ఇక నిర్మాణ రంగంలో జోష్
ABN , Publish Date - Jul 05 , 2024 | 12:18 AM
కొద్ది రోజుల్లోనే ఇసుక కష్టాలు తీర బోతున్నాయి. ఇన్నాళ్ళు ఇసుకకు ధరకట్టి ఒక వైపు జగన్ సర్కార్.. ఇంకోవైపు దళారులు ఇష్టానురాజ్యం చేశారు. కోట్లకు కోట్లు కొల్లగొట్టారు. గోదావరి ఇసుకతో పాటు వాగులు, వంకలను ఎక్కడా వదిలి పెట్టలేదు. అయినా ఇసుక సంతృప్తికర రీతిలో అందుబాటులో లేక పోయింది.

త్వరలోనే ఉచిత ఇసుక విధానం అమలు
ఐదేళ్లు ఇసుక పేరిట నిలువు దోపిడీ
అయినోళ్ళకే అంతా కట్టబెట్టారు
కోలుకోలేనంతగా దెబ్బతిన్న నిర్మాణ రంగం
లక్షలాది కుటుంబాలు ఎక్కడికక్కడ వలస
కూటమి ప్రభుత్వ నిర్ణయంతో కోలుకోనున్న రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం
ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి :
కొద్ది రోజుల్లోనే ఇసుక కష్టాలు తీర బోతున్నాయి. ఇన్నాళ్ళు ఇసుకకు ధరకట్టి ఒక వైపు జగన్ సర్కార్.. ఇంకోవైపు దళారులు ఇష్టానురాజ్యం చేశారు. కోట్లకు కోట్లు కొల్లగొట్టారు. గోదావరి ఇసుకతో పాటు వాగులు, వంకలను ఎక్కడా వదిలి పెట్టలేదు. అయినా ఇసుక సంతృప్తికర రీతిలో అందుబాటులో లేక పోయింది. ఫలితంగా.. నిర్మాణరంగం గడిచిన ఐదేళ్లలో కుప్పకూలి కోలుకోలేనంతగా దెబ్బ తింది. ఈ రంగాన్ని నమ్ముకుని ఉన్న వేలాది నిర్మాణ రంగ కార్మిక కుటుంబాలు వీధిన పడ్డాయి, అప్పుల పాలయ్యాయి. కూటమి ప్రజా ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే గతంలో మాదిరి ఉచిత ఇసుక విధా నాన్ని తిరిగి అమలు చేయ బోతోంది. ఈ నిర్ణయం నిర్మాణరంగంలో కోటి ఆశలు పెంచింది.
అప్పనంగా ఇసుకను మేసేశారు
గడిచిన ఐదేళ్లల్లో అధికార పార్టీలో ఎవరుంటే వారిదే ఇష్టా రాజ్యం. గోదావరి ఒడ్డున ఇసుక అక్రమంగా తరలించుకు పోవచ్చు. తమ్మిలేరు, ఎర్రకాల్వలో ఇసుక రాత్రికి రాత్రే టన్నులకొద్ది లాగించి వేయవచ్చు. దొరికినంత ఇసుకను అడ్డంగా మేసేయొచ్చు. దీనిని పర్యవేక్షించాల్సిన శాఖలు ఎక్కడికక్కడ గప్‌చిప్, అధికారుల చేతికి ఎంత... మాకెంత..... అనే రీతిలో ఇసుక పేరిట మాఫియా ముఠాలు చెలరేగి పోయాయి. అడ్డువస్తే తొక్కించుకుంటూ వెళ్లు అనే సూత్రాన్ని పాటించాయి. అక్రమ కేసులు బనాయించారు. అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవడానికి ప్రయత్నించినా కుటుంబాలపై అధికార మదంతో పెచ్చరిల్లిపోయారు. పోలీసులు అక్ర మార్కులను చూసీచూడనట్లుగా వదిలేసి వీరికి అడ్డు తగిలిన వారిపైనే ఎక్కడికక్కడ పెత్తనం చేశారు. ఇంత జరిగినా నిర్మాణరంగం ఎక్కడా ముందుకు పోలేదు. ఐదేళ్ల కాలంలో అన్నిరంగాల మాదిరిగానే నిర్మాణరంగం పూర్తిగా దెబ్బతింది. ఈ మధ్యకాలంలో జరిగింది ఏమిటంటే జగనన్న కాలనీలకు సంబంధించి ఇసుక రవాణాను అడ్డంగా తరలించారు. పనిలో పనిగా తమకు అయిన వారికి మాత్రమే ఇసుకను అందు బాటులోకి తెచ్చారు. మిగతా వారిని అధిక ధరలతో వెక్కిరిం చారు. పదేపదే ఇసుకకు కృత్రిమ కొరత సృష్టించి ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ఒక రకంగా, బయట విక్రయిం చిన ధర ఇంకోరకంగా ఉండేలా చూసి ఆ మేరకు ప్రజా సొమ్మును దోచుకున్నారు. ఇంతలా వ్యవస్థను అపహాస్యం చేశారు. ఆఖరికి పోలవరం కుడి కాల్వలోనూ ఉన్న ఇసుకను, పట్టిసీమ డెలివరీ పాయింట్ వద్ద పేరుకు పోయిన ఇసుకను వదిలిపెట్టలేదు. ప్రత్యేక వాహనాలతో ఇసుకను తరలించారు. ఐదేళ్ల పాటు తమ్మిలేరులో ఇసుక దోపిడీ కొనసాగింది. దెందులూరు నియోజకవర్గంలో ఈ దందాకు అంతుపంతూ లేకుండా పోయింది. ఇసుక కోసం పడిన కష్టాలు గుర్తు తెచ్చుకుని ఇప్పటికి జనం బావుర మంటారు.
