Share News

నేడే నోటిఫికేషన్‌

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:57 AM

ఏలూరు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీక రణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ వెల్లడించారు. అభ్యర్థులంతా ఎన్నికల సంఘం జారీ చేసిన నియమావళికి లోబడే నామినేషన్లు దాఖలు చేయాలని, దీనిపై వారికి అవగాహన వచ్చేలా అధికారులను అందుబాటులో ఉంచా మని స్పష్టం చేశారు.

నేడే నోటిఫికేషన్‌
మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎస్పీ

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

స్వేచ్ఛగా ఎన్నికలు సాగాల్సిందే

అభ్యర్థులు నియమావళి పాటించాల్సిందే

మీడియాతో కలెక్టర్‌, ఎస్పీ స్పష్టీకరణ

(ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

ఏలూరు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీక రణ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ వెల్లడించారు. అభ్యర్థులంతా ఎన్నికల సంఘం జారీ చేసిన నియమావళికి లోబడే నామినేషన్లు దాఖలు చేయాలని, దీనిపై వారికి అవగాహన వచ్చేలా అధికారులను అందుబాటులో ఉంచా మని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎస్పీ మేరీ ప్రశాంతి, జేసీ లావణ్యవేణి, డీఆర్వో పుష్పమణితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఏమన్నారంటే.. ‘గురువారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. అదేరోజు నుంచి నామినేషన్‌ స్వీకరణ ఆరంభం. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నిర్దేశించిన కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయా నియోజక వర్గాల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. 26న నామినేషన్ల పరిశీలన, 29న నామినేషన్‌ల ఉపసంహరణకు చివరి తేదీ. అదేరోజు నామినేషన్ల తుది జాబితాను ప్రకటిస్తాం. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. నియోజకవర్గ కేంద్రంలో ఉన్న తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే ఎమ్మెల్యే అభ్యర్థులకు నామి నేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్‌ దాఖలు విధానంపై రాజ కీయ పార్టీకి చెందిన ఒక్కొక్కరికి శిక్షణ అందించాం. నామి నేషన్‌ దాఖలు సమయంలో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయ పరిధిలో 100 మీటర్లలోపు అభ్యర్థికి చెందిన మూడు వాహనా లకు మాత్రమే అనుమతి ఇస్తాం. పార్లమెంట్‌, అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశాం. అభ్యర్థులు గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్‌ దాఖలు చేయవచ్చు. పార్లమెంటరీ నియోజకవర్గం కోసం ఫారం –2(ఏ) అసెంబ్లీ నియోజక వర్గం కోసం ఫారం – 2(బి) సమర్పించాలి. పార్లమెంట్‌ నామినేషన్‌ దరఖాస్తుకు రూ.25 వేలు, అసెంబ్లీకి రూ.10 వేలు డిపాజిట్‌ చెల్లించాలి. మంచంమీద ఉన్న నడవ లేని స్థితిలో ఉన్న వారిని గుర్తించి వారి ఇళ్ల వద్దకు వెళ్లి

పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. హోం ఓటింగ్‌ పేరిట వృద్ధులు, దివ్యాంగు లకు ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. వీరంతా కలిసి జిల్లాలో సుమారు 22 వేలు ఉండవచ్చు. అభ్యర్థులు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకే ప్రచారం చేసుకోవాలి’ అని వివరించారు. ఎస్పీ మాట్లా డుతూ ‘ప్రజలు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నాం. ప్రచారంలో వ్యక్తిగత దూషణలు చేయ రాదు. ప్రచారానికి రమ్మని తమకే ఓటు వేయాలని ఎవర్ని భయబ్రాంతులకు గురి చేయరాదు. అలాచేస్తే కేసు నమోదు చేస్తాం. ప్రజలను గందరగోళంలో నెట్టేలా ఎలాంటి ప్రచారం జరగకూడదు’ అని స్పష్టం చేశారు. జేసీ మాట్లాడుతూ ‘ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహణకు అనుమతులు తీసుకోవాలి. కార్యక్రమాలను పాఠశాలలు, మతపరమైన ప్రదేశాల్లో నిర్వహించ కూడదు. అభ్యర్థులు సువిధ పోర్టల్‌ ద్వారా నామినేషన్‌ సమర్పించవచ్చు’ అని పేర్కొన్నారు.

కూటమి అభ్యర్థులు వీరే..

ఏలూరు–బడేటి చంటి, ఉంగుటూరు– పత్సమట్ల ధర్మరాజు, నూజివీడు–కొలుసు పార్థసారథి, కైకలూరు–డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌, పోలవరం– చిర్రి బాలరాజు, చింతల పూడి–సొంగా రోషన్‌కుమార్‌, దెందులూరు–చింతమనేని ప్రభాకర్‌

వైసీపీ అభ్యర్థులు..

ఏలూరు–ఆళ్ళ నాని, ఉంగుటూరు–పుప్పాల వాసుబాబు, దెందులూరు– కొఠారు అబ్బయ్య చౌదరి, పోలవరం– రాజ్యలక్ష్మి, కైకలూరు–దూలం నాగేశ్వరరావు, నూజివీడు – మేకా ప్రతాప్‌ అప్పారావు, చింతలపూడి–విజయ్‌రాజు

కాంగ్రెస్‌ అభ్యర్థులు

ఏలూరు–బండి వెంకటేశ్వరరావు (సీపీఐ), ఉంగుటూరు– హరికుమార్‌రాజు, దెందులూరు–ఆలపాటి నరసింహమూర్తి, పోలవరం–డి.సృజన, చింతలపూడి– ఉన్నమట్ల ఎలీజా, కైకలూరు–బొడ్డు నోబుల్‌, నూజివీడు– మరీదు కృష్ణ

ఎంపీ అభ్యర్థులు..

1. కూటమి అభ్యర్థి పుట్టా మహేష్‌కుమార్‌ యాదవ్‌

2. కారుమూరి సునీల్‌కుమార్‌ (వైసీపీ)

3. కావూరి లావణ్య (కాంగ్రెస్‌)

అన్నిపక్షాల్లోనూ ఒకే టెన్షన్‌

మిత్రపక్ష కూటమి పరస్పర సహకారం.. అధికార వైసీపీ ఎత్తుగడే వేరు

సాధారణ ఎన్నికలకు వీలుగా నామినేషన్ల పర్వం నేటినుంచి ఆరంభం. ఇప్పటికే ప్రధాన పక్షాల్లో నువ్వానేనా అన్నట్లుగా ప్రచారసరళి సాగింది. వ్యక్తిగత దూషణలు పక్కన పెట్టి ప్రధాన పార్టీల అధినేతలే టార్గెట్‌గా సీఎం జగన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్‌ చుట్టూనే ప్రచార సరళి సాగింది. ఎన్నికల షెడ్యూల్‌ గతనెలలోనే విడుదలైంది. ఇక నామినేషన్‌లకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష తెలుగుదేశం ఇప్పటికే ఏలూరు జిల్లా వ్యాప్తం గా తన అభ్యర్థులను మోహరించింది. నువ్వానేనా అన్నట్లుగా అధికార పక్షంతో వీరంతా నేరుగానే ఢీకొంటున్నారు. ఏలూరు లోక్‌సభ స్థానానికి తెలుగు దేశంకు చెందిన జనసేన, బీజేపీ బలపరిచిన కూటమి అభ్యర్థిగా పుట్టా మహేష్‌ కుమార్‌ను రంగంలోకి దింపారు. రాజకీయాలకు కొత్త అయినా వ్యూహరచనలో దిట్టగా పేరొందిన మహేష్‌కుమార్‌ యాదవ్‌ ఇప్పటికే లోక్‌సభ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలను చుట్టుముట్టారు. నామినేషన్‌ వేసేందుకు వీలుగా ఆయన తగిన ముహూర్తం ఖరారు చేస్తున్నారు. ఇక ఏడు అసెంబ్లీ నియోజక ర్గాలకు సంబంధించి అభ్యర్థులు, మిత్రపక్ష కూటమి తరపున ఇప్పటికే రంగంలో ఉన్నారు. ఏలూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం బలపరిచిన కూటమి అభ్యర్థిగా బడేటి చంటి, గడపగడపకు వెళుతూ ఓటర్లను కలుస్తున్నారు కైకలూరు నుంచి బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ పోటీలో ఉన్నారు. ఆయన తన ప్రధాన ప్రత్యర్థి వైసీపీకి చెందిన దూలం నాగేశ్వరరావుతో ఢీకొనేలానే ప్రచారం చేసి ఇప్పుడు నామినేషన్‌ దిశగా ముందుకు సాగుతున్నారు. నూజివీడు నియోజకవర్గంలో మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడిగా ఆయన పక్షాన నిలిచింది. రాజకీయ అనుభవంతో పాటు అందర్ని కలుపుకుపోయే ధోరణిలో పార్థ సారథి నియోజకవర్గంలో ఇప్పటికే ఆత్మీయ సమా వేశాలు, పరస్పర బేటీలతో నిమ గ్నమై ఆర్భాటంగా నామినేషన్‌ వేసేందుకు ఇప్పటికే ముహుర్తం ఖరారు చేసుకు న్నారు. ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పత్సమట్ల ధర్మరాజు రంగంలో ఉన్నారు. ఆయన కూడా పెద్దఎత్తున నామినేషన్‌ వేయాలని భావిస్తున్నారు. పోలవరంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు ఇదే దశలో ఉన్నారు. చింతలపూడిలో ఉమ్మడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్‌ మారు మూల పల్లెల్లోను ప్రచారంలో హోరెత్తించారు. తమ ప్రత్యర్థికి దీటుగా వ్యూహ ప్రతి వ్యూహాల్లో ముందు ఉన్నారు. నామినేషన్‌ రోజునే సత్తా చాటాలని భావిస్తున్నారు.

