ఇసుకపై కసరత్తు
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:32 AM
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి అమలులోకి రానుంది. కూటమి హామీల్లో ఒకటైన ఉచిత ఇసుకపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

బోట్స్‌మెన్ కమిటీలతో సమావేశం కానున్న అధికారులు
ఆ తర్వాతే ధర నిర్ణయం
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి అమలులోకి రానుంది. కూటమి హామీల్లో ఒకటైన ఉచిత ఇసుకపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. స్టాక్ పాయింట్‌లో ఉన్న ఇసుకను ముందుగా సరఫరా చేయాలని ఆదేశించింది. జిల్లాలో నరసాపురం, భీమవరం, పొలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలో స్టాక్ పాయింట్‌లలో ఇసుక నిల్వలు లేవు. మరోవైపు సిద్ధాంతం, కోడేరు, కరుగోరుమిల్లి తదితర ప్రాంతాల్లో ఓపెన్ రీచ్‌లు ఉండగా ప్రస్తుతం కరుగోరుమిల్లి ర్యాంప్‌లోనే తవ్వకానికి అనుమతి ఉంది. మనుషులతో మాత్రమే తవ్వకాలు చేపట్టాలనే నిబంధనతో అక్కడ కూడా తవ్వకాలు లేవు. ఓపెన్ ర్యాంప్‌ల్లో తవ్వకాలు చేపట్టకుండా జిల్లాలో ఆరు కమిటీలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు గోదావరి నదిలో మునిగి తవ్వకాలు సాగించే రీచ్‌లపైనే ఆధారపడాల్సి ఉంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన రీచ్‌ల నుంచి దిగుమతికి అవకాశం ఉంది. జిల్లాలో యలమంచిలి, నరసాపురం పరిధిలో ఆరు రీచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అక్కడే గోదావరిలో మునిగి ఇసుక తీసి పడవలపై ఒడ్డుకు చేర్చాలి. ఆ బాధ్యతను బోట్స్‌మెన్ సొసైటీలకు ప్రభుత్వం అప్పగించింది. బోట్స్‌మెన్ సొసైటీలతో సంప్రదించి తవ్వకంతోపాటు, పడవలపై ఒడ్డుకు చేర్చేలా ధరను నిర్ణయించనున్నారు. సోమవారం నరసాపురంలో జిల్లాలోని బోట్స్‌మెన్ సొసైటీలతో అధికారులు సమావేశమై ధర నిర్ణయిస్తారు. స్టాక్ పాయింట్‌లలో ఉన్న ఇసుకపైనా అదే పరిస్థితి. స్టాక్ పాయింట్‌ల వద్దకు రవాణా వ్యయాన్ని లెక్కించి టన్ను ఇసుక ధర నిర్ణయిస్తారు.
పన్నులు మామూలే
ప్రభుత్వానికి ర్యాంప్‌ల నుంచి లాభసాటి లేకుండా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నారు. సీనరేజీ, జీఎస్టీ, ఇతర పన్నులు మామూలుగా ఉంటాయి. ర్యాంప్‌లు, రీచ్‌ల వద్ద బిల్లులు ఇచ్చేందుకు అవసరమైన వ్యయాన్ని వసూలు చేస్తా రు. ఆ మొత్తాన్ని కలుపుకొని టన్ను ధర నిర్ణయిస్తారు. దాని పై దూరాన్ని బట్టి రవాణా వ్యయం ఉంటుంది. వైసీపీ హయాంలో ఇసుక దందా అంతా ఇంతా కాదు. ప్రైవేటు ఏజె న్సీలకు ప్రభుత్వం ఇసుక తవ్వకాల బాధ్యతను అప్పగించింది. లెక్కా పత్రం లేకుండా తవ్వకాలు సాగించి సీనరేజీ, పన్నులు చెల్లించలేదు. ర్యాంప్ చార్జీలంటూ అదనంగా వసూలు చేశా రు. వైసీపీ నేతలు భారీగా లబ్ధిపొందారు. తాజాగా ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయడంతో ప్రభుత్వానికి వెళ్లాల్సిన సీనరేజీ, జీఎస్టీ, ఇతర వ్యయాలను వసూలు చేసి ప్రభుత్వానికి ఇసుక వల్ల వచ్చే లాభం లేకుండా పంపిణీ చేయనున్నారు. దీనివల్ల వైసీపీ ప్రభుత్వం కంటే తక్కువ ధరకే ఇసుక లభ్యమయ్యే అవకాశం ఉంది.