Share News

బిల్లులు షాక్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:20 AM

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్‌ శాఖ ఆదాయం గడచిన ఐదేళ్లలో రెట్టింపైంది.

	బిల్లులు షాక్‌

కరెంటు చార్జీలపై జనం కుతకుత

ఐదేళ్లుగా పెరుగుటే తప్ప.. తగ్గింది లేదు

ట్రూ అప్‌, సర్‌ ఛార్జీలంటూ వసూళ్లు

అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు

ప్రజలపై భారం మోపిన ప్రభుత్వం

ఆక్వా రైతులు.. స్థానిక సంస్థల్లో పాట్లు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

విద్యుత్‌ బిల్లు వచ్చిందంటే కడదాంలే అంటూ పక్కన పడేసేవారు. దానికోసం పెద్దగా పట్టించుకునేవారు కాదు. గడువులోగా చెల్లించేసేవారు. ఇప్పుడు బిల్లు వస్తుందంటే చాలు ఆతృతగా చూస్తున్నారు. ఎంతో బిల్లు వచ్చిందో అంటూ ఒకింత గుబులుగా చూసుకుంటున్నారు. బిల్లు చూసి కెవ్వు మంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్‌ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. జనాల్లో విద్యుత్‌ చార్జీలపై నిత్యం చర్చ నడుస్తోంది. ప్రతిపక్షాలు ధర్నాలు చేశాయి. సబ్‌ స్టేషన్‌లు ముట్టడించాయి. యూనిట్‌ ఛార్జీలు పెంచకుండా ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ట్రూ అప్‌ ఛార్జీలు, సర్‌ఛార్జీలు అంటూ బిల్లులు పేలుస్తోంది. శ్లాబ్‌ ధరలను మార్చేసింది. విద్యుత్‌ బిల్లు వంద యూనిట్‌లు దాటితే యూనిట్‌కు దాదాపు రూ.7.50 వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో వంద యూనిట్లు దాటిన వారి సంఖ్య పెరిగింది. ఇంటి అవసరాలు అధికమయ్యాయి. విద్యుత్‌ వినియోగం పెరిగింది. స్లాబ్‌ పద్ధతిలో మార్పులు తీసుకురా వడంతో విద్యుత్‌ బిల్లు దంచికొడుతోంది.

ప్రభుత్వ ఆదాయం రెట్టింపు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యుత్‌ శాఖ ఆదాయం గడచిన ఐదేళ్లలో రెట్టింపైంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 12 లక్షల నివాస, వాణిజ్య కనెక్షన్‌లు వున్నాయి. ప్రతి నెలా రూ.184 కోట్లు ఆదాయం లభిస్తోంది. గతంలో రూ.100 కోట్లు రావడం గగనమయ్యేది. డిస్కమ్‌లకు, ట్రాన్స్‌కోకు ప్రభుత్వం నిధులు కేటాయించేది. వైసీపీ ప్రభుత్వం లో విద్యుత్‌ శాఖకు నష్టాలు రాకూడదంటూ చార్జీలు పెంచేస్తున్నారు. ప్రైవేటుగా తక్కువ ధరకు విద్యుత్‌ లభ్యమయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇతర రాష్ర్టాల నుంచి, ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు. ఆ భారాన్ని విద్యుత్‌ వినియోగదారులపై మోపుతున్నారు. గతం లో ప్రభుత్వాలు ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరిపేవి. వాటికి ముడిసరుకును తక్కువ ధరకు ఇచ్చేలా చర్యలు తీసుకునేవి. వైసీపీ హయాంలో అటువంటి చర్యలు లేవు.ఉత్పత్తి సంస్థల నుంచి అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. ఫలితంగా విద్యుత్‌ బిల్లులు తడిసిమోపెడవుతున్నాయి. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు సంపన్నులకు విద్యుత్‌ భారంగా మారింది. గతంలో రూ.10 వేలు బిల్లు ఇచ్చే ఇంటికి ఇప్పుడు రూ.30 వేల వరకు వస్తోంది.

