Share News

కోఢీ

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:45 AM

పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా సంప్రదాయ ముసుగులో సంక్రాంతి పండుగ మూడు రోజులూ యథేచ్చగా కోడిపందేలు,పేకాటకు నిర్వాహకులు తెర తీస్తున్నారు.

కోఢీ
కలిదిండిలో కోడిపందేలకు సిద్ధమవుతున్న బరి

కొల్లేరు గ్రామాల్లో పందేల నిర్వహణకై వేలంపాటలు

భారీగా పేకాట, గుండాటలకు మొగ్గు చూపుతున్న నిర్వాహకులు

పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా సంప్రదాయ ముసుగులో సంక్రాంతి పండుగ మూడు రోజులూ యథేచ్చగా కోడిపందేలు,పేకాటకు నిర్వాహకులు తెర తీస్తున్నారు. గ్రామగ్రామాన జూదాలు నిర్వహణకై ఏర్పాట్లు చేస్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలో పదుల సంఖ్యలో కోడిపందేల బరులు నిర్వహణకై పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్న డూ లేనివిధంగా ఈ ఏడాది ప్రతి చోటా పేకాట, గుండాట, భారీగా ఆడించాలని నిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కైకలూరు/మండవల్లి/ముదినేపల్లి/కలిదిండి, జనవరి 10 : కొల్లేరు గ్రామాల్లో ఇప్పటికే కోడిపందేలు, జూదాలు నిర్వహణకై గ్రామ కట్టుబాట్ల మధ్యన బహిరంగ వేలం పాటలు నిర్వహించారు. వీటిలో వేలంపాట పాడుకున్నవారి నిర్ణయమే తుదినిర్ణయంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇప్పటికే లక్షల రూపాయలు వెచ్చించి బరులను పాట పాడుకున్నారు. కైకలూరు మండలం శృంగవరప్పాడులో రూ.1.50 లక్షలు, పందిరిపల్లెగూడెంలో రూ.55 వేలు, చటాకాయలో రూ.60 వేలకు బరులను సొంతం చేసుకు న్నారు. అలాగే మండవల్లి మండలంలో ఇంగిలిపాకలంకలో రూ.5 లక్షలు, పులపర్రులో రూ.70 వేలు వేలం పాటలు నిర్వ హించారు. మరికొన్ని కొల్లేరు గ్రామాలైన చింతపాడు, తదితర గ్రామాల్లో ఈ పాటలను నిర్వహించనున్నారు. చింతపాడు గ్రామంలో సుమారు రూ.10 లక్షల వరకు బహిరంగంగా పాట పాడే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రామంలో కోట్లల్లో కోడిపందేలు, జూదాల పేరిట ఏటా చేతులు మారుతుం టాయి. కైకలూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో కోడి పందేలు, పేకాట నిర్వహించేందుకు ఇప్పటికే అధికార పార్టీ నాయకుల దగ్గరికి ప్రదక్షణలు చేస్తున్నారు. బరులకు అనుమతుల కోసం గ్రామ, మండల స్థాయి అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు.

ఆదేశాలు బేఖాతర్‌

రెవెన్యూ అధికారులు తీవ్ర స్థాయిలో హెచ్చరించినా, పోలీసు అధికారులు నిఘా నిర్వహిస్తున్నా సంక్రాంతి పండుగకు జూదాల నిర్వహణకు అడ్డుకట్ట పడే అవకాశాలు కనిపించడం లేదు. కోడిపందేలు, పేకాట, ఇతర జూదాలు నిషేధమని, వాటిని నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికార వర్గాలు జారీ చేసిన ఉత్తర్వులను పందేల నిర్వాహ కులు పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ముదినేపల్లి మండలంలో ఏటా మాదిరిగానే సంక్రాంతికి కోడి పందేలు, పేకాటల నిర్వహణకు ఏర్పాట్లు జరు గుతున్నాయి. బరులు సిద్ధమవుతు న్నాయి. ముదినేపల్లి, అల్లూరు, బొమ్మి నం పాడుల్లో పెద్ద బరుల తోపాటు, పలుచోట్ల చిన్న సైజు బరులు నిర్వహణకు నిర్వాహ కులు ఏర్పాట్లు చేసు కుంటున్నారు. ప్రధాన రహదారుల పక్క నే బరులు ఏర్పాటు చేస్తుండటం విశేషం.

కలిదిండి మండలంలో పలు గ్రామాల్లో కోడి పందెలకు నిర్వాహకులు బరులు సిద్ధం చేస్తున్నారు. కలిదిండిలో ఎక్స్‌కవేటర్‌, ట్రాక్టర్లతో బరిని చదును చేస్తున్నారు. తాడినాడ, సానారుద్రవరం, కొండంగి, పెదలంక గ్రామాల్లో బరులు ఏర్పాటుకు అధికార పార్టీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. బరుల్లో కోతముక్క, మద్యం, గుండాట, చిత్తులాట, బిర్యాని దుకాణాలను ఏర్పాటు చేసేందుకు ముందుగానే ఒప్పం దాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో రాత్రి వేళల్లో రహస్య ప్రదేశాల్లో కోడిపందేలు వేస్తున్నట్టు సమాచారం.

Updated Date - Jan 11 , 2024 | 12:45 AM