Share News

ముంపు ముప్పు

ABN , Publish Date - Jul 08 , 2024 | 12:23 AM

వర్షాకాలం గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను వరద భయం వెన్నాడుతుంది.

ముంపు ముప్పు
నరసాపురం వద్ద ఏటిగట్టుకు తడికలతో తాత్కాలిక అడ్డుకట్ట

గోదావరి వరద వస్తే.. పంట పొలాల మునక ?

వైసీపీ పాలనలో ఏటిగట్టు పనులపై నిర్లక్ష్యం

శిథిలావస్థలో స్లూయిస్‌లు

టీడీపీ కూటమి కొలువుతీరగానే గోదావరి గట్టుపై దృష్టి

రూ.30.50 కోట్లతో పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు

వర్షాకాలం వరద భయంతో గోదావరి తీరం బిక్కుబిక్కుమంటుంది. దీనికితోడు ఏటిగట్టు బలహీనపడడం, నరసాపురం వద్ద కోతకు గురికావడం, పలు మండలాల్లో స్లూయిస్‌లు శిథిలావస్థకు చేరడంతో ముంపు ముప్పు పొంచివుంది. వైసీపీ పాలనలో ఐదేళ్లుగా ఏటిగట్టు పటిష్ఠతకు తట్ట మట్టికూడా వేయకపోవడంతో ఈ పరిస్థితి దాపురించింది. నరసాపురం పట్టణం పొన్నపల్లి వద్ద 400 మీటర్ల ఏటిగట్టు కోతకు గురైనా అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఏటిగట్టు పటిష్ఠం చేసే పనులు పూర్తి కాలేదు. తాత్కాలిక ఏర్పాట్లతో నెట్టుకొచ్చారు. ఇటీవల అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ముంపు ముప్పును గ్రహించి తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు చొరవతో అధికారులు రూ. 30.50 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధులు మంజూరు కాగానే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

నరసాపురం, జూలై 7: వర్షాకాలం గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను వరద భయం వెన్నాడుతుంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో బిక్కుబిక్కు మంటూ గడుపుతారు, మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే ఆ ప్రభావం గోదావరిపై పడుతుంది. ఇప్పటికే గోదావరికి వరద నీరు తాకింది. రానున్న రెండు నెలల్లో భారీ స్థాయిలో వరద వస్తే ముంపు ముప్పు పొంచిఉంది. గత ఐదేళ్లలో గోదావరి ఏటిగట్టు పటిష్ఠతకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు, పలుచోట్ల గట్టు బలహీనపడినప్పటికీ కనీసం తట్టడు మట్టి కూడా వేయలేదు. మరోవైపు వరదను నియంత్రించే స్లూయిస్‌లు శిథిలావస్థకు చేరాయి. వీటిని ఆధునీకరించాలని ఇంజనీర్లు నివేదించినా కనీసం నిధులు కూడా విడుదల చేయలేదు. పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభు త్వం గుర్తించింది. జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అదేశాలతో అధికారులు ఆఘమేఘాలపై ప్రతిపాదనలు తయారు చేశారు. స్లూయిస్‌ పటిష్టత పనులకు రూ 9 కోట్లు, సుమారు 11 కిలోమీటర్ల మేర గట్టు పటిష్టత, పెండింగ్‌ పనుల పూర్తికి రూ. 21.50 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు ప్రభుత్వానికి పంపారు. నిధులు మంజూరైతే వేగవంతంగా ఈ పనులు చేపట్టేందుకు సన్నద్ధమవుతున్నారు.

11 కిలోమీటర్ల మేర గట్టు బలహీనం

జిల్లాలో దొంగరావిపాలెం నుంచి నరసాపురం మండలం బియ్యపుతిప్ప వరకు సుమారు 60 కిలోమీటర్ల మేర ఏటిగట్టు విస్తరించింది. 1986 వరదలను పరిగణనలోకి తీసుకుని 2007లో గోదావరి గట్టును పటిష్టం చేశారు. మూడు కిలో మీటర్ల పనులు అసంపూర్తిగా నిలిచాయి. వరదల సమయంలో ఇసుక బస్తాలతో తాత్కాలిక చర్యలు చేపడుతున్నారు. గడిచిన ఏడేళ్లలో దొడ్డిపట్ల, వాకలగరువు, ఆబ్బిరాజుపాలెం, గంగడపాలెం, యలమంచిలి, లక్ష్మీపాలెం, చించినాడ, రాజుల్లంక వద్ద వరద ప్రవాహానికి గట్టు బలహీనపడింది. భారీ వరదొస్తే ఈప్రాంతాల్లో నీరు గట్టుపై నుంచి ప్రవహించే ప్రమాదం ఉంది. ఈ గ్రామాల్లో గట్టును పటిష్టపర్చడంతో పాటు ఎత్తు పెంచాల్సి ఉంది. ఈపనులకు గతంలో ప్రతిపాదనలు పంపినా నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం పనులకు రూ 21.50 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వానికి నివేదించారు.

