Share News

మా మాటే చెల్లాలి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:01 AM

అధికార వైసీపీలో చింతలపూడి నియోజకవర్గంలో తరచు తగాదాలు ఆ పార్టీలో కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి.

మా మాటే చెల్లాలి

చింతలపూడిలో గ్రూప్‌ ఫొటో వివాదం

వైసీపీలో రాజీనామా బెదిరింపులు

ఏలూరుకు చేరిన పంచాయితీ

తమ మాట చెల్లుబాటు కావడం లేదని ఒకరిద్దరు అలుగుతారు. ఇంకొంద రేమో రాజీనామా చేస్తున్నట్టు సోషల్‌ మీడియాలో లీక్‌లిస్తారు. ఇంకొంద రేమో అంతా మా డైరెక్షన్‌లోనే జరగాలని గీత గీస్తారు. గ్రూపులు కట్టి... గ్రూప్‌ ఫొటోలు దిగు తారా అంటూ ఇంకొందరు నేతలు మొహం చాటే స్తారు... ఇదంతా చింతలపూడి వైసీపీలో రోజువారీ సీన్‌. అది కాస్తా ముదిరి గురువారం ఎంపీ కోటగిరి సమక్షంలో పంచాయితీకి దారితీసింది. ఆళ్ళ నాని ఇంట కూడా ఇదే సీన్‌ సాగింది.

– ఏలూరు – ఆంధ్రజ్యోతి ప్రతినిధి

ఫ్యాన్‌ కింద సెగలు.. పొగలు

అధికార వైసీపీలో చింతలపూడి నియోజకవర్గంలో తరచు తగాదాలు ఆ పార్టీలో కొత్త తలనొప్పులు సృష్టిస్తున్నాయి. పార్టీ అభ్యర్థి కంభం విజయరాజు తాము చెప్పినట్టుగానే నడుచుకోవాలని దీనికి విరుద్ధంగా మరెవరితోనూ అంటకాగకూడదని కొందరు సీనియర్లు మోకాలడ్డుతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎలీజాను కాదని విజయరాజును అభ్యర్థిగా ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఏదో రూపంలో వివాదం చెలరేగుతూనే వచ్చింది. ఎలీజా కొన్నాళ్లు తీవ్ర అసంతృప్తి, అసహనంతో వైసీపీ చేష్టలను నిలువరించే ప్రయత్నం చేశారు. తనను కాదని పోటీ చేసే అభ్యర్థి చేతే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయించడం ఏమిటని విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యేగా తానున్నానన్న విషయం మరిచి అలా ఎలా వ్యవహరిస్తారంటూ నిగ్గదీశారు. దీంతో వైసీపీ నేతలు దిగివచ్చి ఈ తరహా కార్యక్రమాలకు దూరంగా జరిగారు. ఇదే తరుణంలో ఎలీజా బదులుగా అభ్యర్థిగా రంగంలో వున్న విజయరాజు తాము చెప్పినట్లే వ్యవహరించాలని కొందరు ఆది నుంచి పట్టుబడుతున్నట్టు ఆ పార్టీ వర్గాలే చర్చిస్తున్నాయి. చింతలపూడికి చెందిన ఒక సీనియర్‌ నేత నా మాటే చెల్లాలని, లేకుంటే నీకే నష్టం అంటూ వార్నింగ్‌ ఇచ్చినట్టు ఈ వర్గాల్లో నానుతోంది. దీనికి తగ్గట్టుగానేగురువారం సోషల్‌ మీడియాలో పుంఖానుపుంఖాలుగా పార్టీ సీనియర్‌ నేత అశోక్‌ రాజీనామా చేసినట్టు ప్రచారం జరిగింది. ఇంకేముంది ఆయన రాజీనామాతో అల్లకల్లోల పరిస్థితులు నెలకొంటాయని ఇంకొందరు బాకా ఊదారు. వైసీపీలోని కొందరు ఈ మధ్యనే పార్టీలో ఒక పెద్దాయన దగ్గరకు వెళ్లి గ్రూప్‌ ఫొటో దిగారు. ఇది కాస్తా నచ్చని అశోక్‌ ఎవరంతట వారుగా ఇష్టానుసారం ఎలా ప్రవర్తి స్తారంటూ నొచ్చుకున్నారు. ఆయన రాజీనామా చేస్తున్నట్టుగా కొందరు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏకంగా పార్టీకి రాజీనామా చేయడమే కాదు.. ఏ పార్టీకి వెళ్తారో ప్రచారం సాగింది. అశోక్‌ రాజీనామా వదంతులతో వైసీపీలో చింతలపూడి రాజకీయాలు వేడెక్కాయి. ఆ వెంటనే సీనియర్లంతా అసలేం జరిగిందంటూ పొద్దుట నుంచి రాత్రి పొద్దుపోయే వరకు ఆరా తీస్తూనే వచ్చారు. సొసైటీ చైర్మన్లు , పార్టీ అనుకూలురు అటూ ఇటూ మారిపోతున్నారంటూ గందరగోళం సృష్టించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