దెందులూరు ఏమవుతుందో? :

దెందులూరు నియోజకవర్గం నుంచి మాస్‌లీడర్‌ చింతమనేని ప్రభాకర్‌ను ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఇంతకు ముందే ప్రకటించారు. కాని ఈ స్థానంలో బీజేపీ రాష్ట్రప్రధాన కార్యదర్శి తపనా చౌదరిని రంగంలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తోంది. అందుకనే ప్రధాన పక్షాల అధినాయకత్వాలు కూటమి నాయకత్వం దీనిపై సుధీర్ఘ కసరత్తే చేశాయి. బుధవారం పొద్దుపోయిన తర్వాత లేదా గురువారం ఉదయం కీలకపరిణామాలు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. తపనా చౌదరి కూడా దెందులూరు నుంచే పోటీ చేయబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

ఇక అంతా ఎన్నికల అధికారుల అదుపు ఆజ్ఞలలోనే..

నోటిఫికేషన్‌ అనంతరం అభ్యర్థుల కదలికలు, ప్రచారం, వ్యయం, కామెంట్లు, ప్రకటనలు ఎన్నికల అధికారుల కనుసన్నల్లో సాగబోతున్నాయి. అభ్యర్థుల ఖర్చు, నామినేషన్‌ దాఖలు సమయంలో పాటించా ల్సిన నియమాలు, ఇవన్నీ క్రమబద్ధీకర ణకు వస్తాయి. ప్రతి అంశాన్ని ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుంది. ఆఖరికి నామినేషన్‌ దాఖలు సమయంలోనూ రిటర్నింగ్‌ అధికారి వద్దకు అభ్యర్థితో పాటు మరో నలుగురుని మాత్రమే అనుమతిస్తారు. ప్రదర్శనగా రావడానికి ప్రత్యే కించి అనుమతులు తీసుకోవాలి. కేవలం పది వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వబోతున్నారు. అభ్యర్థుల ఖర్చు, ఎంపీ స్థానానికి అయితే రూ.90 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థులకు అయితే రూ.40 లక్షలు మాత్రమే గరిష్ఠంగా అనుమతి ఇస్తారు. ప్రధా న పక్షాలు, గుర్తింపు పొందిన పక్షాలకు చెందిన అభ్యర్థులు నామినేషన్‌ పత్రాల్లో నలుగురు ప్రపోజల్స్‌ను చూపించాలి. అదే ఇండిపెండెంట్‌లు అయితే పదిమంది ప్రపోజల్స్‌ను చూపించాల్సిందే.

Updated Date - Apr 18 , 2024 | 12:57 AM