Share News

తొలిరోజు ఏడు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:50 AM

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభం అయింది. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ నోటిఫికేషన్‌ను ఆర్వో, జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ గురువారం విడుదల చేశారు.

తొలిరోజు ఏడు

జిల్లాలో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ నోటిఫికేషన్‌ విడుదల చేసిన

కలెక్టర్‌, ఆర్వో ప్రసన్నవెంకటేశ్‌

ఏలూరు ఎంపీ స్థానానికి ఒకటి.. అసెంబ్లీ స్థానాలకు ఆరు నామినేషన్లు

నామినేషన్‌ స్వీకరణ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

ఏలూరు సిటీ/ఏలూరు రూరల్‌/ దెందులూరు/ నూజివీడు/బుట్టాయగూడెం, ఏప్రిల్‌ 18 : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారం ప్రారంభం అయింది. ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ నోటిఫికేషన్‌ను ఆర్వో, జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ గురువారం విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణ మొదటి రోజున జిల్లాలో ఏలూరు పార్లమెంట్‌కు ఒకటి, అసెంబ్లీ నియోజక వర్గాలకు 6 నామినేషన్లు దాఖలయ్యాయి. కలెక్టర్‌ ఛాంబర్‌లో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌కు ఏలూరు ఎంపీ స్థానానికి లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున మెండెం సంతోష్‌కుమార్‌ నామినేషన్‌ను అందజేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ తరపున ఆళ్ళ కాళీకృష్ణశ్రీనివాస్‌ (నాని) ఏలూరు తహసీల్దార్‌ కార్యాలయంలో నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ముక్కంటికి నామినేషన్‌ దాఖలు చేశారు. దెందులూరు నుంచి ఆలపాటి నరసింహమూర్తి (కాంగ్రెస్‌) మొండూరు నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజానాల రామ్మెహన్‌రావు, పార్టీ నేతలు, కార్యకర్తలతో ర్యాలీగా దెందులూరు వచ్చి నియోజకవర్గ ఆర్వో లావణ్యవేణికి నామినేషన్‌ అందించారు. జిల్లాలోని ఉంగుటూరు, చింతలపూడి, కైకలూరు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించి నామినేషన్లు దాఖలు కాలేదు.

జిల్లాకు కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు..

ఏలూరు సిటి : ఎన్నికల కమిషన్‌ ఏలూరు జిల్లాకు నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు పి.కీర్తి నారాయణ్‌, షెరింగ్‌ జోర్డన్‌ భూటియా, మేశ్రామ్‌ గౌరవ్‌ మధుకర్‌ జిల్లాకు వచ్చారు. గురువారం ఉదయం కలెక్టరేట్‌కు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఛాంబర్‌లో సమావేశమయ్యారు. జిల్లాలోని పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఖర్చుల అంచనా వివరాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం వ్యయ పరిశీలకులు కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలిం చారు. డీఆర్వో పుష్పమణి, కలెక్టరేట్‌ ఏవో కాశీవిశ్వేశ్వరరావు, ఎన్నికల నోడల్‌ అధికారులు , కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల నేపథ్యంలో ఈఎస్‌ఎంఎస్‌ కింద చేపట్టిన సీజర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియ ద్వారా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం గా రూ.13.20 కోట్ల విలువైన నగదు, బంగారం, మద్యం , ఇతర వస్తువులు సీజ్‌ చేసినట్టు కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు. ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ ద్వారా 1,662 అభ్యర్థనలు రాగా ఇంతవరకు 1625 అనుమతులు జారీ చేయగా మరో 37 పరిశీలనలో ఉన్నాయ న్నారు. సీ–విజిల్‌లో వచ్చిన 359 ఫిర్యాదులను, మీడియాలో ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి వచ్చిన 97 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. ఎన్‌జి ఎస్పీ పోర్టల్‌ ద్వారా 597 ఫిర్యాదులు స్వీకరించగా వాటిలో 593 పరిష్కరించ బడ్డాయని , మరో 4 పరిశీలనలో ఉన్నాయన్నారు.

రంగంలోకి స్టాటిస్టికల్‌ బృందాలు

ఏలూరు క్రైం : సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చులను పరిగణించ డానికి ఇప్పటికే ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో ఏర్పాటు కాబడిన ఈ ప్రత్యేక స్టాటిస్టికల్‌ స్పెషల్‌ టీమ్స్‌ గురువారం రంగంలోకి దిగాయి. నామినేషన్లు వేస్తున్న అభ్యర్థులు ర్యాలీలో వినియోగిస్తున్న కార్లు, ఇతర ఖర్చులను పరిశీలిస్తున్నారు. వీరితో పాటు కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాలు రంగంలోకి దిగాయి. ఎన్నికల కమీషన్‌ ఆదేశాలతో త్వరలోనే షాడో పార్టీలను జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే జిల్లాలో ఏర్పాటు చేసిన 31 ప్రత్యేక ఎన్నికల నియమావళి తనిఖీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.

పటిష్ఠ బందోబస్తు

ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద, వివిధ ప్రధాన కూడళ్లల్లో పటిష్ఠ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ నేపఽథ్యంలో కలెక్టరేట్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నగరంలో ముందస్తుగా పోలీస్‌ పికెట్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛ నీయ ఘటనలు జరగకుండా ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకోవా లంటూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Apr 19 , 2024 | 12:50 AM