Share News

గోపాలపురం.. అభివృద్ధిలో వివక్ష

ABN , Publish Date - May 03 , 2024 | 12:26 AM

గోపాలపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష హోదాలో ఎన్నికల ముందు జగన్‌ పాదయాత్ర నామమాత్రంగా సాగింది. నియోజకవర్గానికి మేలు చేసే హామీలు లేవు.

గోపాలపురం.. అభివృద్ధిలో వివక్ష
పోలవరం కుడి ప్రధాన కాల్వపై లక్ష్మీపురం వద్ద అసంపూర్తి వంతెన

పామాయిల్‌ గిట్టుబాటు ధర లేదు

పోలవరం కుడి కాల్వ నిర్వాసిత రైతులకు పరిహారం లేదు

ఎర్ర కాల్వ పనులు లేవు

నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారు

గోపాలపురం నియోజకవర్గంలో ప్రతిపక్ష హోదాలో ఎన్నికల ముందు జగన్‌ పాదయాత్ర నామమాత్రంగా సాగింది. నియోజకవర్గానికి మేలు చేసే హామీలు లేవు. అధికారంలో ఉండగా మరోసారి వచ్చినా నియోజకవర్గ ప్రజలకు నిరాశే. ప్రతిపక్ష హోదాలో వచ్చిన జగన్‌ ముందు పామాయిల్‌ రైతుల ఒక సమస్య ఉంచారు. పామాయిల్‌ గెలలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. అదే కాదు ఒకటి.. అర.. హామీలు కూడా గాలికొదిలేశారు. గోపాలపురం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో వివక్ష చూపారని, అభివృద్ధిలో చిన్నచూపు చూశారని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. హామీలు ఇవ్వడానికే వెనకాడారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా ఎస్సీలు అంటూ ఊదరగొట్టే జగన్‌ ఐదేళ్లలో ఏం చేశారని ఎస్సీలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. – గోపాలపురం

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన గోపాలపురంలో ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పాదయాత్రలో భాగంగా నియోజకవర్గానికి వచ్చిన జగన్‌ కనీసం హామీలు కూడా ఇవ్వలేదని ప్రజలు మండిపడుతున్నారు. పామాయిల్‌కు గిట్టుబాటు ఽధర కావాలని రైతులు నోరు తెరచి అడిగితే తెలంగాణ కంటె ఎక్కువ ఇస్తామని గొప్పగా చెప్పారని, అధికారంలోకి వచ్చాక మొండిచెయ్యి చూపారన్నారు. పోలవరం నిర్వాసితుల్లో భాగమైన కుడికాల్వ తవ్వకాల్లో భూములు కోల్పోయిన రైతులకు రూ.5 లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేక జగన్‌ చేతులేత్తేశారని నియోజకవర్గ ప్రజలు మండి పడుతున్నారు.

పోలవరం కుడి కాల్వపై అసంపూర్తి వంతెన

దేవరపల్లి మండలంలో పోలవరం కుడి ప్రధాన కాల్వపై లక్ష్మీపురం వద్ద టీడీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణం చేపట్టింది. తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక వంతెన నిర్మాణం వైపు ప్రజాప్రతినిధులు, అధికారులు కన్నెత్తి చూడలేదు. దేవరపల్లి – లక్ష్మీపురం మధ్య కిలోమీటరు దూరం ప్రయాణానికి చుట్టు తిరిగి 5 కిలో మీటర్లు వెళ్లాల్సి వస్తోంది. రైతులు, విద్యార్థులు, కూలీలు, వాహనదారులు నానా తంటాలు పడుతున్నారు. కోరుమామిడి, చిక్కాల ప్రధాన రహదారి నిర్మిస్తానని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పలుమార్లు భూమి పూజలు చేశారు. సామాజిక మాద్యామాల్లో ప్రచారం చోసుకున్నారు. రహదారి నిర్మాణం మాత్రం చేయలేదు.

