ఆగిరిపల్లిలో బ్యానర్ రగడ
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:27 AM
ఆగిరిపల్లిలో ఆదివారం రాత్రి టీడీపీ బ్యానర్లను వైసీపీ నాయకులు చించివేయటంతో గొడవ రాజుకుంది.

ఆగిరిపల్లి, జూలై 7: ఆగిరిపల్లిలో ఆదివారం రాత్రి టీడీపీ బ్యానర్లను వైసీపీ నాయకులు చించివేయటంతో గొడవ రాజుకుంది. స్థానిక పొగడచెట్ల మండపం వద్ద ఉన్న టీడీపీ బ్యానర్‌ని వైసీపీ పట్టణ అధ్యక్షుడు చిమట శ్రీను, ఎంపీపీ సాదం గోపి చించివేస్తుండగా అటుగావెళుతున్న టీడీపీ కార్యకర్తలు కాజా కిషోర్, రాణిమేకల మల్లేశ్వరరావు ప్రశ్నించటంతో వైసీపీ నాయకులు వీరిని కొట్టి గాయపర్చారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవటంతో వైసీపీ నాయకులు పారిపోయారు. నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి ఉన్న బ్యానర్‌ను చించి ఆయన్ని అవమాన పర్చినవారు బ్యానర్ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పాలని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా టీడీపీ శ్రేణులు భీష్మించుకొని కూర్చున్నారు. అర్ధరాత్రి దాటినా గొడవ సద్దుమణగలేదు.