Share News

పరీక్షా కాలం

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:58 AM

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్య మంత్రి ఆళ్ళ నాని వైసీపీ పక్షాన తిరిగి పోటీ చేస్తుండగా ఆయనపై తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి బడేటి చంటి కాలుదువ్వుతున్నారు.

పరీక్షా కాలం

ప్రచారంలోనూ, బుజ్జగింపుల్లోనూ అందరిది ఒకటే దారి

వైసీపీకి దీటుగా అన్నిచోట్ల నామినేషన్లు

కీలక నియోజక వర్గాల్లో పట్టుదిశగా కూటమి

దెందులూరులో తొలగిన ప్రతిష్ఠంభన

చింతమనేనికే రూట్‌ క్లియర్‌

తపనా చౌదరికి నరసాపురం లోక్‌సభ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు

(ఏలూరు, ఆంధ్రజ్యోతి, ప్రతినిధి):

ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్య మంత్రి ఆళ్ళ నాని వైసీపీ పక్షాన తిరిగి పోటీ చేస్తుండగా ఆయనపై తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన టీడీపీ అభ్యర్థి బడేటి చంటి కాలుదువ్వుతున్నారు. నానిపై పైచేయి సాధిం చేందుకు వ్యూహ ప్రతివ్యూహాల్లో ఉన్నారు. నామినేషన్‌ దాఖ లు సమయంలో ఈ ఇద్దరు అభ్యర్థులు నగరంలో దాదాపు బల నిరూపణకు సిద్ధపడ్డారు. వందలాది మంది కార్యకర్తలతో నగరం కిక్కిరిసింది. ఏలూరు అసెంబ్లీ పరిధిలో అభ్యర్థి నిర్ణే తలు ఇక్కడి నగర ఓటర్లే. ఇక్కడ ఉద్యోగ వర్గాలు, అత్యధి కంగా ఉండటంతో వైసీపీకి గండంగానే పరిణమించింది. దీన్ని తమ వైపు బలంగా తిప్పుకోవడానికి చంటి ప్రయత్నిస్తున్నారు. నగరంతో సహా గ్రామీణ లోనూ పట్టుబిగించారు. వైసీపీలోని సీనియర్లు అనేక మంది టీడీపీ వైపు జంప్‌ చేశారు. దీంతో ఆళ్ళ నాని వర్గం అతిగొప్ప పరీక్షను ఎదుర్కొంటోంది. చింతల పూడిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎలీజాను కాదని, విజయ్‌రాజుకు వైసీపీ టిక్కెట్‌ ఇచ్చింది. ఇక్కడ ఎలీజా బలమెంత? ఆయన ఎంత సంఖ్యలో ఓట్లను చీల్చబోతున్నా రనేది అధికార పార్టీకి పరీక్ష. ఎలీజా కాంగ్రెస్‌లో చేరి చింతలపూడి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో వైసీపీకి సంకటంగా మారింది. దీన్ని అద నుగా తీసుకోవడమే కాకుండా మిగతా వర్గాలను తమవైపు మద్దతుగా తరలిరావడంతో టీడీపీ అభ్యర్థి రోషన్‌కుమార్‌ ఏ రోజుకారోజు ముఖ్యనేతలు, కార్యకర్తలతో సంప్రదించి ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ జనసేన బలీ యంగా ఉండడం, టీడీపీకి కొంత కలిసొచ్చేదిగా ఉండగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎలీజా పోటీ వైసీపీకి సవాల్‌గా మారింది. నూజివీడులో కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథి, వైసీపీ అభ్యర్థి మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా మారబోతోంది. మధ్యలో టీడీపీ నుంచి బయ టపడ్డ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పోటీలో ఉన్నారు. ఇప్పటికే వీరంతా నామినేషన్లు దాఖలు చేసి రంగంలో ఉన్నారు. బీసీ ఓటర్లలో చీలిక టీడీపీకి పరీక్షగానే మారింది. ఇది ఏ స్థాయిలో ఉంటుంది? అది కూడా ఒక్క యాదవ సామాజిక వర్గంలో నేనా లేక మిగతా వర్గాలపై ప్రభావం ఉంటుందా? అనేది టీడీపీ కసరత్తు చేస్తోంది. అధికార వైసీపీలో ఉన్న మైనస్‌లు అంతర్గతంగా ఆ పార్టీపై పొడచూపుతున్నాయి. ఆర్థికంగా వెసులుబాటు ఉన్నప్పటికి ఓటింగ్‌ వచ్చే సరికి ఎలాంటి పరీక్ష ఎదుర్కొవాల్సి వస్తుందోనన్న టెన్షన్‌ వైసీపీలో లేకపోలేదు. ఉంగుటూరులో జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు పూర్తిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి వాసుబాబుతో సై అంటే సై అంటున్నారు. తెలుగుదేశం, బీజేపీ సంపూర్ణ మద్దతుతో తాను గట్టెక్కగల నన్న విశ్వాసంతో ఉన్నారు. వైసీపీలో ఉన్న కేడర్‌ లోపాయి కారిగా మద్దతు ఇస్తుందని జనసేన అంచనా వేస్తోంది. పోలవరంలో నువ్వా నేనా అన్నట్లుగా రణం సాగుతోంది. వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఉపాధ్యాయ వృత్తికి రాజీ నామా చేసి వైసీపీ అభ్యర్థిగా తొలిసారి రంగంలోకి దిగారు. ఆమె భర్త సిట్టింగ్‌ ఎమ్మెల్యే బాలరాజు నాలుగుసార్లు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ పడ్డారు. అయితే ఈ నియోజక వర్గంలో జనసేన పక్షాన చిర్రి బాలరాజు జనంలోకి దూసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కైకలూరులో ఉమ్మడి కూటమి అభ్యర్థి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ ఇప్పటికే అన్నివర్గాలతో సహా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వర్గాలను కూడకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొల్లేరు ఓటర్లే ఈసారి అత్యంత కీలకం. దీంతో అధికార వైసీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఈ విషయంలో అగ్నిపరీక్షే ఎదుర్కొంటున్నారు.