నిలిచిపోయిన ఎర్ర కాల్వ, కుడికాల్వ పనులు

నల్లజర్ల మండలంలో పోతవరం నుంచి పుల్లలపాడు వరకు ఎర్రకాల్వ, కుడి కాల్వ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఆ కాల్వ వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో 15కిలోమీటర్ల మేరా 7వేల ఎకరాలకు నీరందక సాగుభూములు బీడుభూములుగా మారాయి. నల్లజర్ల మండల కేంద్రంలో గత టీడీపీ ప్రభుత్వం ఆర్‌టీసీ బస్టాండ్‌ నిర్మించింది. తర్వాత రాజమండ్రి – ఏలూరు వెళ్ళే జాతీయ రహదారి నిర్మాణంతో బస్సులు హైవే మీదుగా వెళుతున్నాయి. దీనితో కాంప్లెక్స్‌కు బస్సులు రాక ప్రయాణికులు నానాతంటాలు పడుతున్నారు. ఐదేళ్లుగా ప్రజాప్రతినిధులు, అధికారుల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకున్నా వారే లేరు.

మంచినీటికి కటకట

మెట్ట ప్రాంత ప్రజల దాహార్తి తీర్చే శ్రీసత్యసాయి మంచినీటి సేవా పథకం కార్మికులకు ఐదేళ్లుగా జీతాలు లేక విలవిలాడుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాలుగు నియోజకవర్గాల పరిధిలో 15 మండలాలకు తాగునీరు సరఫరా అవుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్ల క్రితం కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో సుమారు ఏడాది పాటు నీటి సరఫరా నిలిచిపోయింది. ప్రతిపక్షాల పోరాటాలతో ఎట్టకేలకు పథకం కొనసాగిం చారు. ప్రస్తుతం ఐదు నెలల నుంచి మంచినీటి పథకం కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో నానా తంటాలుపడుతున్నారు.

నియోజకవర్గంలో ప్రధాన రహదారులన్నీ అధ్వానంగా ఉన్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల మండల రహదారులు ప్రమాదకరంగా ఉన్నాయి. వాహనదారులు ఈ రహదారుల వెంబడి వెళ్లేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మండల కేంద్రమైన ద్వారకాతిరుమలతో పాటు పరిసర గ్రామాల రహదారులు గుంతలు పడి, రాళ్లు లేచి కనీసం నడిచేందుకు వీలులేని పరిస్థితిలో ఉన్నాయి. తిమ్మాపురం నుంచి

రామన్నగూడెం, తిరుమలంపాలెం నుంచి రాజుపాలెం మీదుగా మారంపల్లి రహదారి, పంగిడిగూడెం – వేంపాడు రహదారులు పూర్తి అధ్వానంగా మారాయి. ఐదేళ్లుగా రహదారుల నిర్మాణం కాదు కనీసం మరమ్మతు పనులు కూడా చేపట్టలేదు.

నెరవేరని హామీలు

పామాయిల్‌ రైతులకు తెలంగాణ కంటె అధిక ధరలు ఇస్తామని జగన్‌ హామీ ఐదేళ్లుగా అమలుకు నోచుకోలేదు.

పోలవరం ప్రాజెక్ట్‌లో భాగమైన కుడి కాల్వకు భూములు ఇచ్చిన రైతులకు రూ.5లక్షలు ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు.

దేవరపల్లి మండలంలో పోలవరం కుడి ప్రధాన కాల్వపై లక్ష్మీపురం వద్ద ప్రజల రాకపోకల నిమిత్తం నిర్మించాల్సిన వంతెన నిర్లక్ష్యం చేశారు.

కోరుమామిడి, చిక్కాల ప్రధాన రహదారి నిర్మిస్తానని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పలుమార్లు భూమిపూజలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేసుకున్నారు. పనులు మాత్రం చేపట్టలేదు.

నల్లజర్ల మండలంలో పోతవరం నుంచి పుల్లలపాడు వరకు ఎర్రకాల్వ, కుడి కాల్వ నిర్మాణం పనులు గాలికొదిలేశారు.

మెట్ట ప్రాంత ప్రజల దాహార్తి తీర్చేందుకు శ్రీసత్యసాయి మంచినీటి సేవా పథకం కార్మికులకు వేతనాల చెల్లింపులో ముప్పు తిప్పలు పెడుతున్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో నల్లజర్లలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌కు బస్సులు రాకపోకలు లేవు. ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోరు.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల మండలంలో రహదారులు అధ్వానం. రహదారుల నిర్మాణంపై ఐదేళ్లుగా పట్టనట్లు గడిపేశారు.

Updated Date - May 03 , 2024 | 12:26 AM