Share News

గ్రూప్‌–2 పరీక్ష ప్రశాంతం

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:53 PM

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రూప్‌ –2 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. సమయానికి గంటముందే అభ్యర్థులు కేంద్రాలకు వచ్చారు. హాల్‌టిక్కెట్‌, గుర్తింపు కార్డు పరిశీలన, తనిఖీల తర్వాత కేంద్రంలోకి అనుమతించారు.

గ్రూప్‌–2 పరీక్ష ప్రశాంతం
ఏలూరులో రూమ్‌ నంబర్లు చూసుకుంటున్న అభ్యర్థులు

ఏలూరులో 83.67 శాతం,

పశ్చిమలో 84.80 శాతం హాజరు

భీమవరం ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 25 :ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గ్రూప్‌ –2 పరీక్ష ఆదివారం ప్రశాంతంగా జరిగింది. సమయానికి గంటముందే అభ్యర్థులు కేంద్రాలకు వచ్చారు. హాల్‌టిక్కెట్‌, గుర్తింపు కార్డు పరిశీలన, తనిఖీల తర్వాత కేంద్రంలోకి అనుమతించారు. ఏలూరులో పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ వెంకటేశ్‌ పరిశీలించారు. భీమవరంలో జేసీ రామ్‌సుందర్‌రెడ్డి పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 ప్రీలిమినరీ పరీక్షలు విజయవంతంగా ముగిశాయని జిల్లా జాయింటు కలెక్టర్‌ ఎస్‌.రామ్‌సుందర్‌రెడ్డి తెలిపారు. జిల్లాలో 37 పరీక్షా కేంద్రాల్లో 14,546 మందికి అభ్యర్ధులు పరీక్షలకు హాజరు కావల్సి ఉండగా 12,336 (84.80 శాతం) హాజరయ్యారని, 2,210 హజరు కాలేదన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా కలెక్టరేట్‌లో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని, పరీక్షలు పూర్తయ్యేవరకు ఎటువంటి ఆటంకం ఏర్పడకుండా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి మానిటరింగ్‌ చేశామన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను పర్యవేక్షించిన ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి శివనారాయణరెడ్డిని, పరీక్షల నిర్వహణలో తోడ్పాటును అందించిన ఏపీపీఎస్సీ సెక్షన్‌ అధికారి జయంతి, ఏఎస్‌వోఏ నాగలక్ష్మీ, జిల్లా కలెక్టర్‌ కార్యాలయం పరిపాలన అధికారి పీహెచ్‌జీఆర్‌ పాపారావు, పర్యవేక్షకులు ప్రసాద్‌, సిబ్బంది, తదితరులను జేసీ అభినందించారు. పట్టణంలోని శ్రీవిష్ణు కాలేజీ పరీక్షా కేంద్రంలో జేసీ పరిశీలించారు. పరీక్షా పేపర్లు స్ట్రాంగ్‌ రూమ్‌కి చేరేవరకు వాహనాలకు పోలీసు భద్రత కట్టుదిట్టంగా ఉండాలన్నారు.

నరసాపురం టౌన్‌ : పట్ణణ, మండలంలోని మూడు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. వైఎన్‌ కళాశాల, సూర్య, మండలంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌ కాలేజీలో పరీక్షలు జరిగాయి. అన్ని కేంద్రాల వద్ద గట్టి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తణుకు : తణుకు పట్టణంలో భాష్యం, శశి, బాలురున్నత పాఠశాల, ఎస్‌కె ఎస్‌డీ మహిళా కళాశాల, ఎస్‌సీఐఎం కళాశాలలో పరీక్షలు జరిగాయి. 1,916 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 1,530 మంది హాజరు కాగా, 386 మంది హాజరు కాలేదు.

ఏలూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 25: ఏలూరు జిల్లాలో 39 పరీక్షాకేంద్రాల్లో నిర్వహించిన గ్రూప్‌ –2 పరీక్షలకు 13,977మంది హాజరు కావాల్సి ఉండగా 11,696 మంది (83.68 శాతం) అభ్యర్థులు హాజరయ్యారని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. 2,281 మంది గైర్హాజరయ్యారు. ఏలూరు, రామచంద్ర ఇంజినీరింగ్‌ కళాశాల, సీఆర్‌ రెడ్డి ఉమెన్స్‌ కళాశాలలో పరీక్షాకేంద్రాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. గ్రూప్‌–2 పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. సీఆర్‌.రెడ్డి కళాశాల, తదితర కళాశాలల్లో నిర్వహించిన పరీక్షాకేంద్రాలను జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి పరిశీలించారు.ఆర్డీవో ఖాజావలీ, ఎఫ్‌పిఐఐసీ జోనల్‌ మేనేజరు కె.బాబ్జి తదితరులు ఉన్నారు.

పెదపాడు :పెదపాడు మండలం వట్లూరులోని సర్‌సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ , సర్‌సీఆర్‌ రెడ్డి మహిళా కళాశాలలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఇంజనీరింగ్‌ కళాశాలలో 1822 మంది హాజరు కాగా 178 గైర్హాజరయ్యారు. మహిళా కళాశాలలో 362 మంది హాజరు కాగా 38 మంది గైర్హాజరయ్యారు.

ఏలూరు క్రైం : ఏలూరు రేంజ్‌ ఐజీ జీవిజీ అశోక్‌కుమార్‌, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతిలు పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఏలూరు సెయింట్‌ థెరిస్సా ఇంటర్‌ క్యాంపస్‌ సెంటర్‌, సీఆర్‌రెడ్డి కళాశాల, సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలను పరిశీలించారు.

Updated Date - Feb 25 , 2024 | 11:53 PM