దర్జాగా తవ్వేస్తున్నారు
ABN , Publish Date - Jan 29 , 2024 | 12:05 AM
అంకన్నగూడెంలో కొత్తకుంట చెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు అధికార పార్టీ నేతలు తెరలేపారు. ఆదివారం మధ్యాహ్నం మట్టిని అక్రమ తవ్వుతుండగా గ్రామస్థులు అడ్డుకోవడంతో గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు.
అంకన్నగూడెం చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు
అధికార పార్టీ నేతల బరితెగింపు
అడ్డుకున్న గ్రామస్థులు.. ఇరువర్గాల ఘర్షణ
పెదవేగి, జనవరి 28 : అంకన్నగూడెంలో కొత్తకుంట చెరువులో మట్టి అక్రమ తవ్వకాలకు అధికార పార్టీ నేతలు తెరలేపారు. ఆదివారం మధ్యాహ్నం మట్టిని అక్రమ తవ్వుతుండగా గ్రామస్థులు అడ్డుకోవడంతో గ్రామస్థులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అదుపు చేశారు. అప్పటికి తాత్కాలికంగా వివాదం సమసినప్పటికీ తిరిగి సాయంత్రానికి ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో పాటు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో పోలీసులు మరోసారి గ్రామానికి చేరుకుని, ఇరువర్గాలను చెదరగొట్టి, పరిస్థితిని అదుపు చేశారు.
టిప్పర్ల అడ్డగింత
ముదినేపల్లి, జనవరి 28 : పెదగొన్నూరులో బుసక రవాణాపై శనివారం రాత్రి వివాదం చెలరేగింది. ఆ గ్రామ ఏరియాలోని ఓ చెరువు మరమ్మతుల పనులు నిర్వహిస్తూ టిప్పర్లతో బయటి ప్రాంతాలకు మట్టిని తరలిస్తుండడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని, టిప్పర్ల రాకపోకల శబ్దంతో రాత్రిళ్లు అసౌకర్యా నికి భయానికి గురవుతున్నామని పలువురు గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ బుసక రవాణా వాహనాలను నిలిపివేశారు. దీంతో బుసక రవాణా చేస్తున్న వ్యక్తులకు గ్రామస్థు లకు వాగ్వాదం జరిగింది. దీనిపై ఫోన్‌లో గ్రామానికి చెందిన పాండ్రంకి కిరణ్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు ఏలూరు ఆర్డీవో ఖాజావలీ టిప్పర్ల రాకపోకలను పరిశీలించాలని తహసీల్దార్ శ్రీనివాస్‌ను ఆదేశించారు. తహసీల్దార్ ఆదేశాలతో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ పెదగొన్నూరు వెళ్లి బుసక రవాణాను నిలిపేశారు. గుడివాడ సమీపంలోని జాతీయ రహదార్ల పనులకు బుసకను సరఫరా చేస్తున్నందున టిప్పర్ల ద్వారా రవాణాను గ్రామంలో నుంచి కాకుండా వేరే మార్గం ద్వారా నిర్వహించుకోవాలని రవాణాదారులకు అధికారులకు సూచించారు. దీంతో ఆదివారం టిప్పర్లకు బ్రేక్ పడింది.