ఇప్పుడేం జరగబోతోందంటే..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చకచకా అమలులోకి తెస్తోంది. నిన్నటికి నిన్న పెరిగిన పింఛన్ల పంపిణీ సాగింది. కొద్దిరోజుల్లోనే అందరికి ఉపయుక్తమైన ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తోబోతోంది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే అటు నిర్మాణ రంగంలో, ఇటు కార్మికరంగంలో ఒక్క సారిగా సంతృప్తి వ్యక్తమైంది. ఇన్నాళ్ళు కుదేలైన నిర్మాణ రంగం ఇక ముందు నిలదొక్కుకోవడానికి అనుకూలంగానే తద్వారా లక్షలాది కుటుంబాలకు రోజువారి ఉపాధి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వారంలోనే ఉచిత ఇసుక విధా నాన్ని అమలులోకి తేబోతున్నారు. ఇప్పటికి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇసుక అందుబాటులో లేకపోయినా ఉన్నంతలోనే నిర్మాణరంగంలో వినియోగదారులకు అనువుగా చర్యలు తీసు కోబోతున్నారు. ప్రత్యేకించి ఇసుకను ఉచితంగా ఇచ్చి రవాణా ఛార్జీలను ఆయా బాధ్యత గల వ్యక్తులే భరించేలా చర్యలు తీసుకోబోతున్నారు. వాస్తవానికి ఇప్పటికే వర్షాకాలం ఆరంభం కావడంతో అన్ని జలవనరులలోనూ ప్రవాహం పెరిగింది. ఇసుకను ఈ మూడునెలలు వెలికితీయడం అత్యంత దుర్లభ మే. అయినప్పటికి ఉచిత ఇసుక విధానాన్ని తక్షణం అమల్లోకి తేవాలని కూటమి నిర్ణయించి, ఆ మేరకు తుది కసరత్తుకు దిగింది. ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో నిల్వ చేసిన ఇసుక ను కొత్త విధానంలోకి చేర్చి పంపిణీ చేయబోతున్నారు. జిల్లాలో పోలవరం సమీపాన ఉన్న గూటాలలోనే ఏకైక ఇసు క ర్యాంపు ఉంది. ఇవి తప్ప మిగతా ఎక్కడా ఈ జిల్లా పరిధి లో ఇసుక ర్యాంపులు లేనే లేవు. అయితే తమ్మిలేరు, ఎర్ర కాల్వతో పాటు మరికొన్ని వాగుల్లోనూ అక్కడక్కడ పేరుకు పోయి ఉన్న ఇసుకను ఇప్పటికే ఎండ్లబండి ద్వారా తరలించి కొందరు సొమ్ము చేసుకున్నారు. తమ్మిలేరులో దెందులూరుకు చెందిన వైసీపీ అనుకూలురు ఈ ఐదేళ్లు ఎడాపెడా ఇసుకను బొక్కారు. కలెక్టర్ స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేసినా అక్రమ ఇసుక రవాణాను ఆపలేకపోయారు. ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కైకలూరు వంటి ప్రధాన ప్రాంతాల్లో నిర్మాణ పనులు గడిచిన ఐదేళ్లుగా మందకొడిగా సాగాయి. ఒక్క జగనన్న లేఅవుట్‌లో మాత్రమే ఇళ్ళనిర్మాణం కొంతలో కొంత పూర్తి చేయగలిగారు. మిగతా అన్నిచోట్ల ప్రైవేట్ వ్యక్తులు ఇళ్ల నిర్మాణం జోలికే వెళ్ళలేక పోయారు. ఇసుక కొరత కారణంగా ఇన్నాళ్లు నిర్మాణ వ్యయం రెండింతలైంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఒక్క ఏలూరు జిల్లాలోనే దాదాపు లక్షా 25 వేలకు పైగా నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ప్రస్తుతానికి నిలిచే ఉన్నాయి. ఇప్పుడు ఇసుక అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇక్కడి నిర్మాణం పుంజుకునేందుకే అవకాశం ఉంది.
నిర్మాణ రంగ కార్మికులకు మంచి రోజులు
ఇన్నాళ్లు నిర్మాణ పనులు ఏమీ లేక చతికిలపడిన ఈ రంగంలో ఉన్న అనేక మంది భవన నిర్మాణ కార్మికులు పనులు లేక తీవ్ర కష్టాలు ఎదుర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల సంఖ్య దాదాపు 2లక్షలకు పైబడే ఉంది. ఆయా కుటుంబాలు అన్ని ఇక్కడ పనులు లేక చాలావరకు హైదరాబాద్ వంటి నగరాలకు తరలిపోయారు ఇంకొన్ని కుటుంబాలైతే చేతినిండా పనిలేక పస్తులు ఉన్న దాఖలాలు లేక పోలేదు. దీనికితోడు జగన్ ప్రభుత్వంలో కార్మిక వెల్ఫేర్ బోర్డు పూర్తిగా నిర్వీర్యమైంది. కనీసం భవన నిర్మాణ కార్మికులను ఆదుకునే ధ్యాస అప్పట్లో ఆ ప్రభు త్వానికి లేకుండానే పోయింది. కాని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేనుండడంతో భవననిర్మాణ కార్మికరంగ కుటుంబాల్లో హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుటుంబ సభ్యులు ఎవరూ ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సిన పనిలేదని, ఉన్నంతలోనే ఇక్క డి నిర్మాణాలు పుంజుకుంటే తమకు పనికి లోటు ఉండదన్న ఆకాంక్ష వారిలో కనిపిస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయం కాంట్రాక్ట్‌ర్‌లకు కూడా అతిగొప్ప రిలీఫ్‌గా భావిస్తున్నారు.