Share News

ఎన్నికలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - May 12 , 2024 | 12:41 AM

జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉన్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు.

ఎన్నికలకు సర్వం సిద్ధం

జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

భీమవరంటౌన్‌, మే 11 జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధంగా ఉన్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల నిర్వహణపై శనివారం ఆయన పలు విషయాలను తెలిపారు. రీ–పోలింగ్‌కు అవకాశం లేకుండా సార్వత్రిక ఎన్నికలలో హింసకు తావులేని, రీ–పోలింగ్‌నకు అవకాశం ఇవ్వని ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందన్నారు. దేశ సంప్రదాయాలను గౌరవించి ఓటుహక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురి కావొద్దని ప్రతిఒక్కరూ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యవంతులు కావాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రశాంతంగా పోలింగ్‌ సాగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

జిల్లాలో 144 సెక్షన్‌ అమలు

సోమవారం ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో శనివారం సాయం త్రం ఆరు గంటల నుంచి సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందన్నారు. 12వ తేదీన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ నుంచి పోలింగ్‌ యంత్రాలు, సిబ్బందిని పోలింగ్‌ కేంద్రాలకు పంపుతామన్నారు.

ఎగ్జిట్‌ పోల్స్‌ నిషేధం

ఎన్నికల సమయంలో ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచురణ, ప్రసారాలు నిషేధమన్నారు. రాజకీయ పార్టీలు, వారి ప్రతినిధులు ఓటర్ల ను ప్రలోభాలకు గురి చేయరాదని, అలా చేసినట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లావ్యాప్తంగా ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ టీమ్‌లు సమర్థంగా పనిచేస్తున్నాయి.

1,463 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌

జిల్లాలో నూరుశాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్‌ చేసేందుకు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ సరళిని లైవ్‌ ద్వారా జిల్లా కేంద్రంలోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి పర్యవేక్షిస్తాం.

పోలింగ్‌ స్టేషన్లో మౌలిక సదుపాయాలు

వేసవి దృష్ట్యా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల వద్ద షామియానాలు, చల్లటి నీరు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తాం. ప్రధానంగా విద్యుత్తు సౌకర్యం, దివ్యాంగులు, వృద్ధులు సులువుగా కేంద్రంలోకి వెళ్లేందుకు ర్యాంపులు ఏర్పాటు చేశాం. వారికోసం వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాం. ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, క్యూ లైన్ల నిర్వహణ చేపడుతున్నామ న్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది ఇబ్బందులు పడకుం డా మరుగుదొడ్లు, నీటి సౌకర్యం, భోజన వసతి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నాం.

581 వాహనాలు, 12 బోట్లు సిద్ధం

పోలీసుల బందోబస్తు మినహా ఈ ఎన్నికల కోసం 581 వాహనాలు సిద్ధం చేశాం. జీపీఎస్‌ ఆధారిత వాహనాలు పోలింగ్‌ సామగ్రితోపాటు సిబ్బందిని ఆయా కేంద్రాల వద్ద దించడం, పోలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత తీసుకురావడం చేస్తాయి. ఇందుకుగాను 160 ఆర్టీసీ బస్సులు, 260 మినీ బస్సులు, 21 ఇతర వాహనాలు, 11 బోట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రతి రూటుకు ఒక సెక్టార్‌ ఆఫీసర్‌ ఉంటారు. 1,659 మంది పీవోలు, 16మంది ఏపీవోలు, 6,251 మంది ఓపీవోలను ఎన్నికల విధులకు నియమించాం.

రిసెప్షన్‌ కేంద్రాలుగా ఎస్‌ఆర్‌కేఆర్‌, విష్ణు ఇంజనీరింగ్‌ కాలేజీలు

ఎన్నికలలో రిసెప్షన్‌ కేంద్రం వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా పకడ్భందీగా ఏర్పాట్లు పూర్తి చేశాం. వచ్చే నెల నాలుగో తేదీన కూడా ఆయా రిసెప్షన్‌ కేంద్రాల్లో కౌంటింగ్‌ నిర్వహిస్తాం.పోలింగ్‌ సామగ్రి డిస్ట్రిబ్యూషన్‌ కోసం భీమవరం, ఉండి నియోజకవర్గాలకు ఎస్‌ఆర్‌కేఆర్‌ కాలేజీలోనూ, మిగతావి ఆయా నియోజకవర్గ ముఖ్యకేంద్రాల్లో ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి పోలింగ్‌ సామగ్రిని సిబ్బంది వారికి కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు తీసుకువెళ్తారు.

24 గంటలూ కంట్రోల్‌ రూమ్‌

ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు తలెత్తితే సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఓటర్లకు సంబంధించిన సమాచారం కోసం 1950లో సంప్రదించవచ్చు. ఎవరైనా మద్యం, నగదు ఇతర బహుమతులతో ప్రలోభాలకు గురి చేస్తే సీ–విజిల్‌ యాప్‌కు నేరుగా వీడియోలు, ఫొటోలు పంపించవచ్చు. మీ ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లోపే సంబంధిత అధికారులు అక్కడికి చేరుకొని వాటిని అడ్డుకుంటారు. ఎన్నికలు మొదలు పూర్తయ్యేంత వరకు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో అధికారులంతా పర్యవేక్షిస్తారు.

బృందాలతో వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షణ

పోలింగ్‌ డే పర్యవేక్షణ విధానం (పీడీఎంఎస్‌), వెబ్‌ కాస్టిం గ్‌ పర్యవేక్షణ బాధ్యతలను ఆయా బృందాలు నిబద్దత కలిగి నిర్వర్తించాలని స్పష్టం చేశాం. శనివారం జిల్లా కలెక్టరేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి 12 తేదీన పోలింగ్‌ సామగ్రి పంపిణీ, 13న పోలింగ్‌ ప్రక్రియపై జిల్లా కలెక్టరు సమీక్ష నిర్వహించారు.

మూడో ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తి

ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్‌ పర్సనల్‌ మూడో ర్యాండమైజేషన్‌ ప్రక్రియను సాధారణ పరిశీలకులు ఎం.దీప, ఎల్‌.నిర్మల్‌రాజ్‌ పరిశీలనలో పూర్తి చేశామని కలెక్టర్‌ తెలిపా రు. శనివారం కలెక్టరేట్‌ వశిష్ట కాన్ఫరెన్స్‌ హాల్‌లో వారితో కలిసి ఆయన సంయుక్తంగా రాజకీయపార్టీల ప్రతినిధులతో సమావేశమై నియోజకవర్గాల వారీగా ఎన్నికల విధుల్లో పాల్గొనే పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు, మైక్రో అబ్జర్వర్లు మూడో ర్యాండమైౖజేషన్‌ ప్రక్రియ పూర్తి చేశామన్నారు.

రేపు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌

సోమవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభమవుతుంది. అందుకు సిబ్బందికి అన్ని రకాల శిక్షణ ఇచ్చాం. కొన్నిచోట్ల సాయంత్రం ఆరు గంటలు దాటినా క్యూలైన్‌లలో వేచి ఉండే ఓటర్లకు ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తాం.

Updated Date - May 12 , 2024 | 12:41 AM