Share News

అంతా కల్తీ

ABN , Publish Date - Jan 28 , 2024 | 12:21 AM

ప్రజల ఆరోగ్యంతో హోటళ్లు, రోడ్‌సైడ్‌ ఫుడ్‌ సెంటర్‌లు చెలగాటం ఆడుతున్నాయి. లాభార్జనే ధ్యేయంగా వ్యాపారాలు నడిపిస్తున్నారు. అరికట్టాల్సిన అధికారులు గాఢ నిద్రపోతున్నారు.

అంతా కల్తీ

గాఢ నిద్రలో అధికారులు

తూతూ మంత్రంగా తనిఖీలు

ఆహార పదార్థాల్లో రసాయన పౌడర్ల వినియోగం

విపరీతంగా పెరిగిన రోడ్‌సైడ్‌ ఫుడ్‌ సెంటర్లు

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం

జంగారెడ్డిగూడెం, జనవరి 27 : ప్రజల ఆరోగ్యంతో హోటళ్లు, రోడ్‌సైడ్‌ ఫుడ్‌ సెంటర్‌లు చెలగాటం ఆడుతున్నాయి. లాభార్జనే ధ్యేయంగా వ్యాపారాలు నడిపిస్తున్నారు. అరికట్టాల్సిన అధికారులు గాఢ నిద్రపోతున్నారు. కస్టమర్లను ఆకట్టుకునేందుకు రసాయనిక పౌడర్‌లు సైతం ఆహార పదార్థాల్లో వాడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదు. ఫలితంగా క్రమేపీ ప్రజల ఆరోగ్యం క్షీణిస్తోంది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో హోటళ్లు, రెస్టారెంట్‌లు, రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ సెంటర్లు పుట్టగొడుగున్నా వెలిశాయి. నిబంధనలకు పాతర వేస్తూ వాటిని నిర్వహించి ప్రజారోగ్యానికి భంగం కలిగిస్తున్నారు. ముఖ్యంగా తినుబండారాల తయారీలో ప్రమాదకరమైన రసాయనిక పౌడర్లు వాడడం వల్ల ఆకర్షణీయంగా కన్పిస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రజల ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా సదరు వ్యాపారులు ఆ పౌడర్‌లను ఆహార పదార్థాల్లో కలుపుతున్నారు. ఇదంతా తెలిసినా అధికారులు పట్టించుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇటీవల విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఫుడ్‌ అండ్‌ సేఫ్టీ అధికారులు జంగారెడ్డిగూడెం, ఏలూరుల్లోని రెస్టారెంట్‌లలో తనిఖీలు చేసినప్పుడు ప్రమాదకర కృత్రిమ పౌడర్‌లను గుర్తించారు. జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్‌లలో రంగులు మార్చే రసాయనాలను వాడుతున్నారు. పానీ పూరీ, ఫ్రైడ్‌రైస్‌, చాట్‌, చికెన్‌ పకోడి వంటి రోడ్‌సైడ్‌ ఫుడ్‌ సెంటర్లు పట్టణాల్లో విపరీతంగా పెరిగాయి. వాటిని తినే వారు ఎక్కువగా ఉండడంతో వాటికి డిమాండ్‌ పెరిగింది. ఈ క్రమంలో కనీస జాగ్రత్తలు, శుభ్రత, నాణ్యత వంటివి పాటించకుండా నాసిరకం, నిల్వ, అపరిశురఽభంగా ఉండే ఆహార పదార్థాలను సైతం విక్రయాలు సాగిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన సంబంధిత అధికారులు కంటికి కన్పించకపోవడంతో ఇటువంటి వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం వాణిజ్య కేంద్రంగా ఉంది. ఇక్కడ విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, ఉపాధి, వ్యాపారాలకు అనువుగా ఉంది. చుట్టుపక్కల సుమారు 100 గ్రామాలకు చెందిన ప్రజలు ఇక్కడకు వచ్చి వెళ్తుంటారు. చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే వారు, విద్యార్థులు పట్టణంలోనే అద్దెకు ఇళ్లను తీసుకుని ఇక్కడ ఉంటున్నారు. మరోవైపు ఏజెన్సీలోని ఉద్యోగులంతా పట్టణంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఉంటున్నారు. ఈ క్రమంలో పట్టణంలో హోటళ్లు, కర్రీ పాయుంట్‌లు, రోడ్‌ సైడ్‌ ఫుడ్‌ సెంటర్లకు డిమాండ్‌ పెరిగింది. ఇదే అదనుగా హోటళ్లు, ఫుడ్‌ సెంటర్‌ల నిర్వాహకులు నిబంధనలు పాటించకుండా వ్యాపారాలు సాగిస్తున్నారు. ఇప్పటికైనా ఫుడ్‌ సెంటర్‌లు, హోటళ్లపై అధికారులు పర్యవేక్షణ చేయాలని కోరుతున్నారు.

ఆహార భద్రత అధికారుల తనిఖీలు

ఆహార పదార్థాల్లో నాణ్యత, శుభత్ర లేకుంటే చర్యలు తీసుకుంటామని జిల్లా ఆహార భద్రత అధికారులు కావ్యరెడ్డి, రామరాజు హెచ్చరించారు. జంగారెడ్డి గూడెంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్‌, స్వీట్‌ స్టాల్స్‌ దుకాణాల్లో శనివారం ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేశారు. న్యూ భక్తాంజనేయ స్వీట్స్‌ అండ్‌ బేకరీ, శ్రీ అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్‌, రాజు ఫుడ్‌కోర్ట్‌, బామ్మ రెస్టారెంట్‌, కాజా పంతులు హోటల్‌, సాయిబాలాజీ ఎంటర్‌ప్రైజెస్‌, జేబీ గ్రాండ్‌ రెస్టారెంట్‌లలో తనిఖీలు చేసి బూందీ లడ్డు, చికెన్‌ ఫ్రై, చికెన్‌ బిర్యానీ, మినప గుండ్లు, బన్సీరవ్వ, కందిపప్పు, పెసర పప్పు, వేరుశెనగ, మైదా పండి మొత్తం 10 రకాలైన శ్యాంపుల్స్‌ను సేకరించి హైదరాబాద్‌ ల్యాబ్‌కు తరలించారు. మరో 15 రోజుల్లో ల్యాబ్‌ రిపోర్టును పట్టి చర్యలు ఉంటాయని అధి కారులు తెలిపారు. హోటళ్లలో గుర్తించిన కలర్‌ పౌడర్‌లను ధ్వంసం చేశామన్నారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోల్‌ ఎం.శ్రీనివాసరావుకు ఫోన్‌ 98483 16338కు సమాచారం ఇవ్వాలన్నారు. హోటళ్లు, రెస్టారెంట్‌ నిర్వాహకులు నాణ్యతతో ఆహార పదార్థా లను తయారు చేయాలని, వంటశాల పరిశుభ్రంగా ఉండాలని, ఫ్రిజ్‌లలో మిగులుపదార్ధాలను నిల్వ ఉంచ వద్దని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 12:21 AM