యానికి మించి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, సంబంధిత శాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడంతో సంబంధిత వసతి గృహాల్లో విద్యార్థులు చేరేందుకు వెనుకా ముందు ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.

అడుగడుగునా సమస్యల తిష్ఠ

ఏలూరు రూరల్‌ : ‘నా ఎస్సీ, నాఎస్టీ, నా బీసీ’ అంటూ పదేపదే పలికిన సీఎం జగన్‌ వాస్తవానికి వారిపై కపట ప్రేమ చూపారు. అందుకు ఏలూరులో ఉన్న ఎస్సీ వసతి గృహమే నిదర్శనం. ఏలూరు ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో నాణ్యమైన విద్యతో పాటు కార్పొరేట్‌ స్థాయిలో వసతి కల్పిస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. నగరంలో జిల్లా అధికారులు నిత్యం తిరిగే ప్రాంతంలో వున్న ఎస్సీ వసతి గృహంలో పెచ్చులూడిన గోడలు, చెత్తా చెదారం, తిరగని ఫ్యాన్‌లు, నీళ్లు రాని కుళాయిలు, హాస్టల్‌ ముందు మురుగు తిష్ట వేసిన ఎవరికీ పట్టడం లేదు. పారిశుధ్యం లోపించి ఈగలు, దోమలతో గతంలో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. మరో పది హేను రోజుల్లో పాఠశాలలు తెరుస్తున్న నేపథ్యంలో వసతిగృహాలను మెరు గుపరచాల్సిన అధికారులు తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నా రంటూ విమర్శలు వస్తున్నాయి.

కూలేందుకు సిద్ధంగా..

కైకలూరు : దశాబ్దాల కిందట నిర్మించిన కైకలూరు ఎస్సీ బాలికల వసతి గృహం శిథిలావస్థకు చేరింది. ప్రతీ రూంలోనూ శ్లాబ్‌ పెచ్చులు ఊడి పడిపోవడంతో ఎప్పుడు కూలిపోతుందోననే పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లల్లో హాస్టళ్లను పట్టించుకోలేదు. వివిధ ప్రాంతాల నుంచి ఎస్సీ బాలికలు ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకు ఈ సంక్షేమ హాస్టల్లో ఉంటూ ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తూ ఉంటారు. భవనం శిథిలం అవడంతో వారి తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పించేందుకు వెనుకడుగు వేసి వారి పిల్లలను కష్టసాధ్యమైన గుడివాడ పరిసర ప్రాంత హాస్టళ్ళో చేర్పించి విద్యనభ్యసించేలా చేస్తున్నారు. భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉండడంతో దాదాపుగా హాస్టలు మూసివేసే పరిస్థితి నెలకొంది.

Updated Date - May 26 , 2024 | 11:41 PM