Share News

అమ్మో.. బంగారం

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:12 AM

పసిడి ధర పరుగులు పెడుతోంది. నెల రోజుల నుంచి ఎక్కడా ఆగడం లేదు. ఆల్‌టైం రికార్టులను చెరిపేస్తూ దూసుకు పోతోంది. మంగళవారం గ్రాము బిస్కెట్‌ బంగారం రూ.7,100 పలికింది. కాసు (ఎనిమిది గ్రాములు) ధర అయితే రూ.56,800 చేరింది. ఆర్నమెంట్‌ బంగారం గ్రాము రూ.6,570 ఉంది. కాసు అయితే రూ.52,560 .

అమ్మో.. బంగారం

పసిడి ధర పరుగులు

ఆల్‌టైం రికార్డులు దాటుతూ..

పది గ్రాముల బిస్కెట్‌ ధర 71,000

నరసాపురం, ఏప్రిల్‌ 2: పసిడి ధర పరుగులు పెడుతోంది. నెల రోజుల నుంచి ఎక్కడా ఆగడం లేదు. ఆల్‌టైం రికార్టులను చెరిపేస్తూ దూసుకు పోతోంది. మంగళవారం గ్రాము బిస్కెట్‌ బంగారం రూ.7,100 పలికింది. కాసు (ఎనిమిది గ్రాములు) ధర అయితే రూ.56,800 చేరింది. ఆర్నమెంట్‌ బంగారం గ్రాము రూ.6,570 ఉంది. కాసు అయితే రూ.52,560 .

ధర పెరుగుదలకు అనేక కారణాలు

ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థల పతనం, అమెరికా ఫెడరల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను మరోసారి తగ్గిస్తుందన్న వాదనలు, ఇటు అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరల ప్రభావం కూడా పసిడిపై పడింది. మరోవైపు మనదేశంలో ఎన్నికల నేపథ్యంలో కొనుగోళ్లు భారీగా పడిపోయాయి. వీటి న్నంటికి తోడు స్టాక్‌ మార్కెట్‌ల్లో కూడా తీవ్ర ఒడిదుడుకులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మదుపుదారులు పసిడిపై పెట్టుబడులు పెట్టేం దుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే ధరలు పెరుగు తున్నాయని బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ధర ఇలాగే పెరుగుతూ ఉంటూ ఈ ఏడాది చివరికి గ్రాము రూ.8 వేలు చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

దుకాణాలు వెలవెల

రాష్ట్రంలో పసిడి మార్కెట్‌కు పశ్చిమ పెట్టింది పేరు. జిల్లాలోని నరసా పురం, భీమవరం, తణుకు, టీపీగూడెం ప్రాంతాల్లో ఎక్కువ జ్యూయలరీ షాపులు ఉన్నాయి. వీటిలో నరసాపురం మార్కెట్‌లోనూ రోజుకు రూ.5 కోట్లు పైనే వ్యాపారం జరుగుతుంది. సీజన్‌ అయితే రెట్టింపు ఉంటుంది. ఇక్కడ 150కుపైగా దుకాణాలు ఉన్నాయి. తరువాత స్థానం భీమవరానిదే. కార్పొరేట్‌ బులియన్‌ షోరూలన్నీ ఇక్కడే ఉన్నాయి. నెల రోజుల నుంచి ధర పెరుగుతూ ఉండటం వల్ల ఆప్రభావం మార్కెట్‌పై పడింది. ఈకారణంగా పసిడి దుకాణాలు వెలవెల బోతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ అయినప్పటికీ కొనేందుకు ఎవరూ సాహసించడం లేదు.

అంతర్జాతీయ పరిణామాలే కారణం

– అజిత్‌కుమార్‌ జైన్‌, జిల్లా బులియన్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు

పసిడి ధర పెరుగుదలకు అంతర్జాతీయ పరిణామాలే కారణం. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ఫెడరల్‌ బ్యాంకు వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అనుమానాలతో చాలామంది మదుపుదారులు బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు.ఇవికాకుండా ఇటీవల రష్యాలో జరిగిన కాల్పుల సంఘటన కూడా ఒక కారణం.

మూడేళ్లలో రెట్టింపు అయింది

– సుధా అన్నపూర్ణ, గృహిణి, నరసాపురం

కొవిడ్‌ తరువాత పసిడి ధర ఎక్కడా దిగి రావడం లేదు. 2019లో గ్రాము రూ.3,500 ఉండేది. నేడు రెట్టింపు అయింది. కేవలం నాలుగేళ్ళల్లో ఈ స్ధాయిలో పెరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఎప్పటికప్పుడు తగ్గితే కొందామని ఎదురుచూశాం. అంచనాల తలక్రిందులు చేస్తూ బంగారం పెరిగిపోతుంది. ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు పసిడి ధర అందనంత ఎత్తుకు వెళ్లిపోయింది

Updated Date - Apr 03 , 2024 | 12:12 AM