గోపాలపురం టీడీపీ కంచుకోట
ABN , Publish Date - May 06 , 2024 | 12:08 AM
తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత గోపాలపురంలో నియోజకవర్గంలో జరిగిన 9 ఎన్నికల్లో 7 సార్లు సైకిల్ హవా కొనసాగింది.
టీడీపీ ఆవిర్భావం తర్వాత 9 ఎన్నికలు
ఏడు సార్లు సైకిల్ హవా
ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన గోపాలపురంలో నియోజకవర్గంలో తొలి రెండు దశాబ్దాలు కాంగ్రెస్, స్వతంత్ర ఎమ్మెల్యేలు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో జరిగిన 9 ఎన్నికల్లో 7 సార్లు సైకిల్ హవా కొనసాగింది. 1962లో ఏర్పడిన నియోజకవర్గం ఆది నుంచి ఎస్సీ రిజర్వుడు స్థానమే. మొదటి ఇరవై ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధి లేదు. రోడ్లు, తాగునీరు లేవు, కనీసం వీధిలైట్లు కూడా వెలగని పరిస్థితి. 1984లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏమిటో ప్రజలకు తెలిసింది. మారుమూల పల్లెలకు సైతం రహదారులు, తాగునీటి కుళాయిలు, వీధిలైట్లు ఏర్పాటు చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి మాటే లేదు. ప్రజలు విద్య, వైద్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గోపాలపురం, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో పొగాకు సాగు విస్తీర్ణం అధికం. బ్యారన్‌లో అగ్నిప్రమాదల సమయంలో రైతులు సర్వం కోల్పోతున్నారు. అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుపై రైతుల విజ్ఞప్తిని పాలకులు పట్టించుకోలేదు. ఐదేళ్లుగా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నియోజకవర్గంలో మరోసారి అభివృద్ధి సైకిల్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
– గోపాలపురం
గోపాలపురం నియోజకవర్గం ఏర్పడి నేటికి 62ఏళ్లు. 1962లో ఏర్పడిన గోపాలపురం నియోజకవర్గం ఆది నుంచి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం. 1962 నుంచి 78 వరకు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఒక స్వంతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. 20 ఏళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. 1983లో టీడీపీ ఆవిర్భావం అనంతరం ఆ పార్టీ అప్రతిహతంగి విజయాలు సాధించింది. ఆ పార్టీ నుంచి మొదట కారుపాటి వివేకానంద ఎమ్మెల్యే కావడంతో ఎన్‌టీ రామారావు స్ఫూర్తితో మారుమూల పల్లెలకు సైతం రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లో వీధిలైట్లు, ప్రజల దాహార్తి తీర్చేందుకు నీటి కుళాయిలు ఏర్పాటయ్యాయి. దీంతో గోపాలపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పారీక్టి ప్రజలు వెన్నుదన్నుగా నిలిచారు. టీడీపీ ఆవిర్భావం అనంతరం జరిగిన 9 ఎన్నికల్లో 7 సార్లు ఆ పార్టీ వారే గెలుపొందారు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కనీస సౌకర్యాల కల్పనలో భాగంగా రహదారులు, పక్కా గృహాలు ఏర్పాటు చేశారు. ముళ్లపొదలతో ఉన్న బీడు భూములు నేడు పంట పొలాలతో సస్యశ్యామలం అయ్యాయి. గత ఐదేళ్లుగా తిరిగి అభివృద్ధి మందగించింది.
అరకొర వైద్యం
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో అరకొర వైద్య సదుపాయాలతో పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సరైన వైద్యం పొందాలంటే సుమారు 50 కిలోమీటర్లు దాటి రాజమహేంద్రవరం వెళ్లాల్సిందే. ఈ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నా లేనట్టే. సూది ఉంటే దూది ఉండదు. అరకొర మందులు పూర్తి స్థాయిలో లేని సిబ్బంది కేవలం ఆకారానికే పరిమితమైన ఆసుపత్రుల్లో అందని అందని వైద్యంతో ఈ ప్రాంత ప్రజలు సరిపెట్టుకోవల్సి వస్తుంది. జాతీయ రహదారిపై ప్రమాదాల్లో క్షతగాత్రులను దూరప్రాంత ఆస్పత్రులకు తరలించాల్సిందే. నియోజకవర్గం ఏర్పడి సుమారు 62 ఏళ్లు అవుతున్నా పూర్తి స్థాయిలో వైద్యం అందని పరిస్థితి నెలకొంది.
పొగాకుకు పొంచివున్న అగ్గి ముప్పు
గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో వేలాది ఎకరాల్లో పొగాకు పంట సాగు చేస్తున్నారు. పొగాకు క్యూరింగ్ సమయాల్లో అగ్నిప్రమాదాలు జరగడం లక్షలాది రూపాయల పొగాకు బూడిదవడం ఏళ్ళ తరబడి జరుగుతూనే ఉంది. పార్టీలు, ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న ఈ ప్రాంతంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కాకపోవడం రైతాంగానికి శాపంగా మారింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గానికి అగ్నిమాపక కేంద్రం మంజూరు అయ్యిదని ప్రచారం జరగడంతో ఈ ప్రాంత రైతాంగం ఊపిరి పీల్చుకున్నారు. కార్యరూపం దాల్చేసరికి ప్రభుత్వం మారింది. అనంతరం వైసీపీ ప్రభుత్వం మరోసారి దేవరపల్లి మండలం రామన్నపాలెంలో అగ్నిమాపక కేంద్రం నిర్మిస్తున్నామని చెప్పారు. స్థల సేకరణ పూర్తయిందని చెప్పడంతో రైతులు సంతోషించారు. తీరా చూస్తే అది ఎన్నికల ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణకు నోచుకోలేదు.
చిన వెంకన్న ఆలయం జిల్లా మారింది
చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం ఏలూరు జిల్లాకు అప్పగించారు. ద్వారకా తిరుమల మండలం గోపాలపురం నియోజకవర్గం అయినప్పటికీ స్థానికుల విజ్ఞప్తి ఆందోళన మేరకు ఏలూరు జిల్లాలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ప్రసిద్ధి చెందిన ఆలయం కావడంతో చిరు వ్యాపారులు, ఇతర అనుబంధ వ్యాపారాలతో స్థానికులకు ఉపాధి అవకాశాలు బాగానే ఉన్నాయి. జిల్లా మార్పుతో నియోజకవర్గ ప్రాధాన్యం తగ్గిందనే చెప్పవచ్చు. వాస్తవంగా గోపాలపురం నియోజకవర్గ అభివృద్ధికి వనరుల కొరత తీవ్రం. ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. వ్యవసాయాధారిత ప్రాంతమైనా పామాయిల్, పొగాకు సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు. విద్యావకాశాలు కూడా అంతంతమాత్రం కావడంతో విద్య, ఉపాధి నిమిత్తం యువత వలసపోతున్నారు.
అందని ఉన్నత విద్య
ఏజెన్సీ మెట్ట ప్రాంతానికి ముఖ ద్వారంగా ఉన్న గోపాలపురం నియోజకవర్గంలో ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారింది. ఉన్నత విద్య అభ్యసించేందుకు కళాశాలలు లేకపోవడంతో ఈ ప్రాంత విద్యార్థులు ఇంటర్మీడియట్ తర్వాత వలస పోవలిసిందే. ఉన్నత చదువు పూర్తి చేసినవారికి ఉపాధి అవకాశాలు లేక ఇళ్లకే పరిమితమై చేతి వృత్తులలో కొనసాగుతున్నారు.