తగ్గండి... మాట వినండి

పార్టీలో అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాలను రోడ్డుమీదకు తీసుకురావడం ఏమాత్రం ఇష్టం లేని సీనియర్లు, జగన్‌ దూతలు తక్షణం స్పందించారు. రాజీనామా చేస్తున్నట్టు జరిగిన ప్రచారాన్ని ధ్రువీకరించుకోవాలని, అదేలోపు అశోక్‌తో పాటు మిగతా నేతలను పిలిపించి మాట్లాడాలని ఆదేశాలందాయి. దీంతో మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ నాని తొలుత స్పందించి చింతలపూడి నేతలను ఏలూరుకు రప్పించి చర్చించారు. ఇది చాలదన్నట్లుగా సాయంత్రం ఎంపీ కోటగిరి శ్రీధర్‌ నివాసంలోని ఇదే విషయంలో సుదీర్ఘ మంతనాలు జరిగాయి. మాటవరసకు అనే విషయాలను సీరియస్‌గా తీసుకోకూడదని, రాజీనామా అస్త్రాలు సంధిస్తా మని, పరోక్ష సంకేతాలివ్వడం ఏమాత్రం తగదని, అంతా కలిసి మెలసి నడవాల్సిం దేనని చిన్నపాటి క్లాస్‌ పీకినట్టు చెబుతు న్నారు. నియోజక వర్గానికి చెందిన కొందరు నేతలు ఏలూరులో జరిగిన సమావేశానికి హాజరయ్యారు.

ఎలీజా ఏం చేయబోతున్నారు..

ఒకవైపు వైసీపీలోని అంతర్గత తగాదాలు కొనసాగుతూనే ఉండగా, మరోవైపు ఇదే పార్టీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్‌ లో చేరిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎలీజా ఏం చేయబోతున్నారన్న దానిపై చిలువలు పలువలగా ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్‌ పక్షాన ఆయన ఎన్నికల బరిలో ఉంటారని కొందరు, ఈ ఐదేళ్ల పాటు ఆయనకు సన్నిహితులుగా ఉన్న కొందరు వైసీపీ విజయావకాశాలను అడ్డుకునేలా కీలకంగా వ్యవహ రిస్తారని సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఎలీజా తనను అవమానించిన వైసీపీ పై మండిపడుతున్నారు. సాధ్యాసాధ్యాలను అంచనా వేసి తొలుత తెలుగుదేశంలో చేరాలని ఆయన భావించినట్టు టీడీపీ వర్గాలే లీకేజీలిచ్చాయి. చాన్నాళ్ల పాటు ఎమ్మెల్యే ఏ పార్టీలో చేరతారనేదానిపై తర్జనభర్జన సాగింది. కానీ తాజాగా కాంగ్రెస్‌ పక్షాన పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతుండడంతో ఒక వేళ ఇదే నిజమైతే వైసీపీ ఓటు బ్యాంకు చాలాచోట్ల గండి పడుతుందని ఇంకొందరు అంచనా వేస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గమైన చింతలపూడి రాజకీయాలు ఆది నుంచి కొందరి చేతుల్లోనే కొనసాగడం ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితినే అధికార వైసీపీ అభ్యర్థే స్వయంగా ఎదుర్కొవడం సరికొత్త రాజకీయ పరిణామం.

Updated Date - Mar 29 , 2024 | 12:01 AM