మహిళలకు తెలియకుండానే రుణాలు
ABN , Publish Date - Apr 03 , 2024 | 12:06 AM
తణుకు మండలం దువ్వ డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలకు తెలియకుండా వారి పేరు మీద రుణాలు తీసుకొని సొమ్ము కాజేసిన సీఏ భాగ్యలక్ష్మి భాగోతం వెలుగుచూసింది.

దువ్వలో డ్వాక్రా సభ్యుల సొమ్ము కాజేసిన సీఏ
బ్యాంకు వద్ద ఆరిమిల్లి సహా బాధితుల ధర్నా
తణుకు, ఏప్రిల్ 2 : తణుకు మండలం దువ్వ డ్వాక్రా పొదుపు సంఘాల మహిళలకు తెలియకుండా వారి పేరు మీద రుణాలు తీసుకొని సొమ్ము కాజేసిన సీఏ భాగ్యలక్ష్మి భాగోతం వెలుగుచూసింది. మంగళవారం పలువురు డ్వాక్రా మహిళలు దువ్వ యూనియన్ బ్యాంకు వద్ద పలు సంఘాల బాధిత మహిళలు ఆందోళనకు దిగారు. క్లస్టర్ ఏజెంట్(సీఏ) భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో 45 డ్వాక్రా సంఘాలున్నాయి. ఒక్కో గ్రూపులో పది మంది మహిళలు ఉన్నారు. ఈ సంఘాల రుణాలు, పొదుపు చెల్లింపులు తానే చూస్తుంది. సభ్యులకు తెలియకుండా వీరి గ్రూపు రుణాలు, సీసీఎల్ రుణాల పేరు తో భారీగా అక్రమాలకు పాల్పడింది. ఒక్కో గ్రూపులోని ఇద్దరేసి సభ్యుల పేర వారికి తెలియకుండానే బ్యాంకులో వ్యక్తిగత రుణాలు తీసుకునేది. ఈ సొమ్ము ఈ సభ్యుల ఖాతాలో పడ గానే.. పొరపాటున వేరే ఖాతాలో పడాల్సిన సొమ్ము మీ అకౌంట్‌లో పడిందని చెప్పి.. ఆ మొత్తాన్ని తన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేయించుకునేది. బాగా తెలిసిన వ్యక్తి కావడం.. అందరికీ తలలో నాలుకలా ఉండడంతో ఆమెను అంతా నమ్మారు. కొంత కాలంగా తన స్వలాభం కోసం రుణాలు పెట్టుకుంటూ అక్రమాలకు పాల్పడింది. కొంత కాలంగా బ్యాంకు ఖాతా పుస్తకాలు ప్రింటింగ్ చేయకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఆయా అకౌంట్‌లలో నగదు విత్ డ్రా చేసింది. పాస్ బుక్‌ల్లో కొంత కాలంగా ప్రింటింగ్ చేయకపోవడంతో సిబ్బందిని మహిళలు ప్రశ్నించారు. దీంతో ప్రింట్ చేయడంతో అకౌంట్‌ల నుంచి భారీ స్థాయిలో నగదు విత్ డ్రాల విషయం బయటపడింది. దీనిపై సీఏ భాగ్యలక్ష్మిని మహిళలు నిలదీయడంతో విషయం గ్రామ పెద్దల వరకు వెళ్లింది. గ్రూపు సభ్యుల నుంచి తానే నగదు తీసుకున్నట్లు ఆమె ఒప్పుకుంది. ఒక్కో ఖాతా నుంచి ఆమె లక్ష నుంచి రెండు లక్షల వరకు విత్ డ్రా చేసినట్లు చెబుతున్నారు. ఈ మొత్తం సుమారు రూ.40 లక్షలు పైమాటేనంటున్నారు.
అన్ని ఖాతాలు తనిఖీ చేయాలి : ఆరిమిల్లి
ఈ విషయం ఎంతకూ తేలకపోవడంతో బాధితులంతా మంగళవారం బ్యాంకును ముట్టడించారు. వీరికి మద్దతుగా తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘అక్ర మాలు జరిగిన ఈ 45 బ్యాంకు ఖాతాలను తనిఖీ చేయాలి. ఐదేళ్లుగా దువ్వలో ఎంత దోపిడి జరిగిందో తెలుసుకోవాలి. రుణాలు తీసుకున్న వారే తిరిగి చెల్లించాలి. దీని వెనుక ఎవరు ఉన్నారో గుర్తించాలి. మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. రుణాలు, వాయిదాల చెల్లింపుల విషయంలో మినహాయింపు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. డ్వాక్రా సంఘాల సొమ్ము కాజేసిన ఘటనపై దర్యాప్తు చేయాలని మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు అధికారులను కోరారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ప్రతి పైసా తిరిగి మహిళల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు.