గ్రీన్ ట్యాక్స్ మోత
ABN , Publish Date - Aug 02 , 2024 | 12:22 AM
జగన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాలు రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఒకటి, రెండూ కాదు అన్ని రంగాలను ఒక ఆట ఆడిన జగన్ ప్రభుత్వం చీడ ఇప్పటికీ వాహన యజ మానులను వెంటాడుతూనే ఉన్నది.
దడ పుట్టిస్తున్న హరిత పన్ను
పక్క రాష్ట్రాల్లో వందల్లో.. ఇక్కడ వేలల్లో
గగ్గోలు పెడుతున్న వాహన యజమానులు
కూటమి హామీ నెరవేర్చాలని డిమాండ్
పాలకొల్లు, ఆగస్టు 1: జగన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాలు రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఒకటి, రెండూ కాదు అన్ని రంగాలను ఒక ఆట ఆడిన జగన్ ప్రభుత్వం చీడ ఇప్పటికీ వాహన యజ మానులను వెంటాడుతూనే ఉన్నది. రవాణా వాహనాలకు, పాసింజర్, సొంత వాహనాలకు వివిధ రూపాల్లో హరిత పన్ను (గ్రీన్ ట్యాక్స్) వసూలు చేస్తారు. వాస్తవానికి ఈ పన్ను వసూలు విధానం కేంద్ర ప్రభుత్వానిది. అయితే దేశంలోని ఆయా రాష్ట్రాలు హరిత పన్నును తమ పరిస్థితుల మేరకు పన్ను వసూళ్లను మదింపు చేస్తుంటాయి. కాలం తీరిన వాహనాల నుంచి వచ్చే కర్భన ఉద్గారాలు (కార్బండయాక్సైడ్) శాతం పెరుగు తూండటాన్ని బట్టి గ్రీన్ ట్యాక్స్ పెరుగుతూ ఉంటుంది. గూడ్స్ వెహికల్స్, పాసింజర్ వెహికల్స్‌కు కొనుగోలు రిజిస్ర్టేషన్ తేదీ నుంచి ఎనిమిదేళ్ల తరువాత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సొంత వాహనాలకు అయితే కొనుగోలు రిజిస్ట్రేషన్ అనంతరం 15 ఏళ్ల వరకూ గ్రీన్ టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
సమీప రాష్ట్రాలలో గ్రీన్ టాక్స్ రూ. 500 నుంచి 1500 మాత్రమే ఉండగా, ఆధ్రప్రదేశ్‌లో రూ. 6 నుంచి 9 వేలు వరకూ ఉంది. కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో సైతం హరిత పన్ను అధికంగా వసూలు చేస్తున్న ప్పటికీ దేశంలోని అధికశాతం రాష్ట్రాలలో సరళంగానే ఉంది. మన రాష్ట్రంలో మాత్రం జగన్ రెడ్డి ప్రభుత్వానికి ముందు వందల్లో ఉన్న గ్రీన్ టాక్స్ ఇప్పుడు వేలల్లోకి పెరిగింది.
కూటమి హామీ నెరవేర్చాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హరిత పన్ను తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే వాహన రంగం తగిన కిరాయిలు లేక కుదేలైన పరిస్థితుల్లో గ్రీన్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఫిటెనెస్, వీటికి తోడు టోల్ ట్యాక్స్‌లు, నిర్వహణ వ్యయం..ఇవన్నీ రవాణా వాహనాల ఉనికిని ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని వందల సంఖ్యలో ట్రాన్స్‌పోర్టు వాహనాలను ఇతర రాష్ట్రాలలో అమ్మకాలు జరిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల సమయంలో నేరుగా వాహన యజమానులకు హామీ ఇచ్చారని, రాష్ట్రంలో గ్రీన్ ట్యాక్స్ వేలల్లో ఉండటం పట్ల విస్మయం వ్యక్తం చేశారని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన ట్యాక్స్ తగ్గిస్తామని హామీ ఇచ్చినట్టు ఈ సందర్భంగా వాహన యజమానులు గుర్తు చేస్తున్నారు