రూప్‌చంద్ అ‘ధర’హో!
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:15 AM
ఆక్వా రైతు ఆనందపడుతున్నాడు. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించింది.
కేజీ రూ.122
రైతుల ఆనందం
కేజీకి సుమారు రూ.20 లాభం
నిడమర్రు అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆక్వా రైతు ఆనందపడుతున్నాడు. నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రైతు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించింది. జూలై నెల నుం చి అత్యధిక ధరలు పలుకుతున్నాయి. దసరా పండుగు రోజుల్లో అసాఽధారణంగా రూప్‌చంద్ చేపకు అత్యధికంగా రూ.122 ధర పలికింది. సాధారణంగా రూప్‌చంద్ మార్కెట్ జనవరి నుంచి మే నెల వరకు అత్యధిక ధర పలుకుతు ఉంటుంది. జూన్, జూలైలో సముద్రం చేపలు అధికంగా లభించడం, పండుగల వల్ల రేటు తక్కువగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో మార్కెట్లు చలనం కలిగి రేట్లు పెరగడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
రైతుకు గిట్టుబాటు
సాఽధారణంగా కేజీ రూప్‌చంద్ తయారీకి రైతుకు అన్నీ కలిపి రూ. 95– 100 వరకు ఖర్చు అవుతుంది. నేడు మార్కెట్ రేటు పెరగడంతో రైతుకు కేజీ చేప ధర రూ.122 పలుకుతోంది. దీంతో ఒక కేజీకి సుమారు రూ.15 నుంచి రూ. 20 గిట్టుబాటు అవుతోంది. రైతులు తమ చేపల అమ్మకానికి సిద్ధపడుతున్నారు.
తగ్గిన రూప్‌చంద్ సాగు
ఇటీవల వరకు నష్టాల భారంతో ఆక్వా రైతులు చతికిలపడ్డారు. రూప్‌చంద్ చెరువుల సాగు కూడా పూర్తిగా తగ్గిపోయింది. చాలా మంది రైతులు చెరువులను అయినకాడికి లీజు కిచ్చి చేతులు దులుపుకొన్నారు. నేడు ప్రభుత్వ విధానాలు మారడం, చేపల ధరలు కూడా పెరగడంతో మళ్లీ పాత రోజులు వచ్చాయని ఆశపడుతున్నారు. నేడు మేత ధరలు కొంత మేర తగ్గడంతో పాటు మార్కెట్‌ను శాసించే దళారులు లేకపోవడం కూడా చేపల ధరలు పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.