చింతమనేనికే దెందులూరు

వారం రోజులుగా దెందులూరులో ఉత్కంఠకు గురిచేసిన మార్పు, చేర్పు గండం తొలగిపోయింది. ఈ స్థానం నుంచి బీజేపీ పోటీ చేయాలని గట్టి ప్రయత్నాలే చేసినా మంగళ వారం నాటికి అదంతా తేలిపోయింది. టీడీపీ అధిష్ఠానం చింతమనేని ప్రభాకర్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ప్రచారాన్ని నిర్విరామంగా కొనసాగించాల్సిందిగా సూచించింది. ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌కుమార్‌యాదవ్‌ చింతమనేని పక్షాన నిలిచారు. కేడర్‌లోనూ ఆనందం వెల్లివిరుస్తోంది.

నరసాపురం ఇన్‌చార్జ్‌గా తపనాచౌదరి

ఏలూరు లోక్‌సభ స్థానాన్ని ఆశించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనాచౌదరి విషయం లో మంగళవారం బీజేపీ క్లారిటీ ఇచ్చింది. ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి అవకాశం లేక పోవడంతో దెందులూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దింపాలని బీజేపీ ఈ మధ్యనే పట్టుబట్టింది. ఆ మేరకు ఈ నెల 24న నామినేషన్‌ దాఖలు చేసేందుకు చౌదరి సన్నాహా లు చేసుకున్నారు. ఒక్కసారిగా పరిణామాలు మారాయి. దెందులూరును బీజేపీకి కేటాయించడానికి టీడీపీ నో చెప్పడంతో బీజేపీ నాయకత్వం తపనా చౌదరిని నరసా పురం లోక్‌సభ స్థానం బీజేపీ ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మకు చేదోడువాదోడుగా ఉండాల్సిందిగా సూచించింది. భవిష్యత్తులో ఆయనకు అతి పెద్ద బాధ్యతను అప్పగిస్తామని బీజేపీ పెద్దలు వాగ్దానం చేశారు. దీంతో మెత్తబడిన తపనా చౌదరి బుధవారం వేద్దామనుకున్న నామినేషన్‌ను రద్దు చేసుకున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 12:58 AM