ఆక్వా అఽధోగతి

విద్యుత్‌ బిల్లులు భారంతో ఆక్వా రంగం పూర్తిగా దెబ్బతింది. యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50లకు ఇస్తున్నట్టు ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. అది కూడా పదెకరా ల్లోపు ఉన్న రైతులకు మాత్రమే పరిమితం చేసింది. అదే నాన్‌ అక్వా జోన్‌ అయితే యూనిట్‌కు రూ.4.75 వసూలు చేస్తున్నారు. జిల్లాలో ఆక్వా రంగానికి దాదాపు 12 వేల విద్యుత్‌ కనెక్షన్‌లున్నాయి. అందులో నాలుగు వేల కనెక్షన్‌లు నాన్‌ ఆక్వా జోన్‌లోకి వెళ్లా యి. వారందరికి విద్యుత్‌ బిల్లులు తడిసి మోపెడవు తోంది. రాయితీ పొందిన ఆక్వా రైతులకు ఇతర రూపాల్లో భారం మోపుతున్నారు. బొగ్గు ధరలు పెరిగాయంటూ అదనపు చార్జీలను వసూలు చేస్తున్నారు. ఇలా ఆక్వా, నాన్‌ ఆక్వా జోన్‌లోనూ యూనిట్‌ ధర రూ.10లకు చేరిపోతోందంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. చార్జీలతోపాటు, ట్రాన్స్‌ఫార్మర్‌ ధర రూ.5 లక్షలు చేశారు. దీంతో జిల్లాలో ఆక్వా రంగం పూర్తిగా దెబ్బ తింది. సాగు పడిపోయింది.

పంచాయతీలకు చీకట్లు

పంచాయతీలకు ఈసారి విద్యుత్‌ షాక్‌ తగిలింది. విద్యుత్‌ ఛార్జీలు పెరిగాయి. సచివాలయాల విద్యుత్‌ బిల్లులను పంచాయతీలే చెల్లిస్తున్నాయి. సర్పంచ్‌లకు సచివాలయాలపై ఎటువంటి అజమాయిషీ లేదు. కార్యదర్శుల పరిస్థితి కూడా అంతే. కానీ సచివాల యాల నిర్వహణ మాత్రం పంచాయతీలు చూడాల్సి వస్తోంది. దీంతో బిల్లులు పెరిగి కట్టలేని పరిస్థితికి చేరుకున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.150 కోట్ల మేర బకాయిలు చెల్లించాలి. గతంలో ప్రభుత్వం బకాయిలు చెల్లించేది. ఆ తర్వాత ఆర్థిక సంఘం నిధులను జమ చేసుకునేది. పంచాయతీలకు ఊరట ఇచ్చేది. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను ముందుగానే మినహాయించుకుంటోంది. విద్యుత్‌ బిల్లులపై కనీసం స్పందించలేదు. ఇతర రూపం లోనూ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు. ఫలితం గా పంచాయతీలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపో యాయి. బిల్లులు చెల్లించకపోవడంతో పంచాయతీ లకు విద్యుత్‌ సరఫరా నిలిపివేసిన సందర్భాలు వున్నాయి. నోటీసులు ఇవ్వకుండానే విద్యుత్‌ను నిలిపి వేశారు. ఇలా పంచాయతీలు ఇబ్బందులు పడ్డాయి.

బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు

ఈ ఐదేళ్లలో విద్యుత్‌ బిల్లు లు విపరీతంగా పెరిగిపోయా యి. బిల్లులు చెల్లించలేక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీలు విద్యుత్‌ బిల్లులు చెల్లించలేని స్థితిలోకి వచ్చేశాయి. ఇక బిల్లులు చెల్లించాలంటూ అధికారులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. నేను ఒక సర్పంచ్‌గా మాట్లాడటం లేదు. సామాన్యురాలిగా, గృహిణిగా చెబుతున్నా. విద్యుత్‌ చార్జీలు త గ్గకపోతే ప్రజలు ఇబ్బందులు పడతారు.

– కోలా శేషవేణి, సర్పంచ్‌, దర్శిపర్రు

Updated Date - Apr 25 , 2024 | 12:20 AM