నరసాపురం వద్ద 250 మీటర్లు పెండింగ్‌

2022 వరదలకు నరసాపురం పట్టణంలోని పొన్నపల్లి వద్ద ఏటిగట్టు 400 మీటర్ల మేర కోతకు గురైంది. గట్టు పటిష్టం చేయడానికి రూ.27 కోట్లు మంజూరు కావడంతో 2022లో పనులకు శంకుస్థాపన చేశారు. పనులు చేపట్టినప్పటికీ గట్టు పలుసార్లు కోతకు గురైంది. ఇప్పటివరకు 150 మీటర్ల మేర గట్టును అభివృద్ధి చేశారు. వరదొస్తే ఈ పనుల్లో నాణ్యత స్థాయి తేలనుంది. ఇంకా 250 మీటర్ల పెండింగ్‌ ఉంది. ప్రస్తుతం కోతకు గురైన ఈ ప్రాంతంలో సరుగుడు కర్రలు పాతి తాత్కాలికంగా తడికెలు కట్టారు. తక్షణం ఈ పనులు చేపట్టకపోతే పెనుముంపు తప్పదు.

శిథిలావస్థలో స్లూయిస్‌లు

వరదల సమయంలో స్లూయిస్‌ల కారణంగా భారీ ముంపు సంభవిస్తుంది. గోదావరికి ఆనుకుని ఉన్న కాజ, నరసాపురం వద్ద ఐదు తూములు, ముస్కే పాలెం, బియ్యపుతిప్ప ఈస్ట్‌కొక్కిలేరు, దర్భరేవు స్లూయిస్‌లు శిఽథిలావస్థలో ఉన్నాయి. గతంలో టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం ప్రభుత్వం వీటి ఆధునీకరణకు 9 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేశారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం

వరద నియంత్రణకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టాం. ఇసుక బస్తాలు సిద్ధం చేస్తున్నాం. గట్టు బలహీనంగా ఉన్న చోటికి వీటిని తరలిస్తున్నాం. ఈనెల 1 నుంచి 9 మంది లస్కర్లను విధుల్లోకి తీసుకున్నాం, బలహీనంగా ఉన్న 11 కిలోమీటర్ల గట్టు, ఐదు స్లూయిస్‌లను ఆధునీకరించాలని ప్రభుత్వానికి నివేదించాం. మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో రూ.30.50 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చాం.

– సుబ్బారావు, ఏఈ, ఏటిగట్టు శాఖ

పశ్చిమ డెల్టాకు మంచి రోజులు

కాలువలు, డ్రెయిన్ల ప్రక్షాళనకు టెండర్ల ఖరారు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పశ్చిమ డెల్టాకు మంచి రోజులొచ్చాయి. గత ఐదేళ్లలో పంట కాలువలు, డ్రెయిన్లను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వేసవి పనులు సక్రమంగా చేయలేదు. పనులు చేసినా బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డెల్టాపై దృష్టి పెట్టింది. కాలువలు, డ్రెయిన్‌లు ప్రక్షాళనకు నిధులు కేటాయించింది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే డెల్టాలో కాలువలు, డ్రెయిన్లకు రూ. 13 కోట్లు నిధులు కేటాయించారు. పనులకు టెండర్లు కూడా ఖరార య్యాయి. మరోవైపు తూడు, గుర్రపు డెక్క పనులు ప్రారంభించారు. పక్షం రోజుల్లో కాలువలు, డ్రెయిన్లలో పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశిం చారు. ప్రధానంగా తూడు. గుర్రపు డెక్క తొలగించి డ్రెయిన్‌లతో పూడిక తొలగించడం ద్వారా పంట పొలాలు మునకనుంచి గట్టెక్కనున్నాయి. ప్రస్తు తం జిల్లాలో కొద్దిపాటి వర్షాలు కురిస్తేనే పంట పొలాలు ముంపుబారిన పడుతున్నాయి. డ్రెయిన్లు ప్రవహించకపోవడంతో పంట పొలాల నుంచి నీరు బయటకు వెళ్లడం లేదు. ఐదేళ్లుగా డ్రెయిన్‌లు పూడుకుపోయాయి. వెసీపీ ప్రభుత్వం బిల్లులు చెల్లించదనే అనుమానం కాంట్రాక్టర్లలో నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే బిల్లులు కూడా ఇవ్వలేదు. రైతులు చెల్లించిన నీటి తీరువా పక్కదారి పట్టించింది. రైతులకు ప్రయోజనం చేకూర్చే కాలువల మరమ్మతులకు ఉపయోగించలేదు. జలవనరుల శాఖ గడచిన ఐదేళ్లు చీకటి రోజులను చూసింది. అధికారులు పనులు చేపట్టలేని చేతకాని వారిలా మిగిలిపోయారు. వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా నిస్సహాయస్థితిలో ఉండిపోయారు. కూటమి ప్రభుత్వం అత్యవసరంగా కాలువలు, డ్రెయిన్‌లలో దాదాపు 100 పనులు చేపట్టేలా చర్యలు తీసుకున్నారు.

Updated Date - Jul 08 , 2024 | 12:23 AM