Share News

దెందులూరు ఎవరిది ?

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:28 AM

తెలుగుదేశం అభ్యర్థులకు ఆదివారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీ–ఫాం అందజేశారు. నియోజకవర్గాల్లో ప్రచారంలో ఎలాంటి మెలకువలు పాటించాలో గీతోపదేశం చేశారు.

దెందులూరు ఎవరిది ?

ఈ నియోజకవర్గంలో రోజుకో సీరియల్‌ కథ

రకరకాల సంకేతాలతో కేడర్‌ విలవిల

చింతమనేనికే సీటు ఖాయమంటూ టీడీపీ వర్గాల ధీమా

మాకే ఛాన్స్‌ ఉంటుందంటూ బీజేపీ హడావుడి

ఆదివారం బీ–ఫాం అందుకోని చింతమనేని..

నేడు కూటమి నాయకత్వం కీలక నిర్ణయం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

తెలుగుదేశం అభ్యర్థులకు ఆదివారం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీ–ఫాం అందజేశారు. నియోజకవర్గాల్లో ప్రచారంలో ఎలాంటి మెలకువలు పాటించాలో గీతోపదేశం చేశారు. ఇంకొందరికి అదనంగా సూచనలు ఇచ్చారు. అయితే వారం రోజులుగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న దెందులూరు స్థానం నుంచి ఎవ్వరికి బీ–ఫాం ఇవ్వలేదు. ఈ నియోజక వర్గం నుంచి దఫదఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు బీ–ఫాం ఇవ్వకపోవడంతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర నిరాశ చెందారు. ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తారని, ఇక్కడ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి పోటీ చేస్తారని వారం రోజులుగా పెద్ద దుమారం చెలరేగుతోంది. దీంతో ఈ స్థానం చింతమనేనిదా.. తపనా చౌదరిదా? అన్న సందిగ్ధత మధ్యనే ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఉత్కంఠతో ఉన్నారు.

అసలు ఇంతకీ ఏమైంది..

దెందులూరు నియోజకవర్గంలో తిరుగులేని నేతగా, చాలా కాలం నుంచి పార్టీనే అంటిపెట్టుకుని మాస్‌లో మంచి ఇమేజ్‌ ఉన్నఉన్న చింతమనేని ప్రభా కర్‌కు ఈ మధ్య చిక్కులు ఎదురవుతున్నా ఇప్పటికే ప్రచారంలోనూ, నామి నేషన్‌ దిశగా ముందడుగులు వేస్తూ వచ్చారు. గ్రామ గ్రామనా పార్టీ కేడర్‌ను ఉత్తేజపరుస్తూ సమాంతరంగా పార్టీలో కొత్తగా చేరుతున్న వారిని అక్కున చేర్చుకుంటున్నారు. వైసీపీకి దీటుగా బదులిచ్చే విధంగా ఆయన వ్యూహం కొనసాగుతూ వచ్చింది. తెలుగుదేశంలో తిరుగేలేదనుకున్న చింతమనేని పోటీకి సిద్ధంగా ఉన్న నియోజకవర్గం దెందులూరులో ఆకస్మికంగా మార్పులు జరగ బోతున్నాయంటూ వచ్చిన సంకేతాలు కేడర్‌లో తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని కలిగించింది. నియోజకవర్గంలో పార్టీకి అడుగడుగునా తిరుగులేని నాయకత్వం, గ్రామగ్రామాన కార్యకర్తల బలం ఉంది. ఎంపీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగిన ప్రభాకర్‌ ఒక్క దెందులూరే కాకుండా ఇరుగుపొరుగు నియోజక వర్గాలపైన తన ప్రభావం చూపిస్తారు. ఆయన అభిమానులంతా ఆయన ఎటు చెప్తే అటు నడుస్తారు. అలాంటి నియోజక వర్గాన్ని బీజేపీ ఆశిస్తున్నట్టు సమాచారం బయటకు పొక్కింది. బీజేపీ అనపర్తి నియోజకవర్గంతో ముడిపెట్టి ఆ స్థానాన్ని తెలుగుదేశం తిరిగి తీసుకోదలిస్తే ఉంగుటూరు లేదా దెందులూరు తమ పార్టీకి కేటాయించాలని తేల్చిచెప్పింది. ఏలూరు ఎంపీ స్థానాన్ని ఆశించిన తపనా చౌదరిని సంతృప్తి పరిచేందుకు బీజేపీ కేంద్రపెద్దలు, రాష్ట్రనాయకత్వం టీడీపీ నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి చేసింది. తెలుగుదేశం ఇప్పటికే ఉంగుటూరు స్థలాన్ని జనసేనకు కేటాయించినందున మార్పులు, చేర్పులు ఉండవని జనసేనాని పవన్‌ తెగేసి చెప్పారు. ఇక మిగిలింది దెందులూరు కావడం, తపనా చౌదరికి ప్రత్యామ్నాయంగా ఏదో ఒక సీటు కాకుండా దెందులూరు కోసమే బీజేపీ కట్టుబడుతూ వచ్చింది. మూడురోజులుగా అయితే ఈ విషయం మరింత ముదిరి దెందులూరు స్థానం టీడీపీ చేతిలోనే ఉంటుందా? లేక? బీజేపీకి మళ్ళుతుందా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. చింతమనేని సోమవారం నామినేషన్‌ వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపఽథ్యం లోనే శనివారం అమరావతికి వచ్చి బీ–ఫాం అందుకోవాల్సిందిగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సంకేతం వచ్చింది. దీంతో చిక్కుముడి వీడిందని ప్రభా కర్‌తో పాటు ఆయన అనుచర గణమంతా సంతృప్తి పడింది. ఇదే క్రమంలో బీజేపీ నుంచి కూడా తపనా చౌదరికి ఒక్కరోజు ఆగండి నిర్ణయం మనవైపే ఉంటుంది మిగిలిన ఏర్పాట్లు చేసుకోండి అంటూ సంకేతాలు వెల్లువడ్డాయి. ఆదివారం చింతమనేని ప్రభాకర్‌కు తప్ప రాష్ట్రంలో మిగతా తెలుగుదేశం అభ్యర్థులందరికీ చంద్రబాబు బీ–ఫాం లు అందజేశారు. దీంతో మళ్ళీ దెందు లూరు నియోజక వర్గంపై టీడీపీ కేడ ర్‌లో అనుమానపు పొర ఏర్పడింది. మరోవైపు చింతమనేని దెందులూరు లో పోటీ చేసేలా చంద్రబాబు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌ గట్టిగా పట్టుబట్టారు. ఈ వివాదం ఆదివారం తేలిపోతుందని అంతా భావించినా మరోసారి నిర్ణయం వాయిదా పడింది. టీడీపీ సీనియర్లు అంతా దెందులూరు చింతమనేనికి ఖాయం అవుతుందని, తొలుత తీసుకున్న నిర్ణయం మారబోదని చెబుతూనే వస్తున్నారు. అనపర్తి నియోజకవర్గ సమస్య ఆదివారం ఒక్క కొలిక్కి వచ్చింది. దీంతో దెందులూరు సస్పెన్స్‌కు సోమవారం తెరపడబోతుందని చెబుతున్నారు. ఇదే తరుణంలో బీజేపీ నిర్ణయం కూడా అమల్లోకి వస్తుందనే ఆశతో తపనా చౌదరి ఉన్నారు.

Updated Date - Apr 22 , 2024 | 12